119
ఆలెఫ్
1ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.
2ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు.
3వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు.
4మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు.
5ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది!
6నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు.
7నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
8నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు.
బేత్
9యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?
10నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.
11నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.
12యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు.
13నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.
14సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను.
15నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.
16నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను.
గీమెల్
17నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను.
18నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.
19నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు.
20అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది.
21గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు.
22నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు.
23పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు.
24నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు.
దాలెత్
25నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు.
26నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు.
27నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను.
28విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు.
29మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.
30విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.
31యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు.
32నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను.
హే
33యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను.
34నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.
35నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం.
36నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి.
37పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి.
38నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు.
39నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి.
40నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు.
వావ్
41యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు.
42అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను.
43నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను.
44ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను.
45నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.
46సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను.
47నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం.
48నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను.
జాయిన్.
49నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు.
50నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది.
51గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు.
52యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను.
53నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది.
54యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు.
55యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను.
56నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు.
హేత్
57యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను.
58కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు.
59నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను.
60నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను.
61భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు.
62న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను.
63నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని.
తేత్
64యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు.
65యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు.
66నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.
67బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను.
68నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు.
69గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
70వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది#119:70 వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది వారి హృదయంలో సత్యం లేదు. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను.
71బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.
72వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.
యోద్
73నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి.
74నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు.
75యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు.
76నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక.
77నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక.
78నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక.
79నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక.
80నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక.
కఫ్
81నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను.
82నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి.
83నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.
84నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు?
85నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
86నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి.
87భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు.
88నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు.
లామెద్.
89యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
90నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
91అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి.
92నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి.
93నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు.
94నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు.
95నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.
96సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు.
మేమ్
97నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.
98నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.
99నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.
100నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది.
101నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను.
102నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను.
103నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.
104నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి.
నూన్
105నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.
106నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.
107యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు.
108యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు
109నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను.
110నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు.
111నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను.
112నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం.
సామెహ్
113రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
114నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను.
115నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి.
116నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక.
117నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను.
118నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.
119భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం.
120నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను.
అయిన్
121నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు.
122మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక.
123నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి.
124నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
125నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి
126ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.
127బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి.
128నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం.
పే
129నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను.
130నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి.
131నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను.
132నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు.
133నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు.
134నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు.
135నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
136ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను.
సాదె
137యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం.
138నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు.
139నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది.
140నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది.
141నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను.
142నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.
143బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
144నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి.
ఖొఫ్
145యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు.
146నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు.
147తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను
148నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.
149నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు.
150దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు.
151యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి.
152నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను.
రేష్
153నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు.
154నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు.
155భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.
156యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు.
157నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను.
158ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
159యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు.
160నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి.
షీన్
161అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది.
162పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.
163అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
164నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.
165నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు
166యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను.
167నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం.
168నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను.
తౌ
169యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి.
170నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు.
171నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి.
172నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది.
173నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగు గాక.
174యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం.
175నీవు నన్ను బ్రతికించు. నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయాలగు గాక
176తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తప్పి తిరిగాను. నీ సేవకుణ్ణి వెతికి పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను విస్మరించేవాణ్ణి కాను.