యెషయా 8

8
అష్షూరు త్వరలో వస్తుంది
1యెహోవా నాతో చెప్పాడు, “వ్రాయటానికి ఒక పెద్ద పలక తీసుకో. ఘంటంతో (పెన్నుతో) ఈ మాటలు వ్రాయి: ‘మహేరు, షాలాల్, హాష్ బజ్.’ (అంటే ‘త్వరలోనే దోపిడి, దొంగతనం జరుగుతుంది’ అని అర్థం.)”
2సాక్షులుగా నమ్మదగిన కొందరు మనుష్యుల్ని నేను సమావేశపర్చాను. (వీళ్లు ఊరియా, యెబెరెక్యా, జెకర్యా) నేను ఈ విషయాలు వ్రాయటం ఈ మనుష్యులు గమనించారు. 3తర్వాత నేను ప్రవక్త్రి దగ్గరకు వెళ్లాను. నేను ఆమెతో ఉన్న తర్వాత ఆమె గర్భవతియై, ఒక కుమారుని కన్నది. అప్పుడు యెహోవా నాతో చెప్పాడు, “పిల్లవాడికి మహేరు షాలాల్ హాష్‌బజ్” అని పేరు పెట్టు. 4ఎందుకంటే ఆ పిల్లవాడు “అమ్మా” “నాన్నా” అనటం నేర్చుకొనక ముందే దమస్కు, షోమ్రోనుల ధనం, ఐశ్వర్యాలు దేవుడు తీసుకొని, వాటిని దేవుడు అష్షూరు రాజుకు ఇచ్చివేస్తాడు.
5దేవుడు మళ్లీ నాతో మాట్లాడాడు. 6నా ప్రభువు చెప్పాడు: “ఈ ప్రజలు నిదానంగా ప్రవహించే షిలోహు#8:6 షిలోహు అనగా యెరూషలేములో కోనేరు. జలాలను స్వీకరించేందుకు నిరాకరించారు. రెజీను, రెమల్యా కుమారునితో (పెకహు) వీళ్లు సంతోషపడి పోతున్నారు. 7అందుచేత చూడు, నా యెహోవా మహా గొప్ప యూఫ్రటీసు నదీ ప్రవాహంలాగా అష్షూరును దాని శక్తి అంతటిని తీసుకొని వస్తున్నాడు. వారు ఒక నది పొంగి పొర్లేలా, ప్రవాహంలా మీ దేశంలోనికి వస్తారు. 8ఆ నదిలోంచి నీళ్లు పొంగి యూదాలోకి ప్రవహిస్తాయి. యూదా గొంతుల వరకు నీళ్లు పొంగి, యూదాను దాదాపుగా ముంచేస్తాయి.
“ఇమ్మానుయేలూ, నీ దేశం అంతటినీ ముంచివేసేంతగా ఈ వరద విస్తరిస్తుంది.”
9సర్వ దేశాల్లారా, యుద్ధానికి సిద్ధపడండి.
కాని మీరు ఓడిపోతారు.
దూర దేశాలన్నీ ఆలకించండి.
యుద్ధానికి సిద్ధపడండి.
కానీ మీరు ఓడిపోతారు
10యుద్ధానికి మీ వ్యూహాలు పన్నండి.
కానీ మీ వ్యూహాలు అన్నీ ఓడిపోతాయి.
మీ సైన్యాలకు ఆజ్ఞాపించండి.
కానీ మీ ఆజ్ఞలు నిష్ప్రయోజనమే. ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు#8:10 దేవుడు మాతో ఉన్నాడు అనగా ఇమ్మానుయేలు అని భావం. గనుక.
యెషయాకు హెచ్చరికలు
11యెహోవా తన మహా శక్తితో నాతో మాట్లాడాడు. ఈ ఇతర మనుష్యుల్లా ఉండొద్దని యెహోవా నన్ను హెచ్చరించాడు. 12“ప్రతివారూ ఇతరులు తమకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు ఆ విషయాలు నమ్మవద్దు. ఆ ప్రజలు భయపడే వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయపడవద్దు” అని యెహోవా నాతో చెప్పాడు.
13సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక్కడికే మీరు భయపడాలి. మీరు గౌరవించాల్సిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే. 14మీరు యెహోవాను గౌరవించి, ఆయనను పవిత్రునిగా ఎంచుకొంటే, అప్పుడు ఆయనే మీకు క్షేమస్థానంగా ఉంటాడు. కానీ మీరు ఆయనను గౌరవించరు. కనుక మీరు పడిపోయేట్టు చేసే బండ ఆయనే. ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలను తొట్రిల్లేలా చేసే బండ ఆయనే. యెరూషలేము ప్రజలందరినీ పట్టుకొనే బోను యెహోవాయే. 15(అనేకమంది మనుష్యులు ఈ బండ తగిలి పడిపోతారు. వాళ్లు పడిపోయి, విరిగిపోతారు. వారు బోనులో పట్టుబడతారు.)
16యెషయా చెప్పాడు, “ఒక ఒడంబడిక చేసి, దాన్ని ముద్రించండి. నా ఉపదేశాలను భవిష్యత్తు కోసం భద్రపర్చండి. నన్ను అనుసరించే వాళ్లు చూస్తూ ఉండగా దీనిని చేయండి.”
17ఆ ఒడంబడిక ఇదేః యెహోవా మాకు సహాయం చేసేవరకు నేను వేచి ఉంటాను.
యాకోబు (ఇశ్రాయేలు) వంశం విషయం యెహోవా సిగ్గు పడుతున్నాడు. ఆయన వాళ్లను చూచేందుకు నిరాకరిస్తున్నాడు.
కానీ నేను యెహోవా కోసం నిరీక్షిస్తాను.
ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు.
18“ఇశ్రాయేలు ప్రజలకు నేనూ, నా పిల్లలే సూచనగా రుజువుగా ఉన్నాము. సీయోను కొండమీద నివాసం చేసే సర్వశక్తిమంతుడైన యెహోవా మమ్మల్ని పంపించాడు.”
19కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బ్రతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి? 20మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. ఈ ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆ ఆదేశాలను పాటించటం వల్ల మీకేమీ లాభం ఉండదు.) 21ఆ తప్పు ఆదేశాలను మీరు పాటిస్తే దేశంలో కష్టాలు, ఆకలి ఉంటాయి. ప్రజలు ఆకలితో ఉంటారు. అప్పుడు వాళ్లకు కోపం వచ్చి రాజును, అతని దేవుళ్లను తిడతారు. అప్పుడు వాళ్లు సహాయం కోసం దేవునివైపు చూస్తారు. 22వారు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడుతుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు తమను తాము విడిపించుకోలేరు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 8: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి