నిర్గమ 33

33
సీనాయి పర్వతం వదిలి వెళ్ళమని ఆజ్ఞ.
1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నీవూ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చిన ప్రజలూ బయలుదేరి, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానానికి ఇస్తానని చెప్పిన #33:1 సారవంతమైనపాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళండి. 2నేను నీకు ముందుగా దూతను పంపుతాను. ఆ దూత కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను అక్కడినుండి వెళ్ళగొడతాడు. 3మీరు నాకు #33:3 కఠిన హృదయులుఅవిధేయులయ్యారు కనుక నేను మీతో కలసి రాను. ఒకవేళ మార్గమధ్యంలో మిమ్మల్ని చంపేస్తానేమో.”
4ఆ దుర్వార్త విని ప్రజలు దుఃఖించారు. ధరించిన ఆభరణాలన్నీ పక్కనబెట్టారు.
5అప్పుడు యెహోవా మోషేతో “నీవు ఇశ్రాయేలు ప్రజలతో ‘మీరు అవిధేయులైన ప్రజలు. ఒక్క క్షణం నేను మీ మధ్యకు వచ్చినా మిమ్మల్ని హతం చేస్తాను. మీరు ధరించుకొన్న ఆభరణాలన్నీ తీసివెయ్యండి. అప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యాలో చూస్తాను’ అని చెప్పు” అన్నాడు.
6ఇశ్రాయేలు ప్రజలు హోరేబు కొండ దగ్గర తమ నగలు తీసివేశారు. 7అప్పుడు మోషే శిబిరం బయటకు వెళ్లి అక్కడ ఒక గుడారం వేశాడు. దానికి #33:7 ప్రత్యక్ష గుడారం.సన్నిధి గుడారం అని పేరు పెట్టాడు. యెహోవాను కనుగొనాలనుకున్న ప్రతివాడూ శిబిరం బయట ఉన్న సన్నిధి గుడారానికి వచ్చాడు.
8మోషే ఆ గుడారానికి వెళ్తూ ఉన్నప్పుడల్లా తమ గుడారాల్లో ఉన్న ప్రజలు లేచి నిలబడి అతడు గుడారం లోకి వెళ్ళేదాకా అతని వైపు నిదానంగా చూస్తూ ఉండేవాళ్ళు. 9మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు స్తంభం లాంటి మేఘం దిగి వచ్చి ఆ గుడారం ద్వారం దగ్గర నిలిచేది. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు.
10ఆ మేఘస్తంభం ఆ గుడారం ద్వారాన నిలవడం చూసిన ప్రజలందరూ తమ తమ గుడారాల ద్వారాల్లో లేచి నిలబడి నమస్కారం చేసేవారు. 11ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖీగా మాట్లాడేవాడు. తరువాత అతడు శిబిరంలోకి తిరిగి వచ్చేవాడు. అయితే మోషే సేవకుడు, నూను కొడుకు అయిన యెహోషువ అనే యువకుడు గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు.
మోషే ప్రార్థన
12మోషే యెహోవాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజలను వెంటబెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గానీ నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక ‘నిన్ను నీ పేరుతో ఎరుగుదును. నిన్ను నేను కరుణించాను’ అని నాతో చెప్పావు కదా. 13అందువల్ల నాపై నీ దయ ఉంటే నీ విధానాలు నేను గ్రహించగలిగేలా దయచేసి నీ మార్గాలు నాకు చూపించు. అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అయ్యా, చూడు, ఈ జనమంతా నీ ప్రజలే గదా.”
14అందుకు ఆయన “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను” అన్నాడు. 15మోషే “నీ సన్నిధి మాతో రాని పక్షంలో ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకు వెళ్ళకు. 16నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం” అని ఆయనతో అన్నాడు.
17అప్పుడు యెహోవా “నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు దయ కలిగింది. నీ పేరును బట్టి నిన్ను తెలుసుకున్నాను” అని మోషేతో చెప్పాడు. 18మోషే “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. 19ఆయన “#33:19 నా మహిమ. అంతా.నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను” అన్నాడు.
20ఆయన ఇంకా “నువ్వు నా ముఖాన్ని చూడలేవు. నన్ను చూసిన ఏ మనిషీ బతకడు” అన్నాడు. 21యెహోవా “ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు ఆ బండ మీద నిలబడు. 22నా మహిమ నిన్ను దాటి వెళ్ళే సమయంలో ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకూ నా చేత్తో నిన్ను కప్పుతాను. 23నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వీపును మాత్రం నువ్వు చూడగలవు గానీ నా ముఖ దర్శనం నీకు కలగదు” అని మోషేతో చెప్పాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమ 33: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి