యెహె 26
26
తూరూ గూర్చి ప్రవచనం
1బబులోను చెరలో ఉన్న కాలంలో, పదకొండో సంవత్సరం నెలలో మొదటి రోజు యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు. 2“నరపుత్రుడా, తూరు యెరూషలేము గురించి ‘ఆహా’ అంటూ ‘ప్రజల ప్రాకారాలు పడిపోయాయి, ఆమె నావైపు తిరిగింది. ఆమె పాడైపోయినందువలన మేము వర్దిల్లుతాం’ అని చెప్పాడు.”
3కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “తూరూ, నేను నీకు విరోధిని. సముద్రం దాని అలలను పైకి తెచ్చే విధంగా నేను అనేక ప్రజలను నీ మీదికి రప్పిస్తాను. 4వారు వచ్చి తూరు ప్రాకారాలను కూల్చి దాని కోటలను పడగొడతారు. నేను దాని శిథిలాలను తుడిచివేస్తాను. వట్టి బండ మాత్రమే మిగులుతుంది.
5ఆమె సముద్రం ఒడ్డున వలలు ఆరబెట్టుకునే చోటవుతుంది. ఈ విషయం చెప్పింది నేనే.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. “ఆమె ఇతర రాజ్యాలకు దోపిడీ అవుతుంది. 6బయటి పొలాల్లో ఉన్న దాని కూతుళ్ళు కత్తి పాలవుతారు. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.”
7యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “అత్యంత శక్తివంతుడైన బబులోనురాజు నెబుకద్నెజరును నేను తూరు పట్టణం మీదికి రప్పిస్తున్నాను. అతడు గుర్రాలతో రథాలతో రౌతులతో మహా సైన్యంతో వస్తున్నాడు. 8అతడు బయటి పొలాల్లోని నీ కూతుళ్ళను కత్తి పాలు చేస్తాడు. నీ కెదురుగా బురుజులు కట్టించి మట్టి దిబ్బలు వేయించి నీ కెదురుగా డాళ్ళను ఎత్తుతాడు.
9అతడు నీ ప్రాకారాలను పడగొట్టడానికి యంత్రాలు వాడతాడు. అతని ఆయుధాలు నీ కోటలను కూలుస్తాయి. 10అతనికి ఉన్న అనేక గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కప్పేస్తుంది! కూలిపోయిన పట్టణ గోడల గుండా ద్వారాల గుండా అతడు వచ్చినప్పుడు గుర్రాలు, రథ చక్రాల శబ్దాలకు నీ ప్రాకారాలు కంపిస్తాయి. 11అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నీ అణగదొక్కేస్తాడు. నీ ప్రజలను కత్తితో నరికేస్తాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలుతాయి.
12ఈ విధంగా వాళ్ళు నీ ఐశ్వర్యాన్ని దోచుకుంటారు. నీ వ్యాపార సరుకులను కొల్లగొట్టుకుపోతారు. నీ గోడలు కూలుస్తారు. నీ విలాస భవనాలను పాడు చేస్తారు. నీ రాళ్లనూ నీ కలపనూ మట్టినీ నీళ్లలో ముంచివేస్తారు. 13నేను నీ సంగీతాలను మాన్పిస్తాను. నీ సితారా నాదం ఇక వినబడదు. 14నిన్ను వట్టి బండగా చేస్తాను. నీవు వలలు ఆరబెట్టే చోటు అవుతావు. నిన్ను మళ్ళీ కట్టడం ఎన్నటికీ జరగదు. ఈ విషయం చెప్పింది నేనే.” ఇదే యెహోవా ప్రభువు సందేశం!
15తూరు గురించి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నువ్వు పతనమయ్యేటప్పుడు, నీ మధ్య జరిగే భయంకరమైన హత్యల్లో గాయపడ్డ వాళ్ళ కేకల శబ్దానికి ద్వీపాలు వణికిపోవా? 16సముద్రపు అధిపతులంతా తమ సింహాసనాల మీద నుంచి దిగి, తమ రాజ వస్త్రాలనూ రంగురంగుల బట్టలనూ తీసి వేస్తారు. వాళ్ళు భయాన్ని కప్పుకుంటారు. వాళ్ళు నేల మీద కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి భయాందోళన చెందుతారు.
17వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు.
నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు!
పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం-ఇప్పుడు సముద్రం పాలయింది.
నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు.
నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం.
18ఇప్పుడు నువ్వు కూలిన ఈ దినాన తీరప్రాంతాలు వణుకుతున్నాయి.
నువ్వు మునిగిపోవడం బట్టి తీర ప్రాంతాలు భయంతో కంపించిపోయాయి.
19యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నేను నిన్ను పాడుచేసి నిర్జనమైన పట్టణంగా చేసేటప్పుడు మహా సముద్రం నిన్ను ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాన్ని రప్పిస్తాను. 20పురాతన దినాల్లో మృత్యులోకంలోకి దిగిపోయినవారి దగ్గర నువ్వుండేలా చేస్తాను. పూర్వకాలంలో పాడైన స్థలాల్లో భూమి కిందున్న భాగాల్లో, అగాధంలోకి దిగిపోయిన వారితో పాటు నువ్వుండేలా చేస్తాను. దీనంతటి బట్టి సజీవులు నివసించే చోటికి నువ్వు తిరిగి రావు. 21నీ మీదికి విపత్తు తెస్తాను. నువ్వు లేకుండా పోతావు. ఎంత వెతికినా నీవెన్నటికీ కనిపించవు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహె 26: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.