యెషయా 10

10
1వితంతువులు తమకు కొల్లసొమ్ముగా ఉండాలనీ,
2తల్లిదండ్రులు లేని వాళ్ళను దోచుకోవాలనీ కోరి, అవసరతలో ఉన్న వాళ్లకు న్యాయం జరిగించకుండా చేసి, నా ప్రజల్లో ఉన్న పేదలకు హక్కులు లేకుండా చేసి, అన్యాయ నియమాలు విధించే వారికీ, బాధ కలిగించే శాసనాలు చేసే వారికీ బాధ.
3తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?
4నువ్వు బందీలైన వాళ్ళ కింద ముడుచుకుని దాక్కున్నావు. హతమైన వాళ్ళతోపాటు పడి ఉన్నావు. అయినా యెహోవా కోపం చల్లారలేదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.
అష్షూరీయుల పై దేవుని శిక్ష
5అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర.
6భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాళ్ళను పంపిస్తాను. కొల్లసొమ్ము దోచుకోడానికీ, వేటాడింది తెచ్చుకోడానికీ, వాళ్ళను వీధుల్లో మట్టి తొక్కినట్టు తొక్కడానికీ, నా ఉగ్రతకు పాత్రులైన అహంకార ప్రజలకు విరోధంగా అతన్ని పంపిస్తాను.
7కాని అతడు ఆలా అనుకోడు. అది అతని ఉద్దేశం కాదు. నాశనం చెయ్యాలనీ, అనేకమందిని నిర్మూలం చెయ్యాలనీ అతని ఆలోచన.
8అతను “నా అధిపతులందరూ మహారాజులు కారా?
9కల్నో పట్టణం కర్కెమీషులాంటిదే కదా? హమాతు అర్పాదులాంటిది కాదా? షోమ్రోను దమస్కులాంటిది కాదా?
10విగ్రహాలను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి గదా, వాటి విగ్రహాలు యెరూషలేము, షోమ్రోనుల విగ్రహాల కంటే ఎక్కువే గదా.
11షోమ్రోను పట్ల, దాని విగ్రహాల పట్ల నేను చేసినట్టు యెరూషలేము పట్ల, దాని విగ్రహాల పట్ల చెయ్యకుండా ఉంటానా” అంటాడు.
12సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత ఆయన “నేను అష్షూరు రాజు హృదయ గర్వం కారణంగా అతని మాటను బట్టి, అతని కళ్ళల్లోని అహంకారపు చూపులను బట్టి, అతన్ని శిక్షిస్తాను” అంటాడు. 13ఎందుకంటే అతడు,
“నేను తెలివైన వాణ్ణి. నా బలంతో, నా బుద్ధితో అలా చేశాను. నేను దేశాల సరిహద్దులను మార్చి వాళ్ళ ఖజానాలను దోచుకున్నాను. మహా బలిష్ఠుడినై సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళను కూలదోశాను.
14పక్షిగూటిలో ఒకడు చెయ్యి పెట్టినట్టు దేశాల ఆస్తి చేజిక్కించుకున్నాను. విడిచిపెట్టిన గుడ్లను ఏరుకున్నట్టు నేను భూమంతా సంపాదించుకున్నాను. ఏ పక్షీ రెక్కలు ఆడించలేదు, నోరు తెరవలేదు, కిచకిచలాడలేదు” అంటాడు.
15నరికేవాణ్ణి చూసి గొడ్డలి తన గురించి తాను ప్రగల్భాలు పలుకుతుందా? కోసేవాణ్ణి చూసి రంపం తన గురించి తాను పొగడుకుంటుందా?
ఇది ఒక కర్ర తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలిగినట్టు ఉంది. ఒక గద ఒక వ్యక్తిని పైకి లేపగలిగినట్టు ఉంది.
16కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.
17ఇశ్రాయేలు దేవుని వెలుగు ఒక అగ్ని అవుతుంది. దాని పరిశుద్ధ దేవుడు ఒక జ్వాల అవుతాడు. అది అష్షూరు దేశపు బలురక్కసి చెట్లకూ, గచ్చపొదలకూ అంటుకుని ఒక్క రోజులో వాటిని మింగేస్తుంది.
18ఒకడు వ్యాధితో క్షీణించిపోయినట్టు శరీర ప్రాణాలతోపాటు అతని అడవికీ అతని ఫలభరితమైన పొలాలకూ కలిగిన మహిమను అది నాశనం చేస్తుంది.
19అతని అడవిచెట్ల లెక్క ఎంత తగ్గిపోతుందంటే, ఒక పసివాడు వాటిని లెక్కపెట్టగలుగుతాడు.
ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు
20ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు, యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్నవాళ్ళు తమను హతం చేసిన వాణ్ణి#10:20 తమను హతం చేసిన వాణ్ణి అష్షూరు రాజు ఇక ఎన్నడూ ఆశ్రయించకుండా ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడతారు. 21యాకోబులో మిగిలిన వాళ్ళు బలవంతుడైన దేవునివైపు తిరుగుతారు.
22ఇశ్రాయేలూ, నీ ప్రజలు సముద్రపు ఇసుకలా ఉన్నా, దానిలో మిగిలిన వాళ్ళే తిరుగుతారు. ప్రవాహంలా పారే నీతి నిర్ణయించిన ప్రకారం ఆ దేశానికి సమూల నాశనం ప్రాప్తించింది. 23ఎందుకంటే ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భూమంతటా తాను నిర్ణయించిన సమూల నాశనం అమలు చెయ్యబోతున్నాడు.
24ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “సీయోనులో నివాసం ఉంటున్న నా ప్రజలారా, అష్షూరుకు భయపడవద్దు. ఐగుప్తీయులు చేసినట్టు వాళ్ళు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తమ దండం ఎత్తుతారు. 25అతనికి భయపడవద్దు. ఇంక కొద్ది కాలమైన తరువాత నీ మీద నా కోపం చల్లారుతుంది. నా కోపం అతని నాశనానికి దారి తీస్తుంది.”
26ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించినట్టు సేనల ప్రభువైన యెహోవా తన కొరడాను అతని మీద ఝుళిపిస్తాడు. ఆయన ఐగుప్తులో చేసినట్టు తన కర్ర సముద్రం మీద ఎత్తి దాన్ని పైకెత్తుతాడు.
27ఆ రోజున నీ భుజం మీద నుంచి అతని బరువు, నీ మెడ మీద నుంచి అతని కాడి తీసివేయడం జరుగుతుంది. నీ మెడ బలంగా ఉన్న కారణంగా ఆ కాడి నాశనం అవుతుంది.
28శత్రువు ఆయాతు దగ్గరికి వచ్చాడు, మిగ్రోను మార్గంగుండా వెళ్తున్నాడు. మిక్మషులో తమ సామగ్రి నిల్వ చేశాడు.
29వాళ్ళు కొండ సందు దాటారు, గెబలో బస చేశారు. రమా వణకుతోంది. సౌలు గిబ్యా నివాసులు పారిపోయారు.
30గల్లీము ఆడపడుచులారా, బిగ్గరగా కేకలు వేయండి. లాయిషా, ఆలకించు! అయ్యయ్యో, అనాతోతు!
31మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గెబీము నివాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తుతున్నారు.
32ఈ రోజే అతను నోబులో ఆగుతాడు. ఈ రోజే సీయోను కుమారి పర్వతం, యెరూషలేము కొండవైపు వాళ్ళు తమ పిడికిలి ఊపుతున్నారు.
33చూడండి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భీకర శబ్దంతో కొమ్మలను తెగగొట్టినప్పుడు ఎత్తయిన చెట్లు కూలిపోతాయి. గంభీరమైనవి పడిపోతాయి.
34ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతాడు. ప్రఖ్యాతిగాంచిన లెబానోను కూలిపోతుంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 10: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి