నిర్గమ 2

2
మోషే పుట్టుక
1లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. 2ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతణ్ణి మూడు నెలల పాటు దాచిపెట్టింది. 3ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి, దానికి జిగురు, కీలు పూసి, అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి, నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది. 4పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది.
5ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. 6పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది. 7అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో “నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?” అని అడిగింది. 8ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది. 9ఫరో కూతురు ఆమెతో “ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను” అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది.
10ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె “నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు #2:10 నీటిలో నుండి తీసిన.మోషే” అని చెప్పింది.
మోషే మిద్యాను పలాయనం
11మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. 12అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు.
13తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు. 14అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో “నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?” అన్నాడు.
ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. 15ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.
16మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు. 17అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు.
18వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు “మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు. 19అందుకు వాళ్ళు “ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి, నీళ్లు తోడి మన మందకు పోశాడు” అన్నారు. 20అతడు తన కూతుళ్ళతో “అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి” అని చెప్పాడు.
21మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. 22వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే “నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను” అనుకుని తన కొడుక్కి “గెర్షోము” అని పేరు పెట్టాడు.
23ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి. 24దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. 25దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమ 2: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి