65
తీర్పు, రక్షణ
1“నా విషయం అడగని వారిని నా దగ్గరికి రానిచ్చాను. నన్ను వెదకని వారికి నేను దొరికాను.
నన్ను పిలవని రాజ్యంతో ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అన్నాను.
2మూర్ఖంగా ఉండే ప్రజలకోసం రోజంతా నా చేతులు చాపాను.
వాళ్ళు తమ ఆలోచనలననుసరిస్తూ చెడు దారిలో నడుస్తూ ఉన్నారు.
3తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు.
వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు.
4వాళ్ళు సమాధుల్లో కూర్చుంటారు. రాత్రంతా మేల్కొని ఉంటారు.
తినకూడని మాంసం పులుసుతో, వాళ్ళ పాత్రల్లో పందిమాంసం తింటారు.
5‘మా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు. నీకంటే నేను పవిత్రుణ్ణి.’ అని వాళ్ళంటారు.
వీళ్ళంతా నా ముక్కుల్లో పొగలాగా రోజంతా మండే నిప్పులాగా ఉన్నారు.
6యెహోవా ఇలా చెబుతున్నాడు. ఇది నా ఎదుట గ్రంథంలో రాసి ఉంది.
నేను ఊరుకోను. ప్రతీకారం చేస్తాను. తప్పకుండా వీళ్ళను నేను శిక్షిస్తాను.
7వాళ్ళ పాపాలకూ వాళ్ళ పూర్వీకుల పాపాలకూ వారిని శిక్షిస్తాను.
పర్వతాలమీద ఈ ప్రజలు ధూపం వేసిన దాన్ని బట్టి, కొండలపై నన్ను దూషించిన దాన్ని బట్టి,
మునుపు చేసిన పనులకు కూడా వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచి పోస్తాను.”
8యెహోవా ఇలా చెబుతున్నాడు. “ద్రాక్షగెలలో కొత్త రసం ఇంకా కనబడితే
ప్రజలు, ‘దానిలో మంచి రసం ఉంది. దాన్ని నష్టం చేయవద్దు.’ అంటారు.
నా సేవకుల కోసం అలాగే చేస్తాను. నేను వాళ్లందరినీ నాశనం చేయను.
9యాకోబు వంశంలో సంతానాన్ని పుట్టిస్తాను. యూదాలో నా పర్వతాలను స్వాధీనం చేసుకునే వారిని పుట్టిస్తాను. నేను ఏర్పరచుకున్న వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు.
10నన్ను వెతికిన నా ప్రజల కోసం షారోను గొర్రెల మేతభూమి అవుతుంది.
ఆకోరు లోయ, పశువులకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది.
11అయితే యెహోవాను వదిలేసి, నా పవిత్ర పర్వతాన్ని విస్మరించి, అదృష్టదేవుడికి బల్ల సిద్ధపరచి, విధి దేవుడికి పానీయార్పణం అర్పిస్తున్నారు.
12నేను పిలిచినప్పుడు మీరు జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు.
దానికి బదులు నా దృష్టికి చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు.
కాబట్టి నేను కత్తిని మీకు విధిగా నియమిస్తాను. మీరంతా వధకు లోనవుతారు.”
13యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు.
“వినండి. నా సేవకులు భోజనం చేస్తారు గానీ మీరు ఆకలిగొంటారు.
నా సేవకులు పానం చేస్తారు గానీ మీరు దప్పిగొంటారు.
నా సేవకులు సంతోషిస్తారు గానీ మీరు సిగ్గుపాలవుతారు.
14నా సేవకులు గుండె నిండా ఆనందంతో కేకలు వేస్తారు గానీ
మీరు గుండె బరువుతో ఏడుస్తారు. మనోవేదనతో రోదిస్తారు.
15నేను ఎన్నుకున్న వారికి మీ పేరు శాపవచనంగా విడిచిపోతారు. నేను, యెహోవాను, మిమ్మల్ని హతం చేస్తాను.
నా సేవకులను వేరే పేరుతో పిలుస్తాను.
16ప్రపంచానికి దీవెన ప్రకటించేవాణ్ణి, సత్యమై ఉన్న నేనే దీవిస్తాను.
భూమి మీద ప్రమాణం చేసేవాడు సత్యమై ఉన్న దేవుడినైన నా తోడని ప్రమాణం చేస్తాడు.
ఎందుకంటే మునుపు ఉన్న కష్టాలను మర్చిపోతాడు. అవి నా కంటికి కనబడకుండా పోతాయి.
కొత్త ఆకాశం, కొత్త భూమి
17ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను.
గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను.
18అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను.
19నేను యెరూషలేము గురించి ఆనందిస్తాను. నా ప్రజలను గురించి ఆనందిస్తాను.
ఏడుపు, రోదన దానిలో ఇక వినబడవు.
20కొద్దిరోజులే బతికే పసికందులు ఇక ఎన్నడూ అక్కడ ఉండరు.
ముసలివారు కాలం నిండకుండా చనిపోరు.
నూరేళ్ళ వయసులో చనిపోయేవారిని యువకులు అంటారు.
నూరేళ్ళ వయసు ముందే చనిపోయే పాపిని శాపానికి గురి అయినవాడుగా ఎంచుతారు.
21ప్రజలు ఇళ్ళు కట్టుకుని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటించుకుని వాటి పండ్లు తింటారు.
22వారు కట్టుకున్న ఇళ్ళల్లో వేరేవాళ్ళు కాపురముండరు. వారు నాటిన వాటిని ఇతరులు తినరు.
నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంత ఉంటుంది. నేను ఎన్నుకున్నవారు తాము చేతులతో చేసిన వాటిని చాలాకాలం ఉపయోగించుకుంటారు.
23వారు వృథాగా ప్రయాసపడరు. దిగులు తెచ్చుకుని పిల్లలను కనరు.
వారు యెహోవా దీవించే ప్రజలుగా ఉంటారు. వారి సంతానం కూడా అలాగే ఉంటారు.
24వాళ్ళు పిలవక ముందే నేను వారికి జవాబిస్తాను. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నేను వింటాను.
25తోడేళ్లు గొర్రెపిల్లలు కలిసి మేస్తాయి. సింహం ఎద్దులాగా గడ్డి తింటుంది. పాము మట్టి తింటుంది.
నా పవిత్ర పర్వతమంతట్లో అవి హాని చేయవు. నాశనం చేయవు” అని యెహోవా చెబుతున్నాడు.