యెహె 28
28
తూరూ రాజ్యం పాలించే వారికి సందేశం
1అప్పుడు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు. 2నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు. 3నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు!
4నీ తెలివి తేటలతో నేర్పుతో ధనవంతుడివై, నీ ఖజానాల్లో వెండి బంగారాలను పోగుచేసుకున్నావు. 5నీ గొప్ప తెలివితేటలతో నీ వ్యాపారంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు. నీ సంపద బట్టి నీ హృదయం గర్వించింది.
6కాబట్టి యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు, నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు. 7నేను విదేశీయులను, ఇతర రాజ్యాలనుంచి క్రూరులను, నీ మీదికి రప్పిస్తాను. తెలివితో నువ్వు నిర్మించుకున్న నీ అందమైన పట్టణాల మీద వాళ్ళు తమ కత్తులు ఝళిపించి నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు. 8వాళ్ళు నిన్ను నీ సమాధిలో పడేస్తారు. సముద్రాల్లో మునిగి చచ్చేవాళ్ళలాగా నువ్వు చస్తావు. 9నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు. 10నువ్వు విదేశీయుల చేతుల్లో సున్నతిలేని వాళ్ళ చావు చస్తావు. ఈ విషయం చెప్పింది నేనే. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”
11యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు. 12“నరపుత్రుడా, తూరు రాజును గురించి శోకగీతం ఎత్తి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నువ్వు పరిపూర్ణంగా గొప్ప తెలివితేటలతో అందాల రాశిలా ఉండే వాడివి. 13దేవుని తోట, ఏదెనులో నువ్వున్నావు! అన్ని రకాల ప్రశస్త రత్నాలు నీకు అలంకాంరంగా ఉండేవి. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం, బంగారంలో పొదిగిన ఆభరణాలు నువ్వు అలంకరించుకున్నావు. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి.
14అభిషేకం పొందిన కెరూబులా నేను నిన్ను నియమించాను. దేవుని పర్వతం మీద నువ్వున్నావు. నిప్పుకణికల వంటి రాళ్ల మధ్య నువ్వు నడిచేవాడివి. 15నిన్ను సృష్టించిన రోజునుంచి నీలో పాపం కనిపించే వరకూ నీ ప్రవర్తన లోపం లేకుండా ఉంది.
16అయితే నీ వ్యాపారం ఎక్కువ కావడం వలన నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేశావు. కాబట్టి కావలిగా ఉన్న కెరూబూ, దేవుని పర్వతం మీద నిప్పుకణికల్లాంటి రాళ్లమధ్య నువ్వుండకుండా నేను నిన్ను తోలివేసి, నిర్మూలం చేశాను. 17నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడు చేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను.
18నీ విస్తార పాపాలను బట్టి, నీ అన్యాయ వ్యాపారాన్ని బట్టి, నీ పవిత్ర స్థలాలను నువ్వు అపవిత్రం చేశావు. కాబట్టి నీలోనుంచి అగ్ని వచ్చేలా చేశాను. అది నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుట నిన్ను బూడిదగా చేస్తాను. 19ప్రజల్లో నిన్ను ఎరిగిన వారంతా నిన్ను బట్టి వణికిపోతారు. నిర్ఘాంతపోతారు. నువ్విక ఉండవు.”
సీదోను వ్యతిరేకంగా ప్రవచనం
20యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 21“నరపుత్రుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు తిప్పి దాన్ని గురించి ప్రవచించు. 22యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, సీదోను, నేను నీకు విరోధిని. నీ మధ్య నాకు ఘనత వస్తుంది. నేను నీ మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నపుడు నేను యెహోవానని నీ ప్రజలు తెలుసుకుంటారు. నన్ను నేను పవిత్రునిగా మీ మధ్య కనుపరచుకుంటాను.
23నేను ఘోరమైన అంటురోగాన్ని మీ మధ్య పంపిస్తాను. మీ వీధుల్లో రక్తపాతం జరుగుతుంది. అన్ని వైపుల నుంచి నీ మీద కత్తి దూస్తారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 24ఇశ్రాయేలీయుల చుట్టూ గుచ్చుకునే ముళ్ళ కంపల్లాగా నొప్పి కలిగించే గచ్చతీగల్లాగా వారిని తృణీకరించిన ప్రజలు ఇంక ఎవరూ ఉండరు. అప్పుడు నేనే యెహోవా ప్రభువునని వాళ్ళు తెలుసుకుంటారు.”
25యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “ప్రజల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను దగ్గర చేర్చి, ప్రజల ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను. అప్పుడు నా సేవకుడు యాకోబుకు నేనిచ్చిన తమ దేశంలో వాళ్ళు నివసిస్తారు. 26వాళ్ళు అందులో భయం లేకుండా నివసించి ఇళ్ళు కట్టుకుని ద్రాక్షతోటలు నాటుకుంటారు. వారి చుట్టూ ఉండి వాళ్ళను తృణీకరించే వారందరికీ నేను శిక్ష విధించిన తరువాత వాళ్ళు భయం లేకుండా నివసించేటప్పుడు నేను తమ యెహోవా దేవుడినని వాళ్ళు తెలుసుకుంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహె 28: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.