16
ప్రాయశ్చిత్త దినం
1అహరోను ఇద్దరు కొడుకులూ యెహోవా సమక్షంలోకి వెళ్ళి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. 2“నువ్వు నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, అతడు పరిహార స్థానమైన నిబంధన మందసం మూత ముందున్న తెరల్లో ఉన్న అతి పవిత్ర స్థలం లోకి అన్ని సమయాల్లో ప్రవేశించకూడదు. అతడు ప్రవేశిస్తే చనిపోతాడు. ఎందుకంటే నేను నిబంధన మందసం మూత పైన మేఘంలో కనిపిస్తాను.
3అతడు పాపం కోసం బలిగా ఒక కోడె దూడనూ, దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకుని పవిత్ర స్థలం లోకి రావాలి. 4అతడు ప్రతిష్ట చేసిన సన్న నార చొక్కాయి వేసుకోవాలి. సన్న నారతో చేసిన లోదుస్తులు ధరించాలి. సన్న నారతో చేసిన నడికట్టు కట్టుకుని, సన్న నారతో చేసిన తలపాగా ధరించాలి. ఇవన్నీ ప్రతిష్ట చేసిన పవిత్ర వస్త్రాలు. కాబట్టి స్నానం చేసి వీటిని ధరించాలి. 5అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపం కోసం బలిగా రెండు మేక పోతులనూ దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకురావాలి.
6తరువాత అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని మొదట తన కోసం అర్పించి తనకూ తన కుటుంబానికీ పరిహారం చేయాలి. 7ఆ తరువాత ఆ రెండు మేకపోతులను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో ఉంచాలి.
8అప్పుడు అహరోను రెండు చీటీలు వేయాలి. ఒకటి యెహోవా కోసం రెండోది విడిచి పెట్టబోయే మేక కోసం వేయాలి. ఆరెండు చీటీలను ఆ రెండు మేకల పైన వేయాలి. 9యెహోవా కోసం రాసిన చీటీ ఏ మేక పైన పడుతుందో ఆ మేకని తెచ్చి పాపం కోసం బలిగా అర్పించాలి. 10ఏ మేకమీద ‘విడిచి పెట్టాలి’ అనే చీటీ పడుతుందో ఆ మేకని యెహోవా సమక్షంలోకి ప్రాణంతో తీసుకుని రావాలి. దాని మూలంగా ప్రజల పాపాలకు పరిహారం కలిగేలా దాన్ని అడవిలో వదిలిపెట్టాలి.
11అప్పుడు అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని తీసుకు వచ్చి తన కోసం, తన కుటుంబం కోసం పరిహారం చేసుకోవాలి. దాని కోసం అహరోను ముందు తన పాపంకోసం బలిగా ఆ కోడె దూడని వధించాలి.
12ఆ తరువాత అహరోను యెహోవా సమక్షంలో ఉన్న ధూపం వేసే పళ్ళెం తీసుకుని దాన్ని బలిపీఠం పైన ఉన్ననిప్పులతో పూర్తిగా నింపి, రెండు గుప్పిళ్ళలో పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెరల లోపలికి తీసుకురావాలి. 13యెహోవా సమక్షంలో నిబంధన ఆజ్ఞల మందసం పైన ఉన్న మూత పైగా ధూమం కమ్ముకునేలా సాంబ్రాణిని నిప్పులపై వేయాలి. అతనికి మరణం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి.
14తరువాత అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత తీసుకుని దాన్ని ఆ మూత పైన తూర్పు వైపున తన వేలితో చిలకరించాలి. కొంత రక్తం తీసుకుని తన వేలితో ఆ మూత పైన ఏడు సార్లు చిలకరించాలి.
15అప్పుడు ప్రజలర్పించే పాపం కోసం బలిగా మేకని వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకు రావాలి. కోడె దూడ రక్తంతో చేసినట్టే మేక రక్తంతోనూ చేయాలి. దాని రక్తాన్ని మందసం మూత ఎదుటా దాని పైనా చిలకరించాలి. 16ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరి అశుద్ధమైన పనులను బట్టీ, వారి తిరుగుబాటును బట్టీ, వారందరి పాపాలన్నిటిని బట్టీ పరిశుద్ధ స్థలానికి పరిహారం చేయాలి. వారి అశుద్ధమైన పనుల మధ్యలో ప్రత్యక్ష గుడారంలో యెహోవా వారి మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారం కోసం కూడా పరిహారం చేయాలి.
17అతి పవిత్ర స్థలం లో పరిహారం చేయడానికి అహరోను ప్రవేశించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. అతడు తన కోసం, తన కుటుంబం కోసం, ఇంకా ప్రజలందరి కోసం పరిహారం చేయడం ముగించి బయటకి వచ్చేంత వరకూ ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. 18తరువాత అతడు బయట యెహోవా సమక్షంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి దానికోసం పరిహారం చేయాలి. అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత, మేక రక్తంలో కొంత తీసుకుని బలిపీఠం కొమ్ములకు పూయాలి. 19ఆ రక్తాన్ని ఏడు సార్లు తన వేలితో బలిపీఠంపై చిలకరించాలి. అలా దాన్ని పవిత్ర పరచి ఇశ్రాయేలు ప్రజలు చేసే అశుద్ధ పనుల నుండి దాన్ని శుద్ధీకరించాలి.
20అతడు అతి పవిత్ర స్థలానికీ, ప్రత్యక్ష గుడారానికీ, బలిపీఠంకీ పరిహారం చేసి ముగించిన తరువాత బతికి ఉన్న మేకని తీసుకు రావాలి. 21అప్పుడు అహరోను బతికి ఉన్న ఆ మేక తలపైన తన రెండు చేతులూ ఉంచి ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గాలన్నటినీ, వారి తిరుగుబాటు అంతటినీ, వారి పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఆ పాపాన్నంతా ఆ మేక పైన మోపి దాన్ని అడవిలోకి తోలుకుని వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తితో పంపించి వేయాలి. 22ఆ మేక ప్రజల దుర్మార్గాలన్నిటినీ తన పై వేసుకుని ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళాలి. ఆ వ్యక్తి దాన్ని అడవిలోకి తీసుకు వెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలి.
23తరువాత అహరోను ప్రత్యక్ష గుడారంలోకి తిరిగి వచ్చి అతి పవిత్ర స్థలం లోకి వెళ్లే ముందు తాను ధరించిన నార వస్త్రాలను తీసి వాటిని అక్కడే ఉంచాలి. 24అతడు పవిత్ర స్థలం లో స్నానం చేసి తిరిగి తన సాధారణ బట్టలు వేసుకుని బయటకు రావాలి. అప్పుడు తన కొరకూ, ప్రజల కొరకూ దహనబలులు అర్పించి తన కోసం, ప్రజల కోసం పరిహారం చేయాలి.
25పాపం కోసం చేసే బలి పశువు కొవ్వుని బలిపీఠం పైన దహించాలి. 26విడిచిపెట్టే మేకని వదిలి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. ఆ తరువాత అతడు శిబిరంలోకి రావచ్చు.
27పవిత్ర స్థలం లో పాపాల కోసం బలి చేసిన ఏ కోడె దూడ రక్తం, ఏ మేక రక్తం అతి పవిత్ర స్థలం లోకి తెచ్చారో ఆ కోడె దూడ, మేకల కళేబరాలను ఒకవ్యక్తి శిబిరం బయటకు తీసుకువెళ్ళాలి. అక్కడ వాటి చర్మాలనూ, మాంసాన్నీ, పేడనూ మంట పెట్టి కాల్చి వేయాలి. 28వాటిని కాల్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి తిరిగి శిబిరంలోకి రావచ్చు.
29మీరు ఏడో నెల పదో రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు ఎలాంటి పనీ చేయకూడదు. స్థానిక ప్రజలకీ, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకీ ఇది వర్తిస్తుంది. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం. 30ఎందుకంటే ఆ రోజు యెహోవా సమక్షంలో మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికై మీ పాపాలకు శుద్ధీకరణ చేసేందుకు మీ కోసం పరిహారం జరిగింది. 31అది మీకు మహా విశ్రాంతి దినం. ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి. ఎలాంటి పనీ చేయకూడదు. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం.
32తన తండ్రి స్థానంలో ప్రతిష్ఠి జరిగి యాజకుడిగా అభిషేకం పొందిన వ్యక్తి పరిహారం చేసుకుని ప్రతిష్ఠి చేసిన నార బట్టలు వేసుకోవాలి. 33అతడు అతి పవిత్ర స్థలానికి పరిహారం చేయాలి. ప్రత్యక్ష గుడారానికీ, బలిపీఠంకీ పరిహారం చేయాలి. యాజకుల కొరకూ, సమాజంలోని ప్రజలందరి కొరకూ పరిహారం చేయాలి.
34ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నిటి కోసం సంవత్సరానికి ఒకసారి పరిహారం చేయాలి. ఇది మీకు శాశ్వతమైన శాసనం.” యెహోవా ఆదేశించిన ప్రకారం మోషే చేసాడు.