మత్తయి 18:21-35

మత్తయి 18:21-35 IRVTEL

అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను. కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది. అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు. అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు. “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు. మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.