యెషయా 26
26
యూదాలో ఆనంద పాట
1ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు.
“మనకి ఒక బలమైన పట్టణం ఉంది. దేవుడు రక్షణను దాని గోడలుగానూ ప్రాకారాలుగానూ చేశాడు.
2నీతిని పాటించే నమ్మకమైన జనం దానిలో ప్రవేశించేలా దాని తలుపులు తెరవండి.
3తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు.
4నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల!
5అలాగే ఆయన ఉన్నత స్థల నివాసులను, గర్వించే వాళ్ళనూ కిందకు లాగి పడవేస్తాడు. ఎత్తయిన ప్రాకారాలు గల పట్టణాన్ని కూలదోస్తాడు.
ఆయన దాన్ని నేలమట్టం చేస్తాడు. దుమ్ముతో ధూళితో కలిపివేస్తాడు.
6పేదల, అవసరంలో ఉన్నవాళ్ళ కాళ్ళు దాన్ని తొక్కివేస్తాయి.
7న్యాయవంతులు నడిచే దారి సమంగా ఉంటుంది. న్యాయ వంతుడా, నువ్వు న్యాయవంతులు దారిని తిన్నగా చేస్తావు.
8న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము.
నీ పేరు, నీ జ్ఞాపకాలే మా ప్రాణాలు కోరుకుంటున్నాయి.
9రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది. నాలోని ఆత్మలో చిత్తశుద్ధితో నిన్ను వెతుకుతూ ఉన్నాను.
నీ తీర్పులు భూమిపై తెలిసినప్పుడు ఈ లోక నివాసులు నీతిని అభ్యాసం చేస్తారు.
10దుర్మార్గుడికి నువ్వు దయ చూపినా వాడు మాత్రం నీ నీతిని నేర్చుకోడు. న్యాయబద్ధంగా జీవించే వారి మధ్యలో నివసించినా వాడు దుర్మార్గాన్నే అవలంబిస్తాడు.
యెహోవా ఘనతా ప్రభావాలను వాడు పట్టించుకోడు.
11యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు.
కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది.
12యెహోవా, నువ్వు మాకు శాంతిని నెలకొల్పుతావు. నిజంగా మా కార్యాలన్నిటినీ నువ్వే మాకు సాధించిపెట్టావు.
13మా దేవుడివైన యెహోవా, నువ్వు కాకుండా ఇతర ప్రభువులు మాపై రాజ్యం చేశారు గానీ మేం నీ నామాన్ని మాత్రమే కీర్తిస్తాం.
14వాళ్ళు చనిపోయారు. వాళ్ళిక మళ్ళీ బతకరు. వాళ్ళు మరణమయ్యారు. వాళ్ళిక తిరిగి లేవరు.
నువ్వు తీర్పు తీర్చడానికి వచ్చి వాళ్ళని నిజంగా అంతం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలన్నిటినీ తుడిచి పెట్టేశావు.
15యెహోవా, నువ్వు జనాన్ని వృద్ధి చేశావు. నువ్వే గౌరవం పొందావు.
దేశం సరిహద్దులను విశాలపరచావు.
16యెహోవా, కష్టాల్లో ఉన్నప్పుడు వారు నీ వైపు చూశారు. నువ్వు వాళ్లకి శిక్ష విధించినప్పుడు కీడుకువ్యతిరేకంగా నీకు ప్రార్థనలు వల్లించారు.
17బిడ్డని కనే సమయం దగ్గర పడినప్పుడు గర్భవతి వేదనతో కేకలు పెట్టినట్టుగానే ప్రభూ, మేం కూడా నీ సన్నిధిలో వేదన పడ్డాం.
18మేం గర్భంతో ఉన్నాం. నొప్పులు కూడా అనుభవించాం. కానీ మా పరిస్టితి గాలికి జన్మనిచ్చినట్టు ఉంది. భూమికి రక్షణ తేలేక పోయాం.
లోకంలో జనాలు పుట్టలేదు.
19మరణమైన నీ వారు బతుకుతారు. మా వారి మృత దేహాలు తిరిగి సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారు మేల్కొని ఆనందంగా పాడండి!
ఉదయంలో కురిసే మంచులా నీ కాంతి ప్రకాశమానమై కురిసినప్పుడు భూమి తాను ఎరగా పట్టుకున్న తనలోని విగత జీవులను సజీవంగా అప్పగిస్తుంది.
20నా ప్రజలారా, వెళ్ళండి! మీ గదుల్లో ప్రవేశించండి. తలుపులు మూసుకోండి.
మహా కోపం తగ్గే వరకూ దాగి ఉండండి. ఇదిగో వారి దోషాన్ని బట్టి భూనివాసులను శిక్షించడానికి యెహోవా తన నివాసంలోనుండి బయలు దేరుతున్నాడు.
భూమి తన మీద హతులైన వారిని ఇకపై కప్పకుండా తాను తాగిన రక్తాన్ని బయట పెడుతుంది.
21ఎందుకంటే చూడండి! యెహోవా తన నివాసం నుండి రాబోతున్నాడు. భూమిపైన ప్రజలు చేసిన అపరాధాలకై వాళ్ళని శిక్షించడానికి వస్తున్నాడు.
భూమి తనపై జరిగిన రక్తపాతాన్ని బహిర్గతం చేస్తుంది. వధకు గురైన వాళ్ళని ఇక దాచి పెట్టదు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 26: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.