యిర్మీయా 48
48
మోయాబును గూర్చి ప్రవచనం
48:29-36; యెష 16:6-12
1సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా మోయాబును గూర్చి ఇలా అంటున్నాడు.
నెబోకు బాధ, అది సర్వ నాశనమౌతుంది. కిర్యతాయిమును వశం చేసుకున్నారు. అది అవమానాన్ని ఎదుర్కుంటుంది.
ఆమె కోటను కూల్చివేశారు. అవమానం పాలు చేశారు.
2మోయాబు గౌరవం అంతరించింది. వాళ్ళ శత్రువులు హెష్బోనులో దానికి కీడు చేయాలని ఆలోచిస్తున్నారు.
‘రండి, అది ఒక దేశంగా ఉండకుండా దాన్ని నాశనం చేద్దాం. మద్మేనా కూడా అంతరించి పోతుంది. కత్తి నిన్ను తరుముతూ ఉంది.’
3వినండి! హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ అనర్ధం, మహా విధ్వంసం జరిగాయి.
4మోయాబు దేశాన్ని నాశనం చేశారు. దాని పిల్లల రోదన ధ్వని వినిపిస్తుంది.
5ప్రజలు లూహీతు కొండ ఎక్కుతూ ఏడుస్తున్నారు.
హొరొనయీము వెళ్ళే దారిలో జరిగిన విధ్వంసాన్ని బట్టి ప్రజల పెడబొబ్బలు వినిపిస్తునాయి.
6పారిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. అడవిలో పెరిగే అరూహ చెట్లలా ఉండండి.
7నువ్వు నీ పనుల పైనా, నీ ధనం పైనా నమ్మకముంచావు. కాబట్టి నువ్వు కూడా వాళ్ళ వశం అవుతావు.
కెమోషు దేవుణ్ణి, వాడి యాజకుల, నాయకులతో సహా బందీలుగా పట్టుకుపోతారు.
8యెహోవా చెప్పినట్టు వినాశకుడు ప్రతి పట్టణం పైకీ వస్తాడు. ఏ పట్టణం కూడా తప్పించుకోలేదు.
లోయ నశించి పోతుంది. మైదానం ధ్వంసమై పోతుంది.
9మోయాబు ఎగిరి పోవాల్సి ఉంది. దానికి రెక్కలు ఇవ్వండి.
ఆమె పట్టణాలు వ్యర్ధభూమి అవుతాయి. అక్కడ ఎవ్వరూ నివసించరు. 10యెహోవా చెప్పిన పనులను నిర్లక్ష్యంగా చేసేవాడు శాపానికి గురి అవుతాడు గాక! రక్తం రుచి చూడకుండా తన కత్తిని వరలో పెట్టేవాడు శాపానికి గురి అవుతాడు గాక!
11మోయాబు తన బాల్యం నుండీ సురక్షితంగానే ఉన్నట్టు భావించాడు.
అతడు ఒక పాత్రనుండి మరో పాత్రకు పోయని ద్రాక్షరసంలా ఉన్నాడు. అలాగే అతడు ఎప్పుడూ చెరలోకి వెళ్ళలేదు.
కాబట్టి అతని రుచి ఎప్పటిలా బాగానే ఉంది. సువాసన కూడా మారకుండా ఉంది. 12కాబట్టి చూడండి. ఆ రోజులు రాబోతున్నాయి. ఆ రాబోయే రోజుల్లో వాడి పాత్రలను వంచి వాటిని ఖాళీ చేసే వారిని పంపుతాను. వాళ్ళు అతని కుండలను పగలగొడతారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
13“ఇశ్రాయేలు ప్రజలు తాము నమ్ముకున్న బేతేలు విషయంలో సిగ్గు పడినట్టే మోయాబు వాళ్ళు కెమోషు విషయంలో సిగ్గు పడతారు.
14‘మేము బలవంతులం, పోరాడే సైనికులం’ అని మీరెలా చెప్తారు?
15మోయాబు సర్వనాశనమవుతుంది. దాని పట్టణాలు దాడులకు గురౌతాయి. దాని యువకుల్లో శ్రేష్ఠమైన వాళ్ళు వధ జరిగే ప్రదేశానికి వెళ్తున్నారు.
సేనల ప్రభువైన యెహోవా అనే పేరున్న రాజు చేస్తున్న ప్రకటన ఇదే!
16మోయాబు త్వరలో నాశనం కాబోతోంది. దాని పైకి రావాలని ఘోర దుర్ఘటన త్వరపడుతూ ఉంది.
17మోయాబు చుట్టూ నివసించేవాళ్ళు, దాని కీర్తి ప్రతిష్టలు తెలిసిన వాళ్ళు రోదించండి.
‘దాని బలమైన రాజదండం, ఘనత పొందిన దాని చేతిలోని కర్ర విరిగిపోయాయి’ అని చెప్తూ విలపించండి.
18దేబోనులో గౌరవపీఠంపై కూర్చున్నదానా, కిందకు దిగి రా. ఎండిన నేలపై కూర్చో.
ఎందుకంటే మోయాబును నాశనం చేయబోయే వాడు నీపై దాడి చేస్తున్నాడు. అతడు నీ కోటలను నాశనం చేస్తాడు.
19అరోయేరులో నివసించే వాళ్ళు దారిలో నిలబడి గమనించండి.
తప్పించుకుని పారిపోతున్న వాళ్ళని ‘ఏం జరిగింది’ అని అడగండి.
20మోయాబుకు అవమానం జరిగింది. అది ధ్వంసమై పోయింది. రోదించండి, పెడబొబ్బలు పెట్టండి. సహాయం కోసం కేకలు వేయండి.
మోయాబు సమూలంగా నాశనమైందని అర్నోను నదీ తీరాన ఉన్న వాళ్లకు చెప్పండి.
21ఇప్పుడు కొండమీది దేశాల పైకి శిక్ష వస్తుంది.
హోలోను, యాహసు, మేఫాతు, దీబోను,
22నెబో, బేత్దిబ్లాతయీము, కిర్యతాయిము, బేత్గామూలు,
23బేత్మెయోను, కెరీయోతు, బొస్రా ల పైకి శిక్ష వస్తుంది.
24దూరాన, సమీపాన ఉన్న మోయాబు పట్టణాలన్నిటి పైకి శిక్ష వస్తుంది.
25మోయాబు కొమ్మును నరికివేశారు. దాని చేతిని విరిచి వేశారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
26“యెహోవానైన నాకు విరోధంగా మోయాబు ఆహంకరించాడు. అతనికి మత్తెక్కనీ. మోయాబు తన వాంతిలో పొర్లాడి అవమానం పొందుతాడు. ఎగతాళి పాలవుతాడు. 27ఇశ్రాయేలును చూసి నువ్వు నవ్వలేదా? ఎగతాళి చేయలేదా? అతణ్ణి గూర్చి మాట్లాడినప్పుడల్లా నువ్వు తల ఊపుతూ ఉన్నావే, అతణ్ణి దొంగల గుంపులో చూశావా ఏమిటి?
28మోయాబు నివాసులారా, మీరు పట్టణాలు విడిచి పెట్టండి. కొండపై బండ సందుల్లో నివసించండి.
బండపైని రంధ్రాల మొదట్లో గూడు కట్టుకునే గువ్వల్లా ఉండండి.
29మోయాబు గర్వం గురించీ, అహంకారం గురించీ విన్నాం.
అతడి అహంకారం, గర్వం, ఆత్మ స్తుతీ, హృదయంలో అతిశయం, అన్నీ విన్నాం.”
30ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “అతడి తిరస్కార పూరితమైన మాటలు నేను విన్నాను. అతడు చేసే పనుల్లానే అతడి మాటలకు కూడా ఎలాంటి విలువా లేదు.
31కాబట్టి మోయాబు కోసం నేనే ఒక రోదనం చేస్తాను. మోయాబు అంతటి కోసం వేదనతో కేకలు పెడతాను.
కీర్హరెశు ప్రజలు కోసం ఏడుస్తాను.
32సిబ్మా ద్రాక్ష చెట్టూ, యాజెరు గూర్చి నేను ఏడ్చిన దాని కంటే ఎక్కువగా నీ కోసం విలపిస్తాను! నీ తీగెలు ఉప్పు సముద్రాన్ని దాటాయి.
అవి యాజెరు వరకూ వ్యాపించాయి. వినాశకుడు నీ వేసవి కాలం పంట పైనా, నీ ద్రాక్షారసం పైనా దాడి చేశాడు.
33కాబట్టి మోయాబు దేశంలో నుండి పళ్ళ చెట్ల మూలంగా కలిగే సంతోషమూ, సంబరమూ తొలగిపోయాయి.
‘వాళ్ళ ద్రాక్ష గానుగల్లో ద్రాక్షారసానికి నేను ముగింపు పలికాను. వాళ్ళు గానుగలో ద్రాక్షలు తొక్కేటప్పుడు ఆనందంతో కూడిన కేకలు వినిపించవు. వినిపించే కేకల్లో ఆనందం ఉండదు.
34నిమ్రీములో నీళ్ళు కూడా ఎండిపోయాయి. కాబట్టి ప్రజల కేకలు హెష్బోను నుండి ఏలాలే వరకూ, ఇంకా యాహసు వరకూ, సోయరు నుండి హొరొనయీము వరకూ, ఎగ్లాత్షాలిషా వరకూ వినిపిస్తున్నాయి. 35మోయాబు గుళ్ళలో బలులర్పించే వాళ్ళను నేను అంతం చేస్తాను. తన దేవుడికి ధూపం వేసే వాణ్ణి కూడా ఉండనియ్యను.’” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
36కాబట్టి నా హృదయం పిల్లనగ్రోవిలా మోయాబు కోసం విలపిస్తుంది. నా హృదయం పిల్లనగ్రోవిలా కీర్హరెశులో ప్రజల కోసం విలపిస్తుంది. వాళ్ళు సంపాదించిన సంపదలన్నీ పోయాయి. 37ప్రతి తలా బోడి అయింది. ప్రతి గడ్డమూ క్షవరం అయింది. ప్రతి వ్యక్తి చేతి పైనా గాట్లు ఉన్నాయి. ప్రతి నడుముకూ గోనె పట్టా ఉంది.
38మోయాబులో ప్రతి ఇంటి కప్పు పైనా, ప్రతి వీధిలోనూ ఏడ్పులు వినిపిస్తున్నాయి. “ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పనికిరాని కుండను పగలగొట్టినట్టు నేను మోయాబును పాడు చేశాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
39“ఇది ఎలా సర్వ నాశనమైంది? వీళ్ళు రోదిస్తూ ఎలా కేకలు పెడుతున్నారో! మోయాబు సిగ్గుతో వెనక్కి తిరిగింది. కాబట్టి మోయాబు తన చుట్టూ ఉన్న వాళ్లకు భయాన్ని కలిగించేదిగా, పరిహాసం చేయదగ్గదిగా ఉంటుంది.”
40యెహోవా ఇలా చెప్తున్నాడు. “తన రెక్కలను విప్పార్చుకుని ఎగిరే గద్దలా శత్రువు మోయాబు పైకి వస్తున్నాడు.
41కోటలు పడగొడుతున్నారు. బలమైన దుర్గాలు పట్టుకుంటున్నారు.
ఆ రోజున మోయాబు వీరుల హృదయాలు ప్రసవించబోయే స్త్రీ హృదయంలా ఉంటాయి.
42యెహోవా నైన నాకు వ్యతిరేకంగా ఆహంకరించింది కాబట్టి మోయాబు ఒక జాతిగా ఉండకుండా నాశనమైంది.
43మోయాబు నివాసీ, భయమూ, గుంటా, వలా నీ పైకి వస్తున్నాయి” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
44“భయంతో పారిపోయే వాళ్ళు గుంటలో పడతారు.
గుంటలో నుండి తప్పించుకుని పైకి వచ్చిన వాళ్ళు వలలో చిక్కుకుంటారు.
వాళ్ళపై ప్రతీకారం చేసే సంవత్సరంలో నేనే దీన్ని వాళ్ళ పైకి తీసుకు వచ్చాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
45“పారిపోయిన వాడు హెష్బోనులో బలహీనుడై నీడలో నిలబడతాడు. ఎందుకంటే హెష్బోనులో నుండి అగ్ని బయలుదేరుతుంది.
సీహోను నుండి అగ్ని జ్వాలలు బయలు దేరుతాయి. అవి మోయాబు నుదుటినీ, అహంకారుల తలలనూ చీల్చివేస్తాయి.
46అయ్యో, మోయాబూ! నీకు బాధ, కెమోషు#48:46 కెమోషు మోయాబు దేవత ప్రజలు నాశనమయ్యారు.
ఎందుకంటే నీ కొడుకులను బందీలుగా తీసుకు వెళ్ళారు. నీ కూతుళ్ళు చెరలోకి పోయారు.
47కాని తర్వాత రోజుల్లో మోయాబు ప్రజల భాగ్యాన్ని నేను పునరుద్ధరిస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
ఇక్కడితో మోయాబు పైన తీర్పును గూర్చిన వివరాలు ముగిశాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 48: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.