ఆది 47
47
యాకోబు ఐగుప్తులో స్థిరపడడం
1యోసేపు వెళ్ళి ఫరోతో “మా నాన్న, నా అన్నలు వారి గొర్రెల మందలతో వారి పశువులతో వారికి కలిగినదంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారు” అని తెలియచేసి, 2తన సోదరుల్లో ఐదు గురిని వెంటబెట్టుకుని వెళ్లి వారిని ఫరో ముందు నిలబెట్టాడు. 3ఫరో, అతని సోదరులను చూసి “మీ వృత్తి ఏంటి?” అని అడిగితే వారు “నీ దాసులమైన మేమూ మా పూర్వికులు, గొర్రెల కాపరులం” అని ఫరోతో చెప్పారు. 4వారు “కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. నీ దాసుల మందలకు మేత లేదు కాబట్టి ఈ దేశంలో కొంత కాలముండడానికి వచ్చాము. గోషెను ప్రాంతంలో నీ దాసులు నివసించడానికి సెలవు ఇప్పించండి” అని ఫరోతో అన్నారు. 5ఫరో యోసేపును చూసి “మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరికి వచ్చారు. 6ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రాంతంలో మీ నాన్న, నీ సోదరులూ నివసించేలా చెయ్యి. గోషెను ప్రాంతంలో వారు నివసించవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు అనిపిస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు” అని చెప్పాడు.
7యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకు వచ్చి ఫరో ముందు నిలబెట్టినప్పుడు, యాకోబు ఫరోను దీవించాడు. 8ఫరో “నీ వయసెంత?” అని యాకోబును అడిగాడు. 9యాకోబు “నేను ప్రయాణాలు చేసినవి 130 ఏళ్ళు. నా జీవించిన దినాలు కొద్డిగానూ బాధాకరమైనవిగానూ ఉన్నాయి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన సంవత్సరాలన్ని కాలేదు” అని ఫరోతో చెప్పి, 10ఫరోను దీవించి వెళ్ళిపోయాడు.
11ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే, యోసేపు తన తండ్రికీ తన సోదరులకూ ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు. 12యోసేపు తన తండ్రినీ తన సోదరులనూ తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు.
ఐగుప్తులో కరువు
13కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ దేశమంతటా ఆహారం లేదు. కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి. 14యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగుచేశాడు. ఆ డబ్బంతా, ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు. 15ఐగుప్తు దేశంలో కనాను దేశంలో డబ్బు అయిపోయిన తరువాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరికి వచ్చి “మాకు ఆహారం ఇప్పించు. నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అన్నారు.
16అందుకు యోసేపు “మీ పశువులు ఇవ్వండి, మీ డబ్బులు అయిపోతే మీ పశువులకు బదులు నేను మీకు ధాన్యమిస్తాను” అని చెప్పాడు. 17కాబట్టి వారు తమ పశువులను యోసేపు దగ్గరికి తెచ్చారు. ఆ సంవత్సరం, వారి మందలన్నిటికి బదులుగా అతడు వారికి ఆహారమిచ్చి వారిని పోషించాడు. 18ఆ సంవత్సరం గడిచాక, తరువాత సంవత్సరం వారు అతని దగ్గరికి వచ్చి “మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ దగ్గర దాచలేము. మా పశువుల మందలన్నీ మా యజమానులైన మీ వశమయ్యాయి. మా శరీరాలూ మా భూములూ తప్ప ఇంకేమీ మాకు మిగలలేదు. 19మీ కళ్ళముందు మేమూ మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ మా పొలాలనూ కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా, పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి” అని అడిగారు.
20ఆవిధంగా, యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఇగుప్తు వారిపాలిట తీవ్రంగా ఉండడం వలన వారంతా తమ పొలాలను అమ్మేశారు కాబట్టి, భూమి ఫరోది అయింది. 21అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్రజలను #47:21 వారిని వివిధ ప్రదేశాల్లో స్థిరపడేలా చేశాడు.దాసులుగా చేశాడు. 22యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు. 23యోసేపు “ఇదిగో నేడు మిమ్మల్ని, మీ భూములను ఫరో కోసం కొన్నాను. మీకు విత్తనాలు ఇవిగో. పొలాల్లో చల్లండి. 24నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి” అని ప్రజలతో చెప్పాడు. 25వారు “నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు. మాపై నీ దయ ఉండుగాక. మేము ఫరోకు బానిసలమవుతాం” అని చెప్పారు. 26అప్పుడు ఐదవ భాగం ఫరోది అని యోసేపు ఐగుప్తు వారికి చట్టం నియమించాడు. అది ఇప్పటివరకూ నిలిచి వుంది. యాజకుల భూములు మాత్రమే ఫరోవి కాలేదు.
యాకోబు అవసానదశ
27ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు. 28యాకోబు ఐగుప్తుదేశంలో 17 ఏళ్ళు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్ళు బతికాడు. 29ఇశ్రాయేలు అవసాన కాలం దగ్గర పడినప్పుడు అతడు తన కొడుకు యోసేపును పిలిపించి “నాపట్ల నీకు అభిమానం ఉంటే, నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాకు నమ్మకాన్నీ విశ్వాసాన్నీ కలిగించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దు. 30నేను నా పితరులతో నిద్రించినప్పుడు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకెళ్ళి, వారి సమాధిలో నన్ను పాతిపెట్టు” అని అతనితో చెప్పాడు. 31అందుకు యోసేపు “నేను నీ మాట చొప్పున చేస్తాను” అన్నాడు. ఇశ్రాయేలు “నాతో ప్రమాణం చెయ్యి” అంటే, యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన పడక తలగడ దగ్గర వంగి నమస్కరించాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆది 47: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.