లేవీ 10

10
నాదాబు అబీహులు మరణం
1నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూప ద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకు వచ్చారు. 2దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు.
3అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. 4అప్పుడు మోషే అహరోను బాబాయి ఉజ్జీయేలు కొడుకులు మీషాయేలునూ, ఎల్సాఫానునూ పిలిపించి వాళ్ళకిలా చెప్పాడు. “మీరు ఇక్కడికి రండి. ప్రత్యక్ష గుడారం ఎదుట నుండి మీ సోదరులను శిబిరం బయటకు తీసుకుపొండి.”
5వాళ్ళింకా యాజకుల అంగీలు వేసుకునే ఉన్నారు. అలాగే మోషే ఆదేశించినట్టు వాళ్ళు వచ్చి శిబిరం బయటకు వీళ్ళని మోసుకు వెళ్ళారు. 6అప్పుడు మోషే అహరోనుతో అతని కొడుకులైన ఎలియాజరు, ఈతామారులతో “మీరు చావకుండా ఉండాలన్నా, యెహోవా ఈ సమాజం పైన కోపగించుకోకుండా ఉండాలన్నా మీరు మీ తలల పైని జుట్టు విరబోసుకోకూడదు. మీ బట్టలు చింపుకోకూడదు. అయితే యెహోవా వారిని కాల్చివేసినందుకు వారి కోసం మీ సోదరులు, ఇశ్రాయేలు సమాజమంతా ఏడవవచ్చు. 7యెహోవా అభిషేకపు నూనె మీపైన ఉంది. కాబట్టి మీరు మాత్రం ప్రత్యక్ష గుడారం నుండి బయటకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మీరు చనిపోతారు” అని చెప్పాడు. వాళ్ళు మోషే మాట ప్రకారం చేశారు.
8తరువాత యెహోవా అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పాడు. 9“నువ్వూ నీతో ఉండే నీ కొడుకులూ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించే సమయంలో ద్రాక్ష మద్యాన్ని గానీ, ఇంకే మత్తు పానీయాలు గానీ తాగవద్దు. అలా చేస్తే మీరు చనిపోతారు. 10మీ రాబోయే తరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం. ప్రతిష్ట చేసిన దాన్ని లౌకికమైన దాని నుండీ, పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాని నుండీ వేరు చెయ్యాలి. 11యెహోవా మోషే ద్వారా ఆదేశించిన శాసనాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బోధించాలి.”
12అప్పుడు మోషే అహరోనుతోనూ, మిగిలి ఉన్న అతని కొడుకులు ఎలియాజరు ఈతామారులతోనూ మాట్లాడాడు. “యెహోవాకు అర్పించిన దహనబలి నుండి మిగిలిన నైవేద్యాన్ని తీసుకుని పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినండి. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైంది. 13దాన్ని మీరు ఒక పరిశుద్ధ స్థలం లో తినాలి. ఎందుకంటే యెహోవాకు చేసిన దహనబలి అర్పణల్లో అది నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం. మీకు ఈ సంగతి చెప్పాలనే ఆజ్ఞ నేను పొందాను.
14తరువాత కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దేవుడు అంగీకరించిన ఒక పవిత్రమైన స్థలంలో మీరు తినాలి. వీటినీ నువ్వూ, నీ కొడుకులూ, నీ కూతుళ్ళూ తినాలి. ఎందుకంటే అవి ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతిబలుల్లో నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం. 15కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దహనబలిగా అర్పించిన కొవ్వుతో పాటు వాళ్ళు తీసుకురావాలి. వాటిని యెహోవా ఎదుట పైకెత్తి కదిలించే అర్పణగా తీసుకు రావాలి. యెహోవా ఆజ్ఞాపించినట్టు అవి శాశ్వతంగా నీకూ నీ కొడుకులకూ చెందిన భాగం. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం.”
16అప్పుడు మోషే పాపం కోసం బలి కావాల్సిన మేకను గూర్చి అడిగాడు. కానీ అది అప్పటికే దహనమైపోయిందని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు తక్కిన అహరోను కొడుకులు ఎలియాజరు, ఈతామారులపై కోప్పడ్డాడు. 17“మీరు పాపం కోసం బలి అయిన పశువు మాంసాన్ని పవిత్ర స్థలం లో ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం పాపాలను తీసివేయడానికీ, ఆయన ఎదుట పరిహారం చేయడానికీ యెహోవా దాన్ని మీకు ఇచ్చాడు కదా. 18చూడండి, దాని రక్తాన్ని పరిశుద్ధ స్థలం లోకి తీసుకు రాలేదు. నేను ఆజ్ఞాపించినట్టే మీరు దాని మాంసాన్ని పరిశుద్ధ స్థలం లో కచ్చితంగా తినాల్సిందే” అని మందలించాడు.
19అప్పుడు అహరోను మోషేతో “చూడు, ఈ రోజు వీళ్ళు పాపం కోసం తమ బలులూ, దహన బలులూ యెహోవా ఎదుట అర్పించారు. అయినా ఈ రోజే నాకు ఈ విపత్తు జరిగింది. పాపం కోసం చేసిన బలిమాంసం నేను తింటే యెహోవా దృష్టికి అది సరైనదవుతుందా?” అన్నాడు. 20మోషే ఆ మాట విని ఒప్పుకున్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీ 10: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి