లూకా 6:27-36

లూకా 6:27-36 IRVTEL

“వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి. నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు. మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా. మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా! మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా. మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.