లూకా 17:1-10

లూకా 17:1-10 IRVTEL

ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో! అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు. మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి. అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.” అప్పుడు అపొస్తలులు, “ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు. ప్రభువు, “మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో’ అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది. “మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని ‘నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో’ అంటాడా? అనడు. పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు. తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా? అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.”