పరమ 2

2
షారోను పుష్పం
1(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
నేను కేవలం మైదానంలోని పువ్వును.
కేవలం లోయలోని లిల్లీ పువ్వును.
2(ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)
ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.
3(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు.
ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను.
అతని పండు ఎంతో రుచిగా ఉంది.
4అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు.
అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది.
5(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను.
ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి.
6(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది.
కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు.
7(ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)
యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి.
మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
8[రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు.
పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.
9నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు.
చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు.
కిటికీలోనుంచి చూస్తున్నాడు.
అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.
10నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు,
“ప్రియా, లే.
సుందరీ, నాతో వచ్చెయ్యి.
11చలికాలం పోయింది.
వానలు పడి వెళ్ళిపోయాయి.
12దేశమంతా పూలు పూశాయి.
కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది.
కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.
13అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి.
ద్రాక్షచెట్లు పూతపట్టాయి.
అవి సువాసన ఇస్తున్నాయి.
ప్రియా, లే.
సుందరీ, నాతో వచ్చెయ్యి.
14బండసందుల్లోని నా పావురమా,
కొండ మరుగు చరియల్లోని పావురమా,
నీ ముఖం నన్ను చూడ నివ్వు.
నీ స్వరం వినిపించు.
నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”
15(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి.
తోడేళ్ళను పట్టుకో.
ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.
16(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
నా ప్రియుడు నా వాడు.
నేను అతని దాన్ని.
లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
17(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
ప్రియా, వెళ్ళిపో.
ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో.
కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

పరమ 2: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి