అపొస్తలుల 5:1-11

అపొస్తలుల 5:1-11 TERV

“అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు. అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.” ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు. మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు. “ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది. పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.