యిర్మీయా 14

14
కరువు, దేవుని సందేశం
1కరువు గురించి యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు,
2“యూదా రోదించాలి. దాని ద్వారాలు పడిపోవాలి. వాళ్ళు భూమి కోసం ఏడుస్తున్నారు. యెరూషలేము కోసం వాళ్ళు చేస్తున్న రోదన పైకి వెళ్తూ ఉంది.
3వాళ్ళ నాయకులు తమ పనివాళ్ళను నీళ్ల కోసం పంపుతారు. వాళ్ళు బావుల దగ్గరికి పోతే నీళ్లుండవు. ఖాళీ కుండలతో వాళ్ళు తిరిగి వస్తారు. సిగ్గుతో అవమానంతో తమ తలలు కప్పుకుంటారు.
4దేశంలో వాన రాకపోవడంతో నేల బీటలు వారింది. రైతులు సిగ్గుతో తమ తలలు కప్పుకుంటున్నారు.
5గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది.
6అడవి గాడిదలు చెట్లులేని మెట్టల మీద నిలబడి నక్కల్లాగా రొప్పుతున్నాయి. మేత లేక వాటి కళ్ళు పీక్కుపోతున్నాయి.”
7యెహోవా, మా అపరాధాలు మా మీద నేరారోపణ చేస్తున్నప్పటికీ, నీ నామం కోసం కార్యం జరిగించు. చాలాసార్లు దారి తప్పాం. నీకు విరోధంగా మేము పాపం చేశాం.
8ఇశ్రాయేలు ఆశ్రయమా! కష్టకాలంలో వారిని రక్షించేవాడివి. దేశంలో నువ్వెందుకు పరాయివాడిగా ఉన్నావు? ఒక్క రాత్రే బస చేసే బాటసారిలా ఎందుకు ఉన్నావు?
9కలవరపడిన వాడిలా, ఎవరినీ కాపాడలేని శూరునిలా నువ్వెందుకున్నావు? యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు! నీ పేరు మా మీద నిలిచి ఉంది. మమ్మల్ని విడిచి పెట్టవద్దు.
10యెహోవా ఈ ప్రజలను గురించి ఇలా చెబుతున్నాడు. “తిరుగులాడడం అంటే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు తమ కాళ్లను అదుపులో ఉంచుకోవడం లేదు.” యెహోవా వారిపట్ల ఇష్టంగా లేడు. ఇప్పుడు ఆయన వారి అక్రమాన్ని గుర్తుకు తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షించాడు.
11అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజల మేలు కోసం ప్రార్థన చేయవద్దు.
12వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”
13అందుకు నేనిలా అన్నాను “అయ్యో, యెహోవా ప్రభూ! ‘మీరు కత్తి చూడరు. మీకు కరువు రాదు. ఈ స్థలంలో నేను స్థిరమైన భద్రత మీకిస్తాను’ అని ప్రవక్తలు వాళ్ళతో ఇలా చెబుతున్నారు.”
14అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. “ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.
15అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.”
16“వాళ్ళెవరితో అలాంటి ప్రవచనాలు చెబుతారో ఆ ప్రజలు కరువుకూ కత్తికీ గురై, యెరూషలేము వీధుల్లో కూలుతారు. నేను వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ మీదికి రప్పిస్తాను. వాళ్ళనూ వాళ్ళ భార్యలనూ వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ పాతిపెట్టడానికి ఎవడూ ఉండడు.”
17“నువ్వు వాళ్ళతో ఈ మాటలు చెప్పు, కన్య అయిన నా ప్రజల కూతురు ఘోరంగా పతనమవుతుంది. అది మానని పెద్ద గాయం పాలవుతుంది. రాత్రి, పగలు నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారనివ్వండి.
18పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.”
19నువ్వు యూదాను పూర్తిగా వదిలేశావా? సీయోను అంటే నీకు అసహ్యమా? మేము కోలుకోలేనంతగా నువ్వు మమ్మల్ని ఎందుకు కొట్టావు? మేము శాంతి కోసం ఆశించాం గానీ మేలు కలిగించేది ఏదీ రాలేదు. కోలుకునేలా ఎదురు చూశాం గానీ చుట్టూ భయానక దృశ్యాలే.
20యెహోవా, మేము నీకు విరోధంగా పాపం చేశాం. మా దుర్మార్గాన్నీ మా పూర్వీకుల దోషాన్నీ మేము ఒప్పుకుంటున్నాం.
21నీ పేరును బట్టి మిమ్మల్ని గౌరవించేలా మమ్మల్ని తోసివేయవద్దు. మాతో నువ్వు చేసిన నిబంధనను గుర్తు చేసుకో. దాన్ని భంగం చేయవద్దు.
22ఇతర రాజ్యాలు పెట్టుకున్న విగ్రహాలు ఆకాశం నుంచి వాన కురిపిస్తాయా? మా యెహోవా దేవా, ఇలా చేసేది నువ్వే గదా! ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీ కోసమే మేము ఆశాభావంతో ఉన్నాము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 14: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి