నెహెమ్యా 13

13
నెహెమ్యా సంస్కరణలు
1ఆ రోజు వాళ్ళు మోషే గ్రంథం ప్రజలకు చదివి వినిపించారు. ఆ గ్రంథంలో “అమ్మోనీయులు గానీ, మోయాబీయులు గానీ దేవుని సమాజంలో ఎప్పటికీ ప్రవేశించకూడదు. 2ఎందుకంటే వాళ్ళు భోజనాలు, పానీయాలు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురు రాలేదు. పైగా వారిని శపించమని బిలాము ప్రవక్తకు లంచమిచ్చి పంపించారు. అయినప్పటికీ మన దేవుడు ఆ శాపాన్ని దీవెనగా మార్చాడు” అని రాసి ఉన్న విషయం చదివారు. 3దీన్ని విన్న ఇశ్రాయేలు ప్రజలు ఇతర దేశాల, జాతుల ప్రజలను తమలో నుండి వెలివేశారు.
4ఇంతకుముందు మన దేవుని మందిరానికి చెందిన గిడ్డంగిపై అధికారిగా ఉన్న యాజకుడు ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వం కలుపుకున్నాడు. 5నైవేద్యాలను, ధూప ద్రవ్యాలను, పాత్రలను, లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు కేటాయించిన ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో యాజకులకు ఇవ్వవలసిన ప్రతిష్ఠిత వస్తువులను ఉంచే గది పక్కన టోబీయాకు ఒక పెద్ద గదిని సిద్ధం చేశాడు.
6ఆ సమయంలో నేను యెరూషలేంలో లేను. ఎందుకంటే, బబులోను దేశపు రాజు అర్తహషస్త పాలన 32 వ సంవత్సరంలో రాజును దర్శించి, కొన్ని రోజులైన తరువాత రాజు దగ్గర అనుమతి తీసుకుని యెరూషలేంకు తిరిగి వచ్చాను. 7యెరూషలేంకు వచ్చాక ఎల్యాషీబు దేవుని మందిర ఆవరణలో టోబీయాకు ఒక గది ఏర్పాటు చేయడం మూలంగా తెచ్చిన కీడు గురించి తెలుసుకున్నాను. 8నాకు చాలా కోపం వచ్చింది. ఆ గదిలో నుండి టోబీయా సామాన్లు అన్నీ అవతల పారవేసి, గదులన్నీ శుభ్రం చేయమని ఆజ్ఞాపించాను. వాళ్ళు అలానే చేశారు.
9తరవాత మందిరంలో ఉండే పాత్రలు, నైవేద్యం అర్పించే వస్తువులు, సాంబ్రాణిలను మళ్ళీ అక్కడకి తెప్పించాను. 10లేవీయులకు అందాల్సిన వంతులు వాళ్లకు అందకపోవడం వలన ఆలయంలో పరిచర్య చేసే లేవీయులు, గాయకులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని తెలుసుకున్నాను. 11దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసినందుకు అధిపతులను గద్దించి, లేవీయులు, గాయకులను తిరిగి రప్పించి వారి స్థలాల్లో ఉంచే ఏర్పాటు చేశాను.
12ఆ తరువాత యూదులంతా ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో పదవ వంతు ఖజానాలో జమ చేశారు. 13నమ్మకస్తులైనవారు అని పేరుగాంచిన యాజకుడు షెలెమ్యా, శాస్త్రి అయిన సాదోకు, లేవీయుడైన పెదాయాలను ఖజానాపై పర్యవేక్షకులుగా నియమించాను. వాళ్లకు సహాయకుడుగా మత్తన్యా మనవడు, జక్కూరు కొడుకు హానాను నియమితుడయ్యాడు. తమ సహోదరులకు ఆహార పదార్థాలు పంచిపెట్టే పని వారికి అప్పగించాను. 14నా దేవా, దీన్నిబట్టి నన్ను జ్ఞాపకముంచుకో. నా దేవుని ఆలయం కోసం, దాని క్రమాల అమలు కోసం నేను చేసిన పనులు మరచిపోవద్దు.
15ఆ రోజుల్లో కొందరు యూదులు విశ్రాంతి దినాన ద్రాక్ష గెలలను తొట్లలో వేసి తొక్కడం, ధాన్యపు గింజల మూటలు గాడిదలమీద మోపడం చూశాను. ద్రాక్షారసం, ద్రాక్షపళ్ళు, అంజూరపు పళ్ళు, ఇంకా రకరకాల బరువులు విశ్రాంతి దినాన యెరూషలేంలోకి తీసుకు రావడం చూసి, ఆ ఆహార పదార్థాలను ఆ రోజు అమ్మిన వాళ్ళను గద్దించాను. 16యెరూషలేంలో ఉంటున్న తూరు దేశస్థులు విశ్రాంతిదినాన చేపలు మొదలైన రకరకాల వస్తువులు తెచ్చి యూదులకు అమ్ముతున్నారు. 17నేను యూదుల ప్రముఖులను మందలించి వారితో “విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి ఇలాంటి చెడ్డ పనులు ఎందుకు చేస్తున్నారు? 18మీ పూర్వికులు ఇలాగే చేసి మన మీదికి, మన పట్టణాల మీదికి దేవుని నుండి కీడు కలిగేలా చేశారు కదా. మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి ఇశ్రాయేలీయుల మీదికి దేవుని కోపం మరింతగా రప్పిస్తున్నారు” అని చెప్పాను.
19విశ్రాంతి దినానికి ముందు రోజు చీకటి పడినప్పుడు యెరూషలేం ద్వారాలు మూసి ఉంచాలనీ, విశ్రాంతి దినం ముగిసేదాకా తలుపులు తియ్యకూడదనీ ఆజ్ఞాపించాను. విశ్రాంతి దినాన ఎలాంటి బరువులు లోపలికి రాకుండేలా తలుపుల దగ్గర నా పనివాళ్ళలో కొందరిని కాపలా ఉంచాను. 20వర్తకులు, రకరకాల వస్తువులు అమ్మేవారు ఒకటి రెండుసార్లు యెరూషలేం ప్రాకారం బయట బస చేశారు. 21నేను వారిని గద్దించి వారితో ఇలా అన్నాను “మీరు గోడల పక్కన ఎందుకు మకాం చేస్తున్నారు? మరోసారి ఈ విధంగా చేస్తే మిమ్మల్ని పట్టుకుంటాను” అని హెచ్చరించాను. మరి ఇక ఎన్నడూ వాళ్ళు విశ్రాంతి దినాన రాలేదు.
22అప్పుడు తమను తాము శుద్ధి చేసుకుని, విశ్రాంతి దినం ఆచరించడానికి ద్వారాల దగ్గర నిలబడి ఎదురు చూడాలని లేవీయులకు ఆజ్ఞాపించాను. నా దేవా, ఈ విషయాలను బట్టి నన్ను జ్ఞాపకముంచుకుని నీ కనికరం చొప్పున నన్ను రక్షించు. 23ఆ రోజుల్లో కొందరు యూదులు అష్డోదు, అమ్మోను, మోయాబు పట్టణాల స్త్రీలను పెళ్లి చేసుకున్నట్టు నాకు తెలిసింది. 24వారి కొడుకుల్లో సగం మంది అష్డోదు భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు రకరకాల అన్య భాషలు మాట్లాడుతున్నారు, వారిలో ఎవరికీ యూదుల భాష రాదు.
25అప్పుడు నేను వాళ్ళతో వాదించి, వాళ్ళను తిట్టాను. కొందరిని కొట్టాను. వాళ్ళ తలవెండ్రుకలు పెరికివేయించాను. “మీరు వాళ్ళ కొడుకులకి మీ కూతుళ్ళను, మీకైనా, మీ కొడుకులకైనా వాళ్ళ కూతుళ్ళను ఇచ్చి పుచ్చుకోకుండా ఉండాలి” అని వాళ్ళ చేత దేవుని పేరట ప్రమాణం చేయించాను. 26వాళ్ళతో ఇంకా ఇలా చెప్పాను. “ఇలాంటి పనులు చేసి ఇశ్రాయేలీయుల రాజు సొలొమోను పాపం చేసాడు కదా. లోక ప్రజల్లో అతని వంటి రాజు మరొకడు లేకపోయినా, అతడు తన దేవుని ప్రేమను చూరగొన్నాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులందరిపై రాజుగా నియమించాడు. అయినప్పటికీ అన్య స్త్రీలు అతతో కూడా పాపం చేయించారు కదా. 27ఇంత గొప్ప కీడు కలిగేలా, మన దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేలా విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకొన్న మీలాంటి వాళ్ళ మాటలు మేము వినాలా?”
28ప్రధాన యాజకుడు ఎల్యాషీబు కొడుకు యోయాదా కొడుకుల్లో ఒకడు హోరోను గ్రామవాసి సన్బల్లటు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. దీన్ని బట్టి నేను అతణ్ణి నా దగ్గర నుండి వెళ్ళగొట్టాను. 29నా దేవా, వాళ్ళు యాజక వృత్తిని, యాజకుల, లేవీయుల ఒప్పందాన్ని అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళను జ్ఞాపకముంచుకో. 30ఇకపై వాళ్ళు ఈ విధంగా పరాయి జాతి ప్రజలతో కలసిపోకుండా వాళ్ళను శుద్ధి చేసి, ప్రతి యాజకుడూ, లేవీయుడూ తమ ధర్మం ప్రకారం సేవ జరిగించేలా నిర్ణయించాను. 31ఇంకా, అర్పణల కోసం నియమిత సమయాల్లో కట్టెలు వచ్చేలా, ప్రజలు క్రమంగా ప్రథమ ఫలాలు తెచ్చేలా ఏర్పాటు చేశాను. నా దేవా, మంచి జరిగేలా నన్ను జ్ఞాపకం చేసుకో.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నెహెమ్యా 13: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి