2
1ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైనా కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను.
యెహోవా జవాబు
2యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా,
నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి.
3ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు.
అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు.
అది ఆలస్యం చేయక వస్తుంది.
4మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు.
అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు.
5ద్రాక్షారసం#2:5 ద్రాక్షారసం నంపద గర్విష్టి యువకుణ్ణి మోసం చేసి నిలవననీయకుండా చేస్తుంది.
అతని ఆశలను పాతాళమంతగా విస్తరింప జేస్తుంది. మరణం లాగా అది తృప్తినొందదు.
అతడు సకలజనాలను వశపరచుకుంటాడు. ప్రజలందరినీ తన కోసం సమకూర్చుకుంటాడు.
6తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వాడికి బాధ.
తాకట్టు సొమ్మును నీవు ఎంతకాలం పట్టుకుంటావు?
వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకుంటూ వీరంతా ఇతని విషయం ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుతారు గదా.
7పళ్ళు కొరికే వారు హటాత్తుగా వస్తారు.
నిన్ను హింస పెట్టబోయేవారు లేస్తారు.
నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు.
8నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు.
పట్టణాలకు వాటిలోని నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి, బలాత్కారాన్ని బట్టి, నిన్ను కొల్లగొడతారు.
9తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని,
తన యింటివారి కోసం అన్యాయంగా లాభం సంపాదించుకొనే వాడికి బాధ.
10నీవు చాలా మంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవే అవమానం తెచ్చుకున్నావు.
నీ దురాలోచన వలన నీకు వ్యతిరేకంగా నీవే పాపం చేశావు.
11గోడల్లోని రాళ్లు మొర్ర పెడుతున్నాయి.
దూలాలు వాటికి జవాబిస్తాయి.
12రక్తపాతం మూలంగా పట్టణం కట్టించే వారికి బాధ.
దుష్టత్వం మూలంగా ఊరిని స్థాపించే వారికి బాధ.
13జాతులు ప్రయాసపడతారు గాని అగ్ని పాలవుతారు.
వ్యర్థమైన దాని కోసం కష్టపడి ప్రజలు క్షీణించిపోతారు.
ఇది సేనల ప్రభువు యెహోవా చేతనే అవుతుంది.
14ఎందుకంటే సముద్రం జలాలతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
15తమ పొరుగు వాణ్ణి నగ్నంగా చూడాలని విషం కలిపి వారికి తాగించి వారిని మత్తులుగా చేసేవారికి బాధ.
16ఘనతకు మారుగా అవమానంతో నిండిపోతావు.
నీవు కూడా తాగి నీ నగ్నత కనపరచుకుంటావు.
యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ చేతికి వస్తుంది.
అవమానకరమైన వాంతి నీ ఘనత మీద పడుతుంది.
17లెబానోనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదికే వస్తుంది.
నీవు పశువులను చేసిన నాశనం నీ మీదే పడుతుంది.
దేశాలకు, పట్టణాలకు, వాటి నివాసులకు, నీవు చేసిన హింసాకాండను బట్టి, ఇది సంభవిస్తుంది.
18చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి?
బొమ్మను చెక్కిన శిల్పి, పోత పోసిన వాడు కేవలం అబద్ధాలు బోధించే వాడు.
తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమిటి?
19కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ.
అవి ఏమైనా బోధించగలవా?
దానికి బంగారంతో, వెండితో పూత పూశారు గానీ దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు.
20అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు.
లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు గాక.