యిర్మీయా 4

4
1యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తిరిగి రాదలిస్తే నా దగ్గరకే రావాలి.
మీరు మీ హేయమైన విగ్రహాలను తీసివేసి నా సన్నిధి నుండి ఇటూ అటూ తప్పిపోకుండా ఉంటే,
2యథార్థంగా, నీతి నిజాయితీతో “యెహోవా జీవం తోడు” అని ప్రమాణం చేస్తే,
జాతులకు ఆయనలో ఆశీర్వాదం దొరుకుతుంది. వారు ఆయనలోనే అతిశయిస్తారు.
3యూదా వారికీ యెరూషలేము నివాసులకూ యెహోవా చెప్పేదేమంటే, ముళ్ల పొదల్లో విత్తనాలు చల్లవద్దు. మీ బీడు భూమిని దున్నండి.
4యూదా, యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలకు సున్నతి#4:4 హృదయాలకు సున్నతి హృదయాలను అంకితం చేసుకోండి. మీ దుష్టక్రియలను బట్టి నా కోపం అగ్నిలాగా మండుతున్నది. దాన్ని ఎవరూ ఆర్పివేయలేరు. కాబట్టి యెహోవాకు లోబడి ఉండండి.
ఉత్తర దిక్కునుండి తీర్పు
5యెరూషలేములో వినబడేలా యూదాలో ఇలా ప్రకటించండి. “దేశంలో బూర ఊదండి.” గట్టిగా ఇలా హెచ్చరిక చేయండి. “ప్రాకారాలతో ఉన్న పట్టణాల్లోకి వెళ్దాం రండి.” 6సీయోనుకు కనబడేలా జెండా ఎత్తండి. తప్పించుకోడానికి పారిపోండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే యెహోవా అనే నేను ఉత్తరదిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. గొప్ప వినాశనాన్ని రప్పిస్తున్నాను.
7పొదల్లో నుండి సింహం బయలుదేరింది. జాతుల వినాశకుడు బయలు దేరాడు. నీ దేశాన్ని నాశనం చేయడానికి, నీ పట్టణాలను శిథిలాలుగా మార్చి ఎవరూ నివసించకుండా చేయడానికి అతడు తన చోటు నుండి బయలు దేరాడు. 8యెహోవా కోపాగ్ని మన మీద నుండి తొలగిపోలేదు. కాబట్టి గోనె పట్ట కట్టుకోండి. రోదనతో విలపించండి.
9యెహోవా చెప్పేదేమంటే “ఆ రోజు రాజూ అతని అధికారులూ ధైర్యం కోల్పోతారు. యాజకులు నిర్ఘాంతపోతారు. ప్రవక్తలు విస్మయానికి గురౌతారు.” 10అప్పుడు నేనిలా అన్నాను “అయ్యో, ప్రభూ యెహోవా! ‘మీకు క్షేమంగా ఉంటుంది’ అని చెప్పి యెరూషలేము ప్రజలను మోసం చేశావు. ఇప్పుడేమో ఖడ్గం వారి ప్రాణాల మీద పడి హతం చేస్తూ ఉంది.”
11ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. “ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు. 12నా మాట చొప్పున అంతకంటే మరింత బలమైన గాలి వీస్తుంది. ఇప్పుడు వారి మీదికి రాబోయే తీర్పులు ప్రకటిస్తాను.” 13ఆయన రాక మేఘాలు కమ్ముతున్నట్టుగా ఉంది. ఆయన రథాలు సుడిగాలిలాగా, ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి. అయ్యో, మనం నాశనమై పోయాం.
14యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు? 15దాను పట్టణం నుండి ఒకడు ప్రకటన చేస్తున్నాడు, కీడు రాబోతున్నదని ఎఫ్రాయిము కొండల్లో ఒకడు చాటిస్తున్నాడు, 16దూరదేశం నుండి ముట్టడి వేసేవారు వచ్చి “యూదా పట్టణాలను పట్టుకోబోతున్నాం” అని పెద్దపెద్ద కేకలు వేస్తున్నారని యెరూషలేముకు, ఇతర రాజ్యాలకు ప్రకటించండి. 17యూదా నా మీద తిరుగుబాటు చేసింది కాబట్టి వారు పొలాన్ని కావలి కాసేవారిలాగా యూదాను కూడా ముట్టడిస్తారు. ఇదే యెహోవా వాక్కు.
18నీ ప్రవర్తన, నీ క్రియలే ఈ ఆపదను నీ మీదికి రప్పించాయి. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉండి నీ హృదయాన్ని గట్టిగా తాకుతున్నది కదా? 19నా హృదయం! నా హృదయం! వేదనతో నా అంతరంగం అల్లాడుతూ ఉంది. నా గుండె బాధగా కొట్టుకుంటూ ఉంది. తాళలేకపోతున్నాను. బాకానాదం వినబడుతున్నది, యుద్ధ ఘోష విని నేను తట్టుకోలేను. 20కీడు తరవాత కీడు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హటాత్తుగా నా గుడారాలు, క్షణాల్లో వాటి తెరలు పాడైపోయాయి. 21ఇంకెన్నాళ్లు నేను ధ్వజాన్ని చూస్తూ, బాకానాదం వింటూ ఉండాలి? 22నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.
23నేను భూమిని చూశాను. అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది. ఆకాశాన్ని చూశాను, అక్కడ వెలుగు లేదు. 24పర్వతాలను చూస్తే అవి కంపిస్తూ ఉన్నాయి, కొండలన్నీ కదిలిపోతున్నాయి. 25నేను చూసినప్పుడు మనిషి ఒక్కడు కూడా లేడు. ఆకాశపక్షులన్నీ ఎగిరిపోయాయి. 26నేను చూస్తూ ఉండగా యెహోవా కోపాగ్నికి ఫలవంతమైన భూమి ఎడారిలా మారింది. అందులోని పట్టణాలన్నీ పూర్తిగా కూలిపోయాయి.
27యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశమంతా పాడైపోతుంది. అయితే దాన్ని పూర్తిగా నాశనం చేయను. 28దాని విషయం భూమి దుఃఖిస్తుంది. ఆకాశం చీకటి కమ్ముతుంది. నేను నిర్ణయించాను, వెనక్కి తగ్గను. పశ్చాత్తాప పడను, దాన్ని రద్దు చేయను. 29రౌతులూ విలుకాళ్ళూ చేసే శబ్దం విని పట్టణ ప్రజలంతా పారిపోయి అడవుల్లో దూరుతున్నారు, ఉన్నత ప్రాంతాల్లో రాళ్ళ మధ్యకు ఎక్కుతున్నారు. ప్రతి పట్టణం నిర్మానుష్యంగా మారింది. వాటిలో ఎవరూ నివసించడం లేదు.
30నీవు ధ్వంసం అయ్యావు. ఏమి చేయగలవు? ఎరుపు రంగు బట్టలు కట్టుకుని, బంగారు నగలు ధరించి, కాటుకతో నీ కళ్ళు పెద్దగా కనబడేలా చేసుకున్నావు, నీ అలంకరణ అంతా వ్యర్ధం. ఇంతకు ముందు నిన్ను ప్రేమించిన వారు నిన్ను తృణీకరిస్తారు. పైగా వారే నిన్ను చంపడానికి చూస్తారు. 31స్త్రీ పురిటినొప్పులతో కేకలు వేస్తున్నట్టు, తొలి కాన్పులో స్త్రీ కేకలు వేస్తున్నట్టు సీయోను కన్య “అయ్యో, నాకు బాధ! నా హంతకుల చేతిలో చిక్కి నేను మూర్చబోతున్నాను” అని ఎగశ్వాసతో చేతులు చాస్తూ వేస్తున్న కేకలు నాకు వినబడుతున్నాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 4: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి