ఎజ్రా 6

6
దర్యావేషు రాజు దేవాలయం నిర్మాణానికి అజ్ఞ
1అప్పుడు దర్యావేషు చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం బబులోను ఖజానాలో ఉంచిన దస్తావేజులను వెదికారు. 2మాదీయ ప్రాంతంలోని ఎగ్బతానా పట్టణంలో ఒక గ్రంథపు చుట్ట దొరికింది. అందులో ఈ విషయాలు రాసి ఉన్నాయి.
3“కోరెషు చక్రవర్తి పాలన మొదటి సంవత్సరంలో అతడు యెరూషలేములో ఉండే దేవుని ఆలయం విషయంలో చేసిన నిర్ణయం. బలులు అర్పించడానికి వీలైన స్థలంగా ఆ మందిరాన్ని నిర్మించాలి. దాని పునాదులు స్థిరంగా వేయాలి. దాని పొడవు 60 మూరలు, వెడల్పు 60 మూరలు ఉండాలి. 4మందిరం మూడు వరసలున్న పెద్ద పెద్ద రాళ్లతో, ఒక వరస సరికొత్త మానులతో కట్టాలి. దానికయ్యే ఖర్చంతా రాజు ధనాగారం నుండి ఇవ్వాలి. 5యెరూషలేములో ఉన్న ఆలయం నుండి నెబుకద్నెజరు రాజు బబులోనుకు తీసుకు వచ్చిన వెండి, బంగారు సామగ్రిని తిరిగి తీసుకు వెళ్ళి దేవుని మందిరంలో వాటి వాటి స్థలం లో ఉంచాలి.”
6అప్పుడు దర్యావేషు రాజు ఇలా ఆజ్ఞాపించాడు “నది అవతల అధికారులైన తత్తెనై, షెతర్బోజ్నయి అనే మీరు, మీతో ఉన్న అధికారులు యూదులు కడుతున్న దేవుని మందిరం పనిలో జోక్యం చేసుకోవద్దు. 7దేవుని మందిరం పని జరగనివ్వండి. యూదుల అధికారులు, పెద్దలు దేవుని మందిరాన్ని దాని స్థలం లో కట్టుకోనివ్వండి. 8దేవుని మందిరం పని కొనసాగేలా యూదుల పెద్దలకు మీరు చేయాల్సిన సహాయాన్ని గూర్చి మేము ఇలా నిర్ణయించాం. రాజు ధనాగారంలో నుండి, అంటే నది అవతల పన్నుగా వసూలైన సొమ్ములోనుండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి పని కోసం కావలసిన మొత్తాన్ని ఇవ్వాలి. 9ఆకాశంలో నివసించే దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, గొర్రెలు, పొట్టేళ్ళు, గోదుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె మొదలైన వాటిని యాజకులకు ఇవ్వాలి. యెరూషలేములో ఉంటున్న వారు ఆకాశంలో ఉండే దేవునికి సువాసన గల అర్పణలు అర్పించి రాజు, అతని సంతానం బతికి ఉండేలా ప్రార్థన చేస్తారు. 10కాబట్టి వారు కోరినదంతా ప్రతిరోజూ తప్పకుండా ఇవ్వాలి.
11ఇంకా నేను నిర్ణయించినదేమిటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞను తిరస్కరిస్తే అతని ఇంటి దూలాల్లో ఒకదాన్ని ఊడదీసి దాన్ని నిలబెట్టి దానిపై అతణ్ణి ఉరితీయాలి. అతడు చేసిన ఆ తప్పును బట్టి అతడి ఇంటిని చెత్తకుప్పగా చెయ్యాలి. 12ఏ రాజులైనా, ప్రజలైనా ఈ ఆజ్ఞను ఉల్లంఘించి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే, తన సన్నిధిని అక్కడ ఉంచిన దేవుడు వారు నశించిపోయేలా చేస్తాడు. మందిర నిర్మాణ పని వేగంగా జరగాలి. దర్యావేషు అనే నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను” అని రాయించి ఆజ్ఞ జారీ చేశాడు.
మందిర నిర్మాణం పూర్తి, ప్రతిష్టించడం
13అప్పుడు నది ఇవతల ఉండే అధికారులు తత్తెనై, షెతర్బోజ్నయి, వారిని అనుసరించేవారు దర్యావేషు రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వేగంగా పని జరిగించారు. 14హగ్గయి ప్రవక్త, జెకర్యా ప్రవక్తల హెచ్చరికలతో, వారి పర్యవేక్షణలో యూదుల పెద్దలు ఆలయం కట్టిస్తూ పని సవ్యంగా జరిపించారు. ఈ విధంగా కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అనే పర్షియా దేశపు రాజుల ఆజ్ఞ ప్రకారం దేవుని ఆజ్ఞను అనుసరించి ఆలయం నిర్మిస్తూ చివరకూ ఆ పని పూర్తి చేశారు.
15దర్యావేషు రాజు పాలనలో ఆరో సంవత్సరం అదారు నెల మూడో రోజుకి మందిర నిర్మాణం పూర్తి అయింది. 16అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, చెర నుండి విడుదలైన మిగిలిన వారు ఆనందంగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు. 17దేవుని ఆలయ ప్రతిష్ఠ సమయంలో 100 ఎద్దులను, 200 పొట్టేళ్ళను, 400 గొర్రె పిల్లలను వధించారు. ఇవిగాక, ఇశ్రాయేలీయులందరి పక్షంగా పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలు గోత్రాల లెక్క ప్రకారం 12 మేకపోతులను బలిగా అర్పించారు.
18వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిపించడానికి మోషే గ్రంథంలో రాసి ఉన్న తరగతుల ప్రకారం యాజకులను, వరసల ప్రకారం లేవీయులను నియమించారు.
పస్కా పండగ
19చెర నుండి విడుదల పొందినవారు మొదటి నెల 14 వ రోజున పస్కా పండగ ఆచరించారు. 20యాజకులు, లేవీయులు తమను తాము శుద్ధి చేసుకుని చెర నుండి విడుదల పొందిన వారందరి కోసం, తమ బంధువులైన యాజకుల కోసం, తమ కోసం పస్కా పశువును వధించారు. 21చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు వాటిని తిన్నారు. ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి ప్రజలు దేవుడైన యెహోవా ఆశ్రయం కోరి అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకుని వారు కూడా వచ్చి పులియని రొట్టెలు తిని ఏడు రోజుల పండగను ఆనందంతో జరుపుకున్నారు. 22ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుని మందిరం పని విషయంలో యెహోవా అష్షూరురాజు మనసు మార్చి వారికి ధైర్యం కలిగించి వారు ఆనందభరితులయ్యేలా చేశాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎజ్రా 6: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి