లూకా 22
22
యేసును పట్టివ్వడానికి యూదా లాలూచీ
మత్తయి 26:2, 4; మార్కు 14:1, 2, 10, 11
1పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది. 2ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు.
3అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. 4దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు. 5దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు. 6అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.
పస్కా ఏర్పాట్లు
మత్తయి 26:17-19; మార్కు 14:12-16
7పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది. 8యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు. 9వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు. 10ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి. 11మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి. 12అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు. 13సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు.
చివరి పస్కా
మత్తయి 26:20; మార్కు 14:17; యోహా 13
14సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు. 15అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను. 16ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.” 17తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి. 18ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
ప్రభు రాత్రి భోజన సంస్కారం స్థాపన
మత్తయి 26:26-29; మార్కు 14:22-25
19ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు. 20అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన.
యేసు తనకు జరగనైయున్న ద్రోహం గురించి వెల్లడించడం
మత్తయి 26:21-25; మార్కు 14:18-21; యోహా 13:18-30
21 “వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు. 22దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు, 23ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు.
తమలో ఎవరు గొప్పవారని శిష్యుల మధ్య వాదం
మత్తయి 20:25, 28; మార్కు 10:42-45
24తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. 25అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. 26మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. 27అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.
రానున్న రాజ్యంలో అపొస్తలుల స్థానం
మత్తయి 19:28; ప్రక 3:21
28 “నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు. 29నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి, 30సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.
పేతురు చెప్పనున్న అబద్ధం
మత్తయి 26:33-35; మార్కు 14:29-31
31 “సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. 32నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.” 33కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు. 34అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.
వాటిల్లబోయే గడ్డు పరిస్థితి గురించి శిష్యులకు హెచ్చరికలు
35ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు. 36ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
37 ‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. 38శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు.
గేత్సెమనే వనంలో యేసు
మత్తయి 26:36-46; మార్కు 14:32, 42; యోహా 18:1
39భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు. 40వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు. 41వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు. 42“తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.” 43అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.
44ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది. 45ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు. 46వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు.
యూదా ద్రోహం
మత్తయి 26:47-56; మార్కు 14:43-50; యోహా 18:3-11
47ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు. 48అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు. 49ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు. 50ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు. 51దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు.
52తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో, “ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా? 53నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు.
యేసును బంధించడం. పేతురు అబద్ధం
మత్తయి 26:57, 69-75; మార్కు 14:53, 54, 66-72; యోహా 18:12, 15-18, 25-27
54వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు. 55అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి వారితో కూర్చున్నాడు.
56అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి, “ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే” అంది. 57దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు. 58కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు. 59మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి, “ఇతడు కచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయ వాడే” అని నొక్కి చెప్పాడు. 60అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది. 61అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. 62దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.
యేసును కొట్టడం
మత్తయి 26:67, 68; మార్కు 14:65; యోహా 18:22, 23
63యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు. 64ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు. 65ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు.
సన్ హెడ్రిన్ సభ ఎదుట యేసు
మత్తయి 26:59-68; మార్కు 14:55-65; యోహా 18:19-24
66ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు. 67“నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు. 68అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు. 69అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు. 70“అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు. 71అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లూకా 22: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.