హెబ్రీ పత్రిక 12
12
యాజక విశ్వాసి నడత, ఆరాధన (1) ఆదర్శం యేసే
1మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.
తండ్రి ఇచ్చే శిక్ష
3మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి. 4మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు. 5కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు.
“నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు.
ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”
6ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు. 7హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు. 8కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.
9ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా? 10మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.
11అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
12కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి. 13మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి 14అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. 15దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.
యాజకత్వాన్ని కోల్పోవద్దని హెచ్చరిక
16లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి. 17ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.
యాజక విశ్వాసి వచ్చేది సీనాయి కొండకు కాదు
18చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతూ ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు. 19బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏ మాటా చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు. 20ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు: “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి” అన్నదే ఆ ఆజ్ఞ.
21భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే, “నేను ఎంతో భయపడి వణుకుతున్నాను” అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు. 22ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు. 23పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు. 24ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.
సూచనలు, హెచ్చరికలు
25మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?
26ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.” 27“మరోసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలేవాటిని అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది. 28కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం. 29ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీ పత్రిక 12: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.