ఎజ్రా 10
10
ప్రజలు పాపాలను ఒప్పుకొని ఎజ్రాకు విధేయులయ్యారు
1ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ, పాపం ఒప్పుకొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలూ గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు. 2అప్పుడు ఏలాము మనుమడు, యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు. “మేము దేశంలో ఉన్న పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా మా దేవుని దృష్టికి పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకొంటారన్న నిరీక్షణ ఉంది. 3ఈ పని ధర్మశాస్త్ర నియమం ప్రకారం జరిగేలా నాయకుడవైన నువ్వు, దేవుడంటే భయపడేవారూ చెబుతున్నట్టు మేము పెళ్లి చేసుకొన్న భార్యలను, వారికి పుట్టిన పిల్లలను విడిచిపెట్టి, పంపివేస్తామని మన దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటాం. 4ఈ పని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా ఈ పని మొదలు పెట్టు. మేమంతా నీతోనే ఉంటాం.” 5ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులంతా ఆ మాట ప్రకారమే నడుచుకొంటామని వారి చేత ప్రమాణం చేయించాడు. వారంతా ప్రమాణం చేసిన తరువాత, 6ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి, ఎల్యాషీబు కొడుకు యోహానాను గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతడు చెరకు లోనైన వారి అపరాధాలను బట్టి రోదిస్తూ, భోజనం చేయకుండా, నీళ్ళు తాగకుండా ఉండిపోయాడు.
7చెరనుండి తిరిగి వచ్చిన వారంతా యెరూషలేములో తప్పక సమకూడాలని యూదా దేశమంతటా, యెరూషలేము పట్టణంలో దండోరా వేశారు. 8ప్రధానులు, పెద్దలు నిర్ణయించినట్టుగా మూడు రోజుల్లోగా ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి, వాటిని దేవుని మందిరపు ఆస్తిగా ప్రకటించాలని, వాళ్ళను సమాజం నుండి బహిష్కరించాలని తీర్మానం చేశారు. 9యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు. 10అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇలా అన్నాడు. “మీరు ఆజ్ఞను అతిక్రమించి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకుని మన జాతి పాపాన్ని ఇంకా అధికం చేశారు. 11కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”
12అప్పుడు అక్కడ సమకూడిన వారంతా బిగ్గరగా ఇలా అన్నారు. “నువ్వు చెప్పినట్టుగా మేము తప్పకుండా చేయవలసి ఉంది. 13అయితే ఇక్కడ జనసమూహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మేము బయట నిలబడలేకపోతున్నాం. ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామందిమి పాపం చేశాం. కాబట్టి అన్ని సమాజాల్లోని పెద్దలందరికీ ఈ పని కేటాయించండి. 14మన పట్టణాల్లో ఎవరెవరు పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నారో వాళ్ళంతా గడువులోగా రావాలి. ఈ విషయంలో మాపై దేవునికి వచ్చిన తీవ్రమైన కోపం తొలగిపోయేలా ప్రతి పట్టణాల్లోని పెద్దలు, న్యాయాధిపతులు వాళ్ళతో ఉండాలి.”
15ఈ పని జరిగించడానికి అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యా, వాళ్లకు సహాయకులుగా మెషుల్లాము, లేవీ గోత్రికుడు షబ్బెతైలను నియమించారు. 16చెరనుంచి వచ్చినవారు ఆ క్రమం ప్రకారం చేశారు. యాజకుడైన ఎజ్రా పెద్దల్లో కొందరు ప్రధానులును వారి తండ్రుల ఇంటి పేర్ల ప్రకారం ఎన్నుకున్నాడు. పదవ నెల మొదటి రోజున ఈ విషయాన్ని గూర్చి పరిశీలించడం మొదలుపెట్టారు. 17మొదటి నెల మొదటి రోజునాటికి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసికొన్న వారందరి వ్యవహారం పరిష్కారం చేశారు.
దోషులు
18యాజకుల వంశంలో పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్న వారు ఎవరంటే, యోజాదాకు కొడుకు యేషూవ వంశంలో, అతని సహోదరుల్లో మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా. 19వీరు తమ తమ భార్యలను పంపివేస్తామని ప్రమాణం చేశారు. వారు అపరాధులు కావడంవల్ల తమ అపరాధం విషయంలో మందలోనుండి ఒక పొట్టేలును సమర్పించారు.
20ఇమ్మేరు వంశంలో హనానీ, జెబద్యా.
21హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
22పషూరు వంశంలో ఎల్యో యేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
23లేవీ గోత్రం నుండి యోజాబాదు, షిమీ కెలిథా అనే పేరున్న కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
24గాయక బృందానికి చెందిన ఎల్యాషీబు, ద్వారపాలకుల నుండి షల్లూము, తెలెము, ఊరి అనేవాళ్ళు.
25ఇశ్రాయేలీయుల్లో పరోషు వంశం నుండి రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా.
26ఏలాము వంశంలో మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.
27జత్తూ వంశంలో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
28బేబై వంశంలో యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
29బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు.
30పహత్మోయాబు వంశంలో అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.
31హారిము వంశంలో ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా.
32షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా, 33హాషుము వంశంలో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ.
34బానీ వంశంలో మయదై, అమ్రాము, ఊయేలు.
35బెనాయా, బేద్యా, కెలూహు.
36వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు.
37మత్తన్యా, మత్తెనై, యహశావు.
38బానీ, బిన్నూయి, షిమీ.
39షిలెమ్యా, నాతాను, అదాయా.
40మక్నద్బయి, షామై, షారాయి.
41అజరేలు, షెలెమ్యా, షెమర్యా.
42షల్లూము, అమర్యా, యోసేపు.
43నెబో వంశానికి చెందిన యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనేవాళ్ళు.
44వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు. ఈ స్త్రీలలో కొందరు పిల్లలను కూడా కన్నారు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు.#10:44 వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు, వారిని వారి పిల్లలతో దూరముగా ఉంచారు
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎజ్రా 10: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.