దాని 4
4
రాజు కల
1లోకమంతటిలో నివసించే అన్ని దేశాల ప్రజలకు, వివిధ భాషలు మాట్లాడే వారికి రాజైన నెబుకద్నెజరు ఇలా రాస్తున్నాడు. “మీకందరికీ పూర్ణ క్షేమం కలుగు గాక. 2సర్వశక్తిమంతుడైన దేవుడు నా విషయంలో జరిగించిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయాలని నా మనస్సుకు తోచింది. 3ఆయన చేసే సూచక క్రియలు బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వతంగా ఉండేది. ఆయన అధికారం తరతరాలకు నిలుస్తుంది.”
4నెబుకద్నెజరు అనే నేను నా నగరంలో క్షేమంగా, నా ఇంట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక రాత్రి నాకు భయంకరమైన కల వచ్చింది. 5ఆ కల వల్ల మంచం మీద పండుకుని ఉన్న నా మనస్సులో పుట్టిన ఆలోచనలు నన్ను కలవరపెట్టాయి. 6కాబట్టి ఆ కలకు అర్థం చెప్పడానికి బబులోనులో ఉన్న జ్ఞానులనందరినీ నా దగ్గరికి పిలిపించాలని ఆజ్ఞ ఇచ్చాను. 7శకునాలు చెప్పేవాళ్ళు, గారడీవిద్యలు చేసేవాళ్ళు, మాంత్రికులు, జ్యోతిష్యులు నా సమక్షానికి వచ్చినప్పుడు నాకు వచ్చిన కల గురించి వాళ్లకు చెప్పాను కానీ ఎవ్వరూ దానికి అర్థం చెప్పలేకపోయారు.
8చివరకు దానియేలు నా దగ్గరికి వచ్చాడు. మా దేవుడి పేరునుబట్టి అతనికి బెల్తెషాజరు అనే మారుపేరు పెట్టాము. పరిశుద్ధ దేవుని ఆత్మ అతనిలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అతనికి నాకు వచ్చిన కలను వివరించాను. 9ఎలాగంటే “భవిషత్తు చెప్పేవాళ్ళకు అధిపతివైన బెల్తెషాజర్, నువ్వు పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగి ఉన్నావనీ, ఎలాంటి నిగూఢమైన విషయం నిన్ను కలవరపెట్టదనీ నాకు తెలుసు. కాబట్టి నాకు వచ్చిన కలను, ఆ కల భావాన్నీ నాకు వివరించు.”
10“నేను నా మంచం మీద పండుకుని నిద్ర పోతున్నప్పుడు నాకు ఈ దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనంలో నేను చూస్తూ ఉండగా, భూమి మధ్యలో చాలా ఎత్తయిన ఒక చెట్టు కనబడింది. 11ఆ చెట్టు క్రమంగా పెరుగుతూ బ్రహ్మాండంగా వృద్ది చెందింది. దాని కొమ్మలు ఆకాశాన్ని అందుకునేటంత ఎత్తుగా ఉన్నాయి. దాని ఆకారం భూమి అంత విశాలం అయ్యింది. 12దాని ఆకులు అందంగా, దాని పండ్లు విస్తారంగా కనబడ్డాయి. ఆ పండ్లు జీవకోటి అంతటికీ ఆహారం కోసం సరిపోతాయి. అడవి జంతువులన్నీ ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ చెట్టు కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుని ఉన్నాయి. సమస్తమైన ప్రజలకూ సరిపడినంత ఆహారం ఆ చెట్టు నుండి లభ్యమౌతుంది.”
13“నేనింకా మంచం మీదే ఉండి నాకు కలుగుతున్న దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు పవిత్రుడైన ఒక మేల్కొలుపు దూత ఆకాశం నుండి దిగి వచ్చాడు. 14అతడు బిగ్గరగా ఇలా ప్రకటించాడు, ఈ చెట్టును నరికివేయండి. దాని కొమ్మలు, ఆకులు కొట్టివేసి, దాని పండ్లను పారవేయండి. చెట్టు నీడలో ఉన్న పశువులను తోలివేయండి. పక్షులన్నిటినీ కొమ్మల నుండి ఎగురగొట్టండి. 15అయితే దాని మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డిలో విడిచిపెట్టండి. దాని వేళ్ళు భూమిలో ఉండిపోనివ్వండి. అతడు ఆకాశం నుండి కురిసే మంచుకు తడుస్తూ జంతువులాగా భూమిలో ఉన్న పచ్చికలో నివసించేలా వదిలిపెట్టండి.”
16“మానవ మనస్సుకు బదులు పశువు మనస్సు కలిగి ఏడు కాలాలు గడిచేదాకా అతడు అదే స్థితిలో ఉండిపోవాలి. 17ఈ ఆజ్ఞ మేల్కొలుపు దూతలు ఈ విధంగా ప్రకటించారు. ఈ తీర్పు పరిశుద్ధుల ప్రకటన ననుసరించి విధించబడింది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు. ఆయన మనుషులందరిలో అల్పులను వివిధ రాజ్యాలపై అధిపతులుగా నియమిస్తాడని మనుష్యులంతా తెలుసుకొనేలా ఇది జరుగుతుంది.”
18“బెల్తెషాజరు, నెబుకద్నెజరనే నాకు వచ్చిన దర్శనం ఇదే. నువ్వు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానీ దాని భావం నాకు చెప్పలేడు. నీలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నువ్వే దాన్ని చెప్పగల సమర్థుడివి” అన్నాను.
కల భావం, హెచ్చరిక
19బెల్తెషాజరు అనే పేరున్న దానియేలు ఒక గంట సేపు ఎంతో ఆశ్చర్యానికి లోనై తన మనస్సులో తీవ్రమైన కలవరం చెందాడు. అప్పుడు రాజు “బెల్తెషాజర్, ఈ దర్శనం గురించి గానీ, దాని భావం గురించి గానీ నువ్వు కంగారు పడవద్దు” అన్నాడు. బెల్తెషాజర్ జవాబిస్తూ “ప్రభూ, ఇలాంటి దర్శనం, దాని భావం మీ శత్రువులకు, మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు వచ్చి ఉంటే సమంజసంగా ఉండేది.”
20“రాజా, మీరు చూసిన చెట్టు క్రమంగా పెరుగుతూ బ్రహ్మాండంగా వృద్ది చెందింది. దాని కొమ్మలు ఆకాశాన్ని అందేటంత ఎత్తుగా ఉన్నాయి. దాని ఆకారం భూమి అంత విశాలం అయ్యింది. 21దాని ఆకులు అందంగా, దాని పండ్లు విస్తారంగా కనబడ్డాయి. ఆ పండ్లు సమస్త జీవకోటి ఆహారం కోసం సరిపోతాయి. అడవి జంతువులన్నీ ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ చెట్టు కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుని ఉన్నాయి గదా 22రాజా, ఆ చెట్టు నీకు సూచనగా ఉంది. నువ్వు వృద్ధిచెంది గొప్ప బల ప్రభావాలు గలవాడివయ్యావు. నీ ప్రఖ్యాతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. నీ రాజ్యం లోకమంతా వ్యాపించింది.”
23“ఈ చెట్టును నరికివేయండి. దాని కొమ్మలు, ఆకులు కొట్టివేసి, దాని పండ్లను పారవేయండి. చెట్టు నీడలో ఉన్న పశువులను తోలివేయండి. పక్షులన్నిటినీ కొమ్మల నుండి ఎగరగొట్టండి. అయితే దాని వేరులతో ఉన్న మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డిలో విడిచిపెట్టండి. దాని వేళ్ళు భూమిలో ఉండిపోనివ్వండి, అని మేల్కొలుపు దూత పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించడం నువ్వు విన్నావు గదా.”
24“రాజా, ఈ దర్శనం అర్థం ఏమిటంటే, సర్వోన్నతుడైన దేవుడు రాజువైన నిన్ను గూర్చి ఈ విధంగా తీర్మానం చేశాడు. 25ప్రజలు తమ దగ్గర ఉండకుండా నిన్ను తరుముతారు. నువ్వు అడవి జంతువుల మధ్య నివసిస్తూ పశువులాగా గడ్డి తింటావు. ఆకాశం నుండి పడే మంచు నిన్ను తడుపుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు, అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది. 26చెట్టు మొద్దును ఉండనియ్యమని దూతలు చెప్పారు గదా. ఇందునుబట్టి సర్వోన్నతుడైన దేవుడు సమస్తానికి అధికారి అని నువ్వు గ్రహించిన తరువాత నీ రాజ్యం నీకు కచ్చితంగా లభిస్తుందని తెలుసుకో. 27రాజా, నేను చెప్పేది మీకు అంగీకారంగా ఉండు గాక. నీ పాపాలు విడిచిపెట్టి నీతి న్యాయాలు అనుసరించు. నువ్వు హింసించిన వాళ్ళ పట్ల కనికరం చూపించు. అప్పుడు నీకున్న క్షేమం ఇకపై అలాగే కొనసాగుతుంది” అని దానియేలు జవాబిచ్చాడు.
నెరవేరిన కల
28పైన చెప్పిన విషయాలన్నీ రాజైన నెబుకద్నెజరుకు సంభవించాయి. 29ఒక సంవత్సర కాలం గడచిన తరువాత అతడు తన రాజధాని పట్టణం బబులోనులోని ఒక నగరంలో సంచరించాడు. 30అతడు దాన్ని చూస్తూ. “ఈ బబులోను నగరం మహా విశాలమైన పట్టణం. నా బలాన్ని, నా అధికారాన్ని, నా ప్రభావ ఘనతలను చూపించుకోవడానికి దీన్ని నా రాజధాని నగరంగా కట్టించుకున్నాను” అని తనలో తాను అనుకున్నాడు.
31ఈ మాటలు రాజు నోట్లో ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం “రాజువైన నెబుకద్నెజర్, ఈ ప్రకటన నీ కోసమే. నీ రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోయింది. 32రాజ్యంలోని ప్రజలు తమ దగ్గర నుండి నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది” అని వినిపించింది.
33ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి. 34ఆ రోజులు ముగిసిన తరువాత నెబుకద్నెజరు అనే నాకు తిరిగి మానవ బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, సర్వోన్నతుడు దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవునికి స్తోత్రాలు చెల్లించి కీర్తించాను. ఆయన అధికారం కలకాలం నిలుస్తుంది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.
35భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు. 36ఆ సమయంలో నాకు మళ్ళీ బుద్ది వచ్చింది. నా రాజ్యానికి గత వైభవం కలిగేలా ముందున్న ఘనత, ప్రభావాలు నాకు మళ్ళీ చేకూరాయి. నా మంత్రులు, నా క్రింది అధికారులు నా దగ్గరికి వచ్చి సమాలోచనలు జరిపారు. నా రాజ్యంపై అధికారం నాకు స్థిరపడింది. గతంలో కంటే అధికమైన ఘనత నాకు దక్కింది.
37ఈ విధంగా నెబుకద్నెజరు అనే నేను, పరలోకపు రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన జరిగించే కార్యాలన్నీ సత్యం, ఆయన నడిపించే విధానాలు న్యాయం. ఆయన గర్వంతో ప్రవర్తించే వాళ్ళను అణిచివేసే శక్తి గలవాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
దాని 4: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.