2 దినవృత్తాంతములు 26

26
యూదా రాజుగా ఉజ్జియా
1తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. 2ఎలతు పట్టణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు యిచ్చాడు. అమజ్యా చనిపోయి, తన పూర్వీకులతో సమాధి చేయబడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు.
3తాను రాజయ్యేనాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబై రెండు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. యెకొల్యా యెరూషలేముకు చెందిన స్త్రీ. 4యెహోవా అతని నుండి ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్యకలాపాలు కొనసాగించాడు. తన తండ్రి అమజ్యావలెనే ఉజ్జియా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు. 5జెకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని సేవకుడయ్యాడు. ప్రభువైన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగి వుండాలో జెకర్యా ఉజ్జియాకు నేర్పాడు. ఉజ్జియా యెహోవాకు విధేయుడై వున్నంతకాలం, ఆయన అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.
6ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణాల చుట్టూ వున్న ప్రాకారాలను అతడు పడగొట్టాడు. అష్టోదు పట్టణానికి దగ్గరగాను, మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాలలోను ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు. 7ఫిలిష్తీయులతోను, గూర్బయలులో నివసిస్తున్న అరబీయులతోను, మెహోనీయులతోను ఉజ్జియా జరిపిన యుద్ధాలలో యెహోవా అతనికి విజయం చేకూర్చాడు. 8అమ్మోనీయులు ఉజ్జియాకు కప్పం చెల్లించారు. ఈజిప్టు సరిహద్దులవరకు ఉజ్జియా పేరు ప్రతిష్ఠలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కలవాడగుటచే ఉజ్జియా ప్రసిద్ధిగల వ్యక్తి అయ్యాడు.
9యెరూషలేములో మూలద్వారాం వద్ద, లోయ ద్వారం వద్ద, మరియు గోడమలుపు వద్ద ఉజ్జియా బురుజులు కట్టించి బాగా బలపర్చాడు. 10ఎడారిలో సహితం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు చాలా బావుల కూడా తవ్వించాడు. కొండల (మన్యం) ప్రాంతంలోను, మైదాన ప్రాంతాలలోను అతనికి పశుసంపద విస్తారంగా వుంది. పంట సాగుకు అనువైన కొండలయందు, మైదానములందు ఉజ్జియాకు వ్యవసాయదారులున్నారు. ద్రాక్షతోటల పెంపకంలో శ్రద్ధవహించే రైతులు కూడ అతనికి వున్నారు. అతడు వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు.
11ఉజ్జియాకు మంచి శిక్షణ పొందిన సైన్యం ఉంది. కార్యదర్శి యెహీయేలు, మరో అధికారి మయశేయా అనేవారు సైన్యాన్ని, వివిధ భాగాలుగా విభజించారు. వారి పైఅధికారి హనన్యా. యెహీయేలు, మయశేయా సైనికులందరినీ లెక్కించి వారిని పటాలాలుగా విభజించారు. హనన్యా రాజాధికారులలో ఒకడు. 12సైనికులపై అధికారులే రెండువేల ఆరువందల మంది ఉన్నారు. 13వంశాలవారీ ఎంపికైన సైన్యాధికారుల క్రింద మొత్తం మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది యుద్ధంలో కాకలు తీరిన సైనికులున్నారు. ఆ సైనికులు శత్రువుల నుండి రక్షణ పొందటానికి రాజుకు సహాయపడతారు. 14ఉజ్జియా సైన్యానికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు కవచాలు విల్లంబులు, ఒడిసెల రాళ్లు సరఫరా చేశాడు. 15మేధావులు తమ కల్పనా శక్తితో రూపొందించిన యంత్రాలను ఉజ్జియా యెరూషలేములో తయారుచేయించాడు. ఆ యంత్రాలను బురుజుల మీద, గోడలు కలిసిన మూలల మీద ఉంచాడు. ఈ యంత్రాలు బాణాలు వదలటం, బండరాళ్లు విసిరి వేయటం మొదలైన పనులు చేసేవి. ఉజ్జియా చాలా ప్రఖ్యాతి గాంచాడు. దూర ప్రదేశాలలో కూడ ప్రజలు అతని పేరు విన్నారు. అతనికి ఎడతెగని సహాయం అందటంతో అతను చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.
16ఉజ్జియా గొప్పవాడు కావటంతో పాటు, గర్విష్ఠి కూడా అయ్యాడు. అతని గర్వమే అతని వినాశనానికి కారణమయ్యింది. అతని దేవుడైన యెహోవాకు అతడు విశ్వాసపాత్రుడు కాలేదు. బలిపీఠం మీద ధూపం వేయటానికి అతడు ఆలయంలోకి వెళ్లాడు. 17యాజకుడైన అజర్యా, మరియు ధైర్యంగల యెహోవా సేవకులు ఎనుబది మంది ఉజ్జియాను వెంబడించి ఆలయంలోకి వెళ్లారు. 18ఉజ్జియా తప్పు చేస్తున్నట్లు వారతనిని మందలించారు. వారు యిలా అన్నారు: “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటం నీ పనికాదు. ఈ పని చేయటం నీకు మంచిది కాదు. యాజకులైన అహరోను సంతానంవారు మాత్రమే యెహోవాకు ధూపం వేయాలి. ధూపం వేసే పవిత్ర కార్యానికి ఈ యాజకులు శిక్షణ పొందారు. ఈ అతిపవిత్ర స్థలం నుండి నీవు బయటకు పొమ్ము. నీవు విశ్వాసంగా లేవు. ప్రభువైన యెహోవా నీ ఈ ప్రవర్తనకు నిన్ను గౌరవించడు!”
19కాని ఉజ్జియాకు కోపం వచ్చింది. అతని చేతిలో ధూపకలశం ఉంది. యాజకులపట్ల ఉజ్జియా కోపగించుకుంటూ ఉండగనే అతని నుదటిపై కుష్ఠురోగం#26:19 కుష్ఠురోగం హెబ్రీ భాషలో ఒక విధమైన భయంకర చర్మవ్యాధి అని అర్థము. పుట్టింది. ఆలయంలో ధూపపీఠం ప్రక్కనేవున్న యాజకుల ముందే ఇది జరిగింది. 20ప్రధాన యాజకుడైన అజర్యా, మరియు ఇతర యాజకులు ఉజ్జియా వైపు చూశారు. అతని నుదటి మీద కుష్ఠు రోగాన్ని వారు చూడగలిగారు. యాజకులు వెంటనే ఉజ్జియాను ఆలయం నుండి బయటికి తరిమేశారు. యెహోవా అతనిని శిక్షకు గురిచేసిన కారణంగా ఉజ్జియా తనకుతానే బయటకు వచ్చాడు. 21రాజైన ఉజ్జియా కుష్ఠురోగి అయ్యాడు. అతడు యెహోవా ఆలయంలో మళ్లీ ప్రవేశించలేక పోయాడు. ఉజ్జియా కుమారుడు యోతాము రాజగృహ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాజు తరపున ప్రజాపాలకుడయ్యాడు.
22మొదటి నుండి చివరి వరకు ఉజ్జియా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయైన యెషయా వ్రాశాడు. యెషయా తండ్రిపేరు ఆమోజు. 23ఉజ్జియా చనిపోయినప్పుడు అతనిని అతని పూర్వీకుల దగ్గరగా సమాధిచేశారు. ఉజ్జియా కుష్ఠురోగి కావటంవల్ల రాజుల శ్మశాన వాటికకు దగ్గరలోవున్న పొలంలో అతడు సమాధి చేయబడ్డాడు. పిమ్మట ఉజ్జియా స్థానంలో అతని కుమారుడు యోతాము కొత్త రాజు అయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 26: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి