యోహాను వ్రాసిన మొదటి లేఖ 4:7-16

యోహాను వ్రాసిన మొదటి లేఖ 4:7-16 TERV

ప్రియ మిత్రులారా! ప్రేమ దేవునినుండి వస్తుంది. కనుక మనం పరస్పరం ప్రేమతో ఉందాం. ప్రేమించే వ్యక్తి దేవుని వలన జన్మిస్తాడు. అతనికి దేవుడు తెలుసు. దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమలేనివానికి దేవుడెవరో తెలియదు. మనం కుమారునిద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనకు వెల్లడి చేసాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఈ పని చెయ్యలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మన ప్రాయశ్చిత్తానికి బలిగా తన కుమారుణ్ణి పంపాడు. ఇదే ప్రేమ. ప్రియ మిత్రులారా! దేవుడు మనల్ని యింతగా ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం ప్రేమతో ఉండాలి. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. మనం పరస్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత చెందుతుంది. ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా మనము ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము. దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని రక్షించటానికి పంపాడు. ఆయన్ని మేము చూసాము, కాబట్టి సాక్ష్యం చెపుతున్నాము. యేసు దేవుని కుమారుడని అంగీకరించినవానిలో దేవుడు నివసిస్తాడు. దేవునిలో వాడు నివసిస్తున్నాడు. దేవునికి మనపట్ల ప్రేమ ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమ మనకు తెలుసు. దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు. దేవుడు అతనిలో జీవిస్తాడు.