ఆది 30

30
1రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగక పోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో “నాకు గర్భఫలమియ్యి. లేకపోతే నేను చచ్చిపోతాను” అంది. 2యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు “నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా?” అన్నాడు. 3అందుకు ఆమె “నా దాసి బిల్హా ఉంది గదా, ఆమెతో రాత్రి గడుపు. ఆమె నా కోసం పిల్లలను కంటుంది. ఆ విధంగా ఆమె వలన నాకు కూడా పిల్లలు కలుగుతారు” అని చెప్పి 4తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు.
5అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది. 6అప్పుడు రాహేలు “దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు” అనుకుని అతనికి “దాను” అని పేరు పెట్టింది. 7రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది. 8అప్పుడు రాహేలు “దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను” అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.
9లేయా తనకు కానుపు ఉడిగిపోవడం చూసి తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. 10జిల్పా యాకోబుకు కొడుకుని కన్నది. 11అప్పుడు లేయా “ఇది అదృష్టమే గదా” అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది. 12లేయా దాసి జిల్పా యాకోబుకు రెండవ కొడుకుని కన్నది. 13లేయా “నేను భాగ్యవంతురాలిని. స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా” అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.
14గోదుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో #30:14 ఈ మూలిక సువాసనలీనుతూ ఉంటుంది. తిన్న వారిలో లైంగిక సామర్థ్యం పెంచుతుందని, స్త్రీలలో గర్భం ధరించే సామర్థ్యం పెంచుతుందని భావిస్తారు.మంత్రమూలిక వేర్లు చూసి తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు “నీ కొడుకు తెచ్చిన మంత్రమూలికల్లో కొన్ని నాకు ఇవ్వు” అని లేయాతో అంది. 15అందుకామె “నా భర్తను తీసుకున్నావు కదా, అది చాలదా? ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా” అంది. అందుకు రాహేలు “అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం నీ భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు” అని చెప్పింది.
16ఆ సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చేటప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్లి “నువ్వు నా దగ్గరికి రావాలి. నా కొడుకు తెచ్చిన మంత్రమూలికలతో నిన్ను కొన్నాను” అని చెప్పింది. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో ఉన్నాడు. 17దేవుడు లేయా మనవి విన్నాడు, ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు అయిదవ కొడుకుని కన్నది. 18లేయా “నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు” అనుకుని అతనికి “#30:18 ప్రతిఫలంఇశ్శాఖారు” అని పేరు పెట్టింది. 19లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది. 20అప్పుడు లేయా “దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు. నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను. కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు” అనుకుని అతనికి “#30:20 ప్రతిష్టజెబూలూను” అని పేరు పెట్టింది. 21ఆ తరువాత ఆమె ఒక కూతురిని కని ఆమెకు దీనా అనే పేరు పెట్టింది.
22దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని, ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు. 23అప్పుడామె గర్భవతి అయ్యి కొడుకును కని “దేవుడు నా నింద తొలగించాడు” అనుకుంది. 24ఇంకా ఆమె “యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక” అనుకుని అతనికి “యోసేపు” అనే పేరు పెట్టింది.
25రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో “నన్ను పంపివెయ్యి. నా స్థలానికి, నా దేశానికి తిరిగి వెళ్తాను. 26నా భార్యలను, నా పిల్లలను నా కప్పగించు. నేను వెళ్ళిపోతాను, వారి కోసం నీకు సేవ చేశాను. నేను సేవ చేసిన విధానం నీకు తెలుసు కదా” అని చెప్పాడు. 27అందుకు లాబాను అతనితో “నీ దయ నా మీద ఉంటే నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను. 28నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను” అన్నాడు.
29యాకోబు అతణ్ణి చూసి “నేను నీకేవిధంగా సేవ చేశానో, నీ మందలు నా దగ్గర ఎలా ఉండేవో అది నీకు తెలుసు. 30నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను?” అన్నాడు.
31అప్పుడు లాబాను “నేను నీకేమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు “నువ్వు నాకేమీ ఇయ్యవద్దు, నువ్వు నాకోసం నేను చెప్పిన విధంగా చేస్తే, నేను తిరిగి నీ మందను మేపుతూ వాటి బాగోగులు చూస్తాను. 32ఈ రోజు నేను నీ మంద అంతటిలో నడచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానినీ, మేకల్లో మచ్చలైనా, పొడలైనా గలవాటినీ వేరు చేస్తున్నాను. అలాటివన్నీ నాకు జీతమౌతాయి. 33ఇక ముందు నాకు రావలసిన జీతం గూర్చి నువ్వు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అవుతుంది. మేకల్లో పొడలూ మచ్చలూ లేనివీ, గొర్రెపిల్లల్లో నల్లగా లేనివీ నా దగ్గర ఉంటే నేను దొంగిలించానని చెప్పవచ్చు” అన్నాడు. 34అందుకు లాబాను “మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు” అన్నాడు.
35ఆ రోజు లాబాను చారలూ, మచ్చలూ ఉన్న మేకపోతులనూ, పొడలూ మచ్చలూ గల ఆడ మేకలనూ కొంచెం తెలుపు గల ప్రతిదానినీ గొర్రెపిల్లల్లో నల్లవాటినీ అన్నిటినీ వేరుచేసి తన కొడుకులకు అప్పగించాడు. 36తనకూ యాకోబుకూ మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబానుకు చెందిన మిగిలిన మందను యాకోబు మేపుతూ ఉన్నాడు.
37యాకోబు గంగ రావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకు ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు. 38మందలు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలవల్లో, నీటి గాళ్ళలో, వాటి ముందు పెట్టాడు.
39అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి. 40యాకోబు ఆ గొర్రెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి వైపుకు, లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు. 41మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు. 42మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకూ బలమైనవి యాకోబుకూ వచ్చాయి.
43ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆది 30: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి