రోమా పత్రిక 3

3
యూదులకున్న లాభం వారికి మరింత శిక్షకే దారి తీసింది
1అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? 2ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి. 3కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? 4కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే. 5మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను. 6అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు?
7నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు? 8మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే.
ఫలితార్థం-లోకమంతా దేవుని ఎదుట దోషిగా నిలిచింది
9అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా. 10దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే,
“నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.
11గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.
12అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు.
మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.
13వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది.
వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు.
వారి పెదవుల కింద పాము విషం ఉంది.
14వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.
15రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి.
16వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి.
17వారికి శాంతిమార్గం తెలియదు.
18వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.”
19ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు. 20ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.
రెండవ భాగం-కేవలం సిలువ వేయబడిన క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే మనిషిని నిర్దోషిగా తీర్చడం ఒక్కటే పాపనివారణ మార్గం. నిర్దోషిగా తీర్చడం, నిర్వచనం
21ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.
27కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే. 28కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.
నిర్దోషిగా తీర్చడం అనేది సార్వత్రిక పాప నివారణ మార్గం
29దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే. 30దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు.
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం అనేది ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తుంది
31విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

రోమా పత్రిక 3: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి