మార్కు 2:1-12

మార్కు 2:1-12 IRVTEL

కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు. నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు. యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, “అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?” వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక? ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా? భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు. వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.