1 రాజులు 3:1-28

1 రాజులు 3:1-28 TERV

సొలొమోను ఈజిప్టు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి తీసుకొనివచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన భవనాన్ని, దేవాలయాన్ని నిర్మింపచేస్తూనేవున్నాడు. సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడకూడా నిర్మిస్తున్నాడు. దేవాలయం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలులను గుట్టలపై వున్న బలిపీఠాల వద్దనే అర్పిస్తూండేవారు. యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని సొలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చెప్పనిది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించటం, ధూపం వేయటం, కొనసాగించాడు. సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు. సొలొమోను గిబియోను వద్ద వున్నప్పుడు యెహోవా అతనికి స్వప్నంలో దర్శన మిచ్చాడు. “నీవేదైనా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను” అని యెహోవా అన్నాడు. సొలొమోను ఇలా అన్నాడు: “నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. అతను నిన్ననుసరించాడు. అతను కూడా మంచివాడై, ధర్మంగా జీవించాడు. నీవతని కుమారుని రాజ్యా సింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు, నీవు అతనికి అపూర్వమైన కరుణ చూపావు. నా ప్రభువైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పసివానిలా వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చటానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది. నీ సేవకుడనైన నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్కపెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది. అందువల్ల ఈ ప్రజానీకంపై ధర్మపరిపాలన చేయగల న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానము లేకుండ, ఈ గొప్ప ప్రజానీకాన్ని పరిపాలించటం అసాధ్యమైన పని.” సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు. అతనితో దేవుడిలా అన్నాడు: “నీవు నీకు దీర్ఘాయుష్షు యిమ్మని అడుగలేదు. నీవు నీ కొరకై ధనదాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రునాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచక్షణా జ్ఞానం, న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు. కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి వాడెవ్వడూ లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు. పైగా, నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడ నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు. నాకు విధేయుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. నీ తండ్రి దావీదువలె నీవు కూడ నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడ నేనిస్తాను.” సొలొమోను మేల్కొన్నాడు. దేవుడు అతనితో కలలో మాట్లాడినట్లు తెలుసుకొన్నాడు. సొలొమోను తరువాత యెరూషలేముకు వెళ్లి యెహోవా ఒడంబడిక పెట్టె ముందు నిల్చున్నాడు. సొలొమోను యెహోవాకు ఒక దహనబలి ఇచ్చాడు. అతనింకా సమాధాన బలులు కూడా దేవునికి చెల్లించాడు. తరువాత అతని పరిపాలనలో అతనికి చేదోడు వాదోడుగావున్న నాయకులకు, అధికారులందరికీ విందు ఇచ్చాడు. ఒక రోజు ఇద్దరు వేశ్యా స్త్రీలు సొలొమోను వద్దకు వచ్చారు. వారు రాజు ముందు నిలబడ్డారు. ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది, “అయ్యా, ఈమె, నేను ఒకే ఇంట్లో నివసిస్తూ వుంటాము. మేమిద్దరం గర్భవతుల మైనాము. కాన్పు నెలలు వచ్చాయి. నేనొక బిడ్డను ప్రసవించాను. అప్పుడు ఈమె నా పక్కనేవుంది. మూడు రోజుల తరువాత ఈమె కూడ ఒక బిడ్డను కన్నది. మా ఇద్దరితో పాటు ఇంటిలో మరెవ్వరూ లేరు. కేవలం మేమిద్దరమే వుంటున్నాము. ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, ఆ బిడ్డ చనిపోయింది. అప్పుడు ఆమె ఆ రాత్రి సమయంలో నేను నిద్రిస్తూండగా నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొన్నది. నా బిడ్డను ఆమె తన పక్కలో వేసుకొన్నది. చనిపోయిన బిడ్డను నా పక్కమీద వుంచింది. మరునాటి ఉదయం నేను లేచి నా బిడ్డకు పాలివ్వబోయాను. కాని బిడ్డ చనిపోయినట్లు గమనించాను. నేను బిడ్డకేసి తేరిపార చూడగా ఆ బిడ్డ నా బిడ్డ కాదని కనుగొన్నాను.” కాని ఆ రెండవ స్త్రీ, “కాదు! బ్రతికివున్న బిడ్డే నా బిడ్డ, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ” అని అన్నది. అందుకు మొదటి స్త్రీ ఇలా అన్నది, “కాదు! నీవు పొరాపాటు పడుతున్నావు! చనిపోయిన బిడ్డే నీది. బ్రతికివున్న బిడ్డ నాది!” ఇలా ఆ యిద్దరు స్త్రీలు రాజు ముందు వాదోపవాదాలు చేసుకొన్నారు. ఇదంతా విన్న సొలొమోను, “మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరూ బతికివున్న బిడ్డ ‘నాదే’ అంటున్నారు. మీలో ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డ ఎదుటి వ్యక్తిదని అంటున్నారు” అని అన్నాడు. అప్పుడు సొలొమోను రాజు తన సేవకుడిని పంపి ఒక కత్తి తెప్పించాడు. సొలొమోను రాజు ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం ఈ రకంగా చేద్దాం. బ్రతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఆ ఇద్దరు స్త్రీలకు చెరియొక ముక్క ఇద్దాం!” ఇది విన్న ఆ రెండవ స్త్రీ, “ఈ పని చాలా బాగుంటుంది. బిడ్డను రెండు ముక్కలు చేయండి, అప్పుడు మా ఇద్దరిలో ఎవ్వరికీ ఆ బిడ్డ రాకుండా పోతుంది” అని అన్నది. కాని బిడ్డయొక్క నిజమైన తల్లియగు మొదటి స్త్రీ తన బిడ్డపట్ల నిండైన ప్రేమతో రాజుతో, “అయ్యా, దయచేసి బిడ్డను చంపవద్దు! బిడ్డను ఆమెకే ఇవ్వండి,” అని అన్నది. సొలొమోను రాజు అప్పుడిలా అన్నాడు, “బిడ్డను చంపకండి! బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి, అసలైన తల్లి ఆమెయే!” ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను రాజు తీర్పును విన్నారు. ఆయన చాలా తెలివైనవాడు కావున అతనిని ప్రజలు చాలా గౌరవించారు. న్యాయ నిర్ణయం చేయుటలో ఆయనకు దేవుడిచ్చిన వివేకం ఉన్నట్లు వారు గమనించారు.

Read 1 రాజులు 3