21
ఉత్థానం అయిన క్రీస్తు మన సేవకు యజమాని
1ఆ తరువాత తిబెరియ సముద్రం ఒడ్డున యేసు తనను మరోసారి కనపరచుకున్నాడు. ఎలాగంటే 2సీమోను పేతురు, దిదుమ అనే పేరున్న తోమా, గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ, ఇంకా ఆయన శిష్యుల్లో మరో ఇద్దరూ కలిసి ఉన్నారు.
3సీమోను పేతురు, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా” అన్నాడు. మిగిలిన వారు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. వారంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా వారు ఏమీ పట్టలేదు. 4తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. 5యేసు, “పిల్లలూ, చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు.” 6అప్పుడాయన, “పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు.
క్రీస్తు కనుసన్నల్లో సేవ, ఫలితం
7అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, “ఆయన ప్రభువు!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే ఇంతకు ముందు తీసివేసిన తన పైబట్ట మళ్ళీ తనపై వేసుకుని సముద్రంలో దూకాడు. 8ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు. 9ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. 10అప్పుడు యేసు, “ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి” అని వారికి చెప్పాడు. 11సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి.
తన సేవకుల అవసరాలు తీర్చే యజమాని
లూకా 22:35; ఫిలిప్పీ 4:19
అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. 12అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు. 13యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు. 14యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తరవాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.
సేవకు ఉండవలసిన ఒకే ఒక ఆమోదయోగ్యమైన ప్రేరణ
2కొరింతీ 5:14; ప్రక 2:4-5
15వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు.
16మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు.
17ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు.
తన సేవకుని మరణ సమయాన్ని, విధానాన్ని యజమాని నిర్ణయించడం
అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు.
20పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు.
21పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. 22దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు. 23దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు.
24ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.