యోవే 2
2
మిడుతల సైన్యం
1సీయోనులో బాకా ఊదండి,
నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి!
యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ
దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక.
2అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు.
కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు.
పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు
బలమైన గొప్ప సేన వస్తూ ఉంది.
అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు.
తరతరాల తరువాత కూడా అది ఉండదు.
3దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది.
వాటి వెనుక, మంట మండుతూ ఉంది.
అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది.
అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది.
దానినుంచి ఏదీ తప్పించుకోలేదు.
4సేన రూపం, గుర్రాల లాగా ఉంది.
వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు.
5వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు.
ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా,
యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు.
6వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు,
అందరి ముఖాలు పాలిపోతున్నాయి.
7అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి.
సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి.
అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి.
8ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి.
ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు.
9పట్టణంలో చొరబడుతున్నాయి.
గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి.
10వాటి ముందు భూమి కంపిస్తున్నది,
ఆకాశాలు వణుకుతున్నాయి.
సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది.
నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి.
11యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు,
ఆయన యోధులు చాలా ఎక్కువమంది.
ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు.
యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది.
దాన్ని ఎవరు వైపుకోగలరు?
పశ్చాతపనికి పిలుపు
12యెహోవా ఇలా అంటున్నాడు,
“ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ
హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”
13మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.
త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.
శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.
కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక
మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.
14ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో.
మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని,
పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?
15సీయోనులో బాకా ఊదండి.
ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి.
16ప్రజలను సమకూర్చండి.
సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి.
పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి.
పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి,
పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.
17యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు
మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి.
“యెహోవా, నీ ప్రజలను కనికరించు.
నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు.
వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు.
వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?”
పశ్చాతాపం ద్వారా విమోచన
18అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు.
తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు.
19యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు,
“నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను.
మీరు వాటితో తృప్తి చెందుతారు.
ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను.
20ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను.
వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను.
దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను.
అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది.
నేను గొప్ప పనులు చేస్తాను.”
21దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి.
యెహోవా గొప్ప పనులు చేశాడు.
22పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది.
చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.
23సీయోను ప్రజలారా, ఆనందించండి.
మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి.
ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు.
ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు.
24కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి.
కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి.
25“ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ,
ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను.
26మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు.
మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి
మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు.
నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
27అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ,
నేనే మీ యెహోవా దేవుడిననీ,
నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు.
నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
దీవుని ఆత్మ ప్రోక్షణకు సంబంధించిన వాగ్దానం
28తరువాత నేను ప్రజలందరి మీద
నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు.
మీ ముసలివారు కలలుకంటారు.
మీ యువకులకు దర్శనాలు వస్తాయి.
29ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
30ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను.
భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.
31యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు
సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.
32యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది.
యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు.
యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోవే 2: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.