మత్తయి 24
24
ఒలీవ కొండ ప్రసంగం. దేవాలయం విధ్వంసం గురించి
మార్కు 13:1-2; లూకా 21:5-6
1యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు. 2అందుకాయన, “మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు” అని వారితో అన్నాడు.
శిష్యుల మూడు ప్రశ్నలు
మార్కు 13:3-4; లూకా 21:7
3ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు.
ఈ యుగం పరిణామాలు
మార్కు 13:5, 13; లూకా 21:8-19
4యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. 5చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు. 6అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు. 7జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి. 8ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.
9 “అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు. 10ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు. 11అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు. 12అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. 13కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది. 14రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.
మహా బాధల కాలం
మార్కు 13:14-23
15 “కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక), 16యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. 17మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు. 18పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.
19 అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం. 20అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి. 21ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు. 22ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు.
23 “ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు. 24కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు. 25ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను. 26కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు.
మహిమ సహితంగా రాజు రాక
మార్కు 13:24-37; లూకా 21:25-36
27 “మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది. 28శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.
29 “ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి. 30అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు. 31ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.
అంజూరు చెట్టు ఉపమానం
మార్కు 13:28-29; లూకా 21:29-31
32 “అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు. 33అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 34ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 35ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
36 “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు. 37నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది. 38జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు. 39జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది.
40 ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు. 41ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది. 42ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. 43దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా! 44మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.
45 “ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు? 46యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు. 47ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 48కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని 49తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, 50అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. 51వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
మత్తయి 24: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.