యిర్మీయా 28

28
అబద్ద ప్రవక్త హనన్యా
1యూదా రాజుగా సిద్కియా పాలన నాలుగు సంవత్సరాలు#28:1 నాలుగు సంవత్సరాలు ఇది క్రీ. పూ. 594వ సంవత్సరం. దాటి ఐదవ నెల గడుస్తూ ఉండగా ప్రవక్త హనన్యా నాతో మాట్లాడాడు. హనన్యా తండ్రి పేరు అజ్జూరు. హనన్యా గిబియోను పట్టణవాసి. హనన్యా నాతో మాట్లాడినప్పుడు అతడు దేవాలయంలో వున్నాడు. యాజకులు, ఇతర ప్రజలు అందరు కూడ అక్కడ చేరి వున్నారు. హనన్యా ఇలా చెప్పాడు. 2“ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘యూదా ప్రజల మెడపై బబులోను రాజు వుంచిన కాడిని నేను విరిచి వేస్తాను. 3రెండు సంవత్సరాలు గడిచేలోగా యెహోవా గుడి నుండి బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొనిపోయిన వస్తువులన్నిటినీ నేను తిరిగి తెస్తాను. నెబుకద్నెజరు ఆ వస్తువులన్నిటినీ బబులోనుకు తీసుకొని పోయాడు. కాని వాటన్నిటినీ నేను తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తాను. 4యూదా రాజైన యెహోయాకీమను కూడా ఈ స్థానానికి నేను తీసుకొని వస్తాను. యెకోన్యా యెహోయాకీము కుమారుడు. నెబుకద్నెజరు బలవంతం చేసి తమ ఇండ్ల నుండి బబులోనుకు తీసుకొని పోయిన యూదా ప్రజలందరినీ నేను తిరిగి తీసుకొని వస్తాను.’ ఇది యెహోవా నుంచి వచ్చిన సమాచారం ‘కావున బబులోను రాజు యూదా ప్రజల మెడపై ఉంచిన కాడిని నేను విరుగగొడతాను!’”
5అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యాకు ఇలా సమాధానం చెప్పాడు. వారు దేవాలయంలో నిలబడి వున్నారు. యాజకులు, మరియు అక్కడ చేరిన ప్రజలు యిర్మీయా సమాధానం వినగలిగారు. 6హనన్యాతో యిర్మీయా ఇలా అన్నాడు: “తధాస్తు! నిజంగా యెహోవా అలా చేయుగాక! నీవు ప్రవచించిన వర్తమానం యెహోవా నిజం చేయుగాక! బబులోను నుంచి దేవాలయ సంబంధిత వస్తువులన్నీటినీ యెహోవా ఇక్కడికి తీసుకొని వచ్చుగాక! బలవంతంగా తమ ఇండ్లు వదిలి పోయేలా చేయబడిన ప్రజలందరినీ యెహోవా మరల ఇక్కడికి తీసికొని వచ్చుగాక!
7“కాని హనన్యా! నేను చెప్పేది విను. ప్రజలారా, మీరందరు నేను చెప్పేది వినండి. 8హనన్యా! నీవు, నేను ప్రవక్తలం అవటానికి పూర్వం చాలా ముందు కాలంలో ప్రవక్తలుండినారు. చాలా దేశాలకు, మహా సామ్రాజ్యాలకు యుద్ధాలు, కరువులు, భయంకరమైన రోగాలు వస్తాయని వారు చెప్పియున్నారు. 9కాని మనకు సుఖ సంతోషాలు, శాంతి లభిస్తాయని చేప్పే ప్రవక్త నిజంగా యెహోవాచే పంపబడినవాడేనా అని మనం నిర్ధారణ చేయవలసి వుంది. ఆ ప్రవక్త చెప్పినది నిజమయ్యే పక్షంలో, అతడు నిజంగా యెహోవాచే పంపబడిన వాడని ప్రజలు తెలుసుకోవచ్చు.”
10యిర్మీయా ఒక కాడిని తన మెడకు తగిలించుకుని ఉన్నాడు. ప్రవక్త హనన్యా ఆ కాడిని యిర్మీయా మెడనుండి తీసి విరుగగొట్టాడు. 11పిమ్మట అక్కడ చేరిన ప్రజలంతా వినేలా హనన్యా ఇలా బిగ్గరగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చినదేమంటే, ఇదే రీతిని బబులోను రాజు నెబుకద్నెజరు వేసిన కాడిని నేను విరిచి వేస్తాను. అతడు ఆ కాడిని ప్రపంచ దేశాలన్నిటిపై వేశాడు. కాని రెండు సంవత్సరాల కాలంలోపల నేనా కాడిని విరిచివేస్తాను.”
హనన్యా అలా చెప్పిన పిమ్మట యిర్మీయా దేవాలయం నుండి వెళ్లి పోయాడు.
12తరువాత యెహోవా సందేశం యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా మెడ నున్న కాడిని తీసి హనన్యా విరచి వేసిన తరువాత ఇది జరిగింది. 13యెహోవా యిర్మీయాతో ఇలా చెప్పాడు, “నీవు వెళ్లి హనన్యాతో ఇలా చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు, నీవు చెక్కతో చేయబడిన కాడిని విరుగగొట్టావు. కాని దానికి బదులు నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను.’ 14ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ దేశాలన్నిటిపైన నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకు వారంతా దాస్యం చేయాలనే ఉద్దేశంతో నేనలా చేస్తున్నాను. వారు అతనికి బానిసలవుతారు. కృరమృగాలను కూడ అదుపులో పెట్టగల శక్తిని నెబుకద్నెజరుకు ప్రసాదిస్తాను.’”
15అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు, “హనన్యా, వినుము! యెహోవా నిన్ను పంపలేదు. కాని యూదా ప్రజలు అబద్ధాలు నమ్మేలా చేశావు. 16అందువల్ల యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘హనన్యా, త్వరలో నిన్ను ఈ ప్రపంచం నుండి తీసుకొని వెళతాను. ఈ సంవత్సరమే నీవు చనిపోతావు. ఎందువల్లనంటే ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా నీవు బోధించావు గనుక.’”
17హనన్యా అదే సంవత్సరం ఏడవ నెలలో చనిపోయాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 28: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి