10
జీవం గల దేవుడు, విగ్రహాలు
10:12-16; యిర్మీ 51:15-19
1ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మీ గురించి చెప్పే మాటలు వినండి.
2యెహోవా చెప్పేదేమంటే, అన్యజాతుల ప్రజల ఆచారాలు పాటించకండి.
వారు ఆకాశంలో కనబడే సూచనలకు భయపడతారు. కానీ మీరు మాత్రం భయపడవద్దు.
3ఆ ప్రజల ఆచారాలు నిష్ప్రయోజనం. ఒకడు అడవిలో చెట్టు నరకుతాడు, పనివాడు దాన్ని గొడ్డలితో చెక్కుతాడు.
4అప్పుడు వారు దానికి వెండి బంగారు వస్తువులు అలంకరిస్తారు. అది కదలకుండా ఉండేలా దానికి సుత్తితో మేకులు కొట్టి బిగిస్తారు.
5అవి దోస తోటల్లో దిష్టి బొమ్మల్లాగా నిలబడి ఉంటాయి. పలకవు, నడవలేవు కాబట్టి వాటిని ఎవరైనా మోయాలి.
అవి మీకు హాని చేయలేవు. కాబట్టి వాటికి భయపడకండి. వాటి వలన మంచి ఏమీ జరగదు.
6యెహోవా, నీలాంటివాడు ఎవరూ లేరు. నువ్వు గొప్పవాడివి. నీ బల ప్రభావాలను బట్టి నీ పేరు ఎంతో ఘనతకెక్కింది.
7లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.
8వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా.
9తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టిన వెండినీ ఉఫాజ్ నుండి బంగారాన్నీ తెస్తారు.
అది కూలీల చేతి పని. ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగు వస్త్రాలు తొడిగారు. అవన్నీ వైపుణ్యం గల పనివారు చేసినవే.
10అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు.
ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు.
11మీరు వారితో ఇలా చెప్పాలి. “భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు.
12ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.
13ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.
14ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు.
15అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.
16యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు అలాంటి వాడు కాడు. ఆయన సమస్తాన్నీ నిర్మించేవాడు.
ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారసత్వం. సేనల ప్రభువు అని ఆయనకు పేరు.
రాబోయే ఉపద్రవం
17ముట్టడిలో ఉన్న ప్రజలారా, దేశం విడిచి వెళ్ళడానికి నీ సామాను సర్దుకోండి.”
18యెహోవా చేప్పేదేమంటే “నేను ఈసారి ఈ దేశ నివాసులను బయటికి విసిరివేస్తాను.
వారు పట్టబడేలా చేసి నిస్పృహకు గురి చేస్తాను.”
19అయ్యో, నా ఎముకలకు దెబ్బ తగిలి ఆ గాయం పుండుగా మారింది.
అయితే “ఇది నాకు కలిగిన బాధ. నేను దీనిని సహించాల్సిందే” అనుకుంటాను.
20నా గుడారం చిందర వందర అయ్యింది. నా డేరా తాళ్ళు అన్నీ తెగిపోయాయి. వారు నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. అందుకే వారు లేరు.
నా డేరా నిలబెట్టడానికి, వాటి తెరలు వేయడానికి నా దగ్గర ఎవరూ లేరు.
21కాపరులు మూర్ఖులై యెహోవాను అడగరు. కాబట్టి వారికి విజయం లేదు. వారి మందలన్నీ చెదరిపోతున్నాయి.
22అదిగో వినండి, వార్త రానే వచ్చింది, వారి రాక ధ్వని వినబడుతూ ఉంది. యూదా పట్టణాలను పాడు చేసి, వాటిని నక్కల నివాసంగా చేయడానికి ఉత్తరదేశం నుండి వస్తున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుతూ ఉంది.
23యెహోవా, మనుషులు తమ మార్గాలను నిర్ణయించుకోవడం వారికి చేతకాదనీ, మంచిగా ప్రవర్తించడం వారి వశంలో లేదనీ నాకు తెలుసు.
24యెహోవా, నన్ను నీ న్యాయవిధిని బట్టి క్రమశిక్షణలో పెట్టు. అలా కాక నీ కోపాన్ని బట్టి శిక్షించావంటే నేను నాశనమైపోతాను.
25నిన్నెరగని అన్యజనాల మీదా నీ పేరున ప్రార్థించని వంశాల మీదా నీ కోపాన్ని కుమ్మరించు.
ఎందుకంటే వారు యాకోబు వంశాన్ని పూర్తిగా నిర్మూలం చేయడానికి మింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.