నిర్గమకాండము 22

22
1“ఒక ఎద్దును లేక గొర్రెను దొంగతనం చేసిన వాడిని నీవు ఎలా శిక్షిస్తావు? వాడు ఆ జంతువును చంపేసినా లేక అమ్మేసినా అతడు దాన్ని తిరిగి ఇవ్వలేడు. కనుక వాడు దొంగిలించిన ఒక్క ఎద్దుకు బదులు అయిదు ఎడ్ల నివ్వాలి. లేక వాడు దొంగతనం చేసిన ఒక్క గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాలి. దొంగతనానికి అతడు శిక్ష చెల్లించాలి. 2-3వాడికి స్వంతది అంటూ ఏమీ లేకపోతే, వాడ్ని బానిసగా అమ్మాలి. అయితే ఆ జంతువు ఇంకా వాని దగ్గరే ఉంటే, దాన్ని, నీవు చూస్తే అప్పుడు వాడు ఆ దొంగిలించిన ప్రతి జంతువుకు బదులుగా రెండు జంతువుల్ని యజమానికి ఇవ్వాలి. ఆ జంతువు ఎద్దు, గాడిద, గొర్రె, ఏదైనా ఫర్వాలేదు. 4దొంగ రాత్రివేళ ఒక ఇంటికి కన్నము వేయటానికి ప్రయత్నిస్తూండగా చంపబడితే, వాణ్ణి చంపిన నేరం ఎవ్వరి మీదా ఉండదు. అయితే ఇది పగలు జరిగితే వాణ్ణి చంపిన వాడు నేరస్థుడే (దోషి).
5“ఒకడు తన పొలంలో లేక ద్రాక్షాతోటలో మంట రాజబెడితే, ఆ మంట పాకిపోయి, పక్కవాడి పొలాన్ని లేక ద్రాక్షా తోటను కాల్చివేస్తే అతడు తన శ్రేష్ఠమైన పంటను తన పొరుగువాడికి నష్టపరిహారంగా ఇవ్వాలి.
6“ఒకడు తన పొలంలో ముళ్ల పొదలను తగుల బెట్టడానికి మంట పెట్టవచ్చును. కానీ ఆ మంట పెద్దదై పొరుగువాడి పొలాన్ని లేక పొరుగువాడి పొలంలో పండుతున్న ధాన్యాన్ని కాల్చివేస్తే, అప్పుడు ఆ మంటను రాజబెట్టిన వ్యక్తి తాను కాల్చివేసిన వాటికి బదులుగా డబ్బు చెల్లించాలి.
7“ఒకడు తన డబ్బును లేక ఇంకేవైనా వస్తువుల్ని పొరుగువాని ఇంట్లో దాచి పెట్టమని తన పొరుగువాణ్ణి అడగవచ్చు. ఆ పొరుగువాడి ఇంట్లోనుంచి ఆ డబ్బు లేక వస్తువులు దొంగిలించబడితే, నీవేం చేయాలి? దొంగను పట్టుకొనేందుకు నీవు ప్రయత్నం చేయాలి. నీవు ఆ దొంగను పట్టుకొంటే, అప్పుడు వాడు ఆ వస్తువుల విలువకు రెండంతలు చెల్లించాలి. 8కానీ ఆ దొంగను నీవు పట్టుకోలేక పోతే, ఆ ఇంటి యజమాని నేరస్థుడైతే, అప్పుడు దేవుడే న్యాయం తీరుస్తాడు. ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటికి వెళ్లాలి. అతడే దొంగిలించి ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు.”
9“పోయిన ఒక ఎద్దు లేక గాడిద, గొర్రె లేక వస్త్రం లేక ఇంక దేన్నిగూర్చిగానీ ఇద్దరు వ్యక్తులకు ఒడంబడిక కుదరకపోతే, అప్పుడు నీవేం చేయాలి? ‘ఇది నాది’ అని ఒకడంటే, లేదు, ‘ఇది నాది’ అని ఇంకొకడు అంటాడు. ఆ ఇద్దరు మనుష్యులు దేవుని ఎదుటికి వెళ్లాలి. నేరస్థుడు ఎవరో దేవుడే నిర్ణయిస్తాడు. తప్పుచేసిన వాడు ఆ వస్తువు విలువకు రెండంతలు అవతలి వానికి చెల్లించాలి.
10“తన జంతువు విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం ద్వారా తనకు సహాయం చేయమని ఒకడు తన పొరుగు వాణ్ణి అడగవచ్చు. ఈ జంతువు గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు. అయితే ఆ జంతువు చనిపోయినా, ఆ జంతువుకు దెబ్బ తగిలినా లేక ఎవరూ చూడకుండా ఆ జంతువును ఇంకెవరైనా తీసుకొనిపోయినా నీవేం చేయాలి? 11ఆ జంతువును తాను దొంగిలించలేదని ఆ పొరుగువాడు వివరించి చెప్పాలి. ఇదే కనుక సత్యం అయితే, తాను దొంగతనం చేయలేదని ఆ పొరుగువాడు యెహవాకు ప్రమాణం చేయాలి. జంతువు యజమాని ఈ ప్రమాణాన్ని అంగీకరించాలి. ఆ పొరుగువాడు జంతువుకోసం దాని యజమానికి ఏమీ చెల్లించనక్కర్లేదు. 12అయితే, ఆ పొరుగు వాడు జంతువును దొంగిలిస్తే, అప్పుడు ఆ జంతువు కోసం దాని యజమానికి అతడు విలువ చెల్లించాలి. 13ఒకవేళ అడవి మృగాలు ఆ జంతువును చంపేస్తే, ఆ పొరుగువాడు దాని శవాన్ని రుజువుగా తీసుకురావాలి. చంపబడ్డ జంతువు కోసం దాని యజమానికి ఆ పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు.
14“ఒకడు తన పొరుగు వాని దగ్గర దేన్నయినా బదులు తీసుకొంటే దానికి అతడే బాధ్యుడు. ఒకవేళ ఒక జంతువుకు దెబ్బ తగిలినా లేక ఆ జంతువు చచ్చినా, అప్పుడు ఆ పొరుగువాడు దాని యజమానికి వెల చెల్లించాలి. యజమాని స్వయంగా అక్కడ లేడు గనుక ఆ పొరుగువాడే దానికి బాధ్యుడు. 15అయితే దాని యజమాని ఆ జంతువుతో కూడా ఉంటే, పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు. లేక, ఆ పొరుగువాడు ఆ జంతువుతో పని చేయించుకొనేందుకుగాను డబ్బు చెల్లిస్తుంటే, ఆ జంతువుకు దెబ్బ తగిలినా, అది చచ్చినా, అతడు ఏమీ చెల్లించనక్కర్లేదు. ఆ జంతువును వాడుకొనేందుకు అతడు చెల్లించిన డబ్బే సరిపోతుంది.
16“పెళ్లికాని పవిత్రమైన ఒక పడుచుదానితో ఒకవేళ ఒకడికి లైంగిక సంబంధం ఉంటే, అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆమె తండ్రికి అతడు నిండుగా కట్నం యివ్వాలి. 17అతణ్ణి పెళ్లి చేసుకొనేందుకు ఆమె తండ్రి అంగీకరించకపోయినా, అతడు ఆ డబ్బు చెల్లించాల్సిందే. ఆమె కోసం పూర్తి మొత్తాన్ని అతడు చెల్లించాలి.
18“నీవు ఏ స్త్రీనీ కూడా శకునం చెప్పనివ్వకూడదు. ఒకవేళ ఏ స్త్రీ అయినా చెప్తే, అలాంటి దాన్ని నీవు బతకనివ్వకూడదు.
19“నీవు ఎవ్వర్నీ జంతు సంయోగం చెయ్యనియ్యకూడదు. ఇలా కనుక జరిగితే, ఆ వ్యక్తిని చంపేయాలి.
20“ఎవడైనా సరే దేవుడు కాని వాడికి బలి అర్పిస్తే, అలాంటివాడ్ని నాశనం చేయాలి. యెహోవా దేవుడు ఒక్కడికే నీవు బలులు అర్పించాలి.” 21“జ్ఞాపకం ఉంచుకో ఇదివరకు మీరు ఈజిప్టు దేశంలో పరాయివాళ్లు. కనుక మీ దేశంలో ఉండే విదేశీయులలో ఎవర్నీ మీరు మోసం చేయకూడదు. కొట్టగూడదు.
22“విధవరాండ్రకు, అనాధలకు మీరు ఎన్నడూ ఎట్లాంటి కీడు చేయకూడదు. 23ఆ విధవరాండ్రకు లేక అనాధలకు మీరు ఏదైనా కీడు చేస్తే అది నాకు తెలుస్తుంది. వారి శ్రమను గూర్చి నేను వింటాను. 24అంతేకాదు, నాకు చాల కోపం వస్తుంది. కత్తితో నేను మిమ్మల్ని చంపేస్తాను. అప్పుడు మీ భార్యలు విధవరాండ్రయి పోతారు. మీ పిల్లలు అనాధలు అయిపోతారు.
25“నా ప్రజల్లో ఒకరు పేదవారైతే, నీవు వానికి డబ్బు అప్పిస్తే, ఆ డబ్బుకు నీవు అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. ఆ డబ్బు త్వరగా తిరిగి ఇచ్చి వేయమని నీవు అతణ్ణి తొందర చేయకూడదు: 26అతడు నీకు బాకీ ఉన్న డబ్బు నీకు చెల్లిస్తాడని ప్రమాణంగా ఎవరైనా ఒకరు తన అంగీని నీకు ఇవ్వవచ్చును. కాని సూర్యాస్తమయం కాకముందే నీవు ఆ అంగీని తిరిగి ఇచ్చివేయాలి. 27ఒకవేళ ఆ వ్యక్తికి ఆ అంగీ లేకపోతే, తన శరీరాన్ని కప్పుకొనేందుకు అతనికి ఇంకేమీ లేకపోవచ్చును. అతను నిద్రపోయినప్పుడు చల్లబడిపోతాడు. మరి అతడు నాకు మొరబెడితే, అప్పుడు నేను అతని మొర వింటాను. నేను దయగలవాణ్ణి కనుక నేను వింటాను.
28“నీ దేవుణ్ణిగాని, నీ ప్రజల నాయకులనుగాని నీవు దూషించగూడదు.
29“కోత కాలంలో నీ మొదటి గింజల్ని, నీ ఫలాల్లో మొదటి రసాన్ని నీవు నాకు ఇవ్వాలి. సంవత్సరాంతం వరకు వేచి ఉండొద్దు.
“నీ పెద్దకుమారుల్ని నాకు ఇవ్వు. 30అలాగే నీ ఆవుల్లో, గొర్రెల్లో, మొదట పుట్టిన వాటిని నాకు ఇవ్వు. అవి ఏడు రోజులు వాటి తల్లితో ఉండవచ్చు. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి. 31మీరు నా ప్రత్యేక ప్రజలు. కనుక అడవి మృగాలు చంపిన ఏదో ఒకదాని మాంసం మీరు తినవద్దు. చచ్చిన ఆ జంతువులను కుక్కల్ని తిననివ్వండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 22: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి