యిర్మీయా 3

3
1“ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే,
ఆ వ్యక్తి మళ్లీ ఆమెవద్దకు తిరిగి రాగలడా? లేదు. రాలేడు!
ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు#3:1 ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు మోషే ధర్మశాస్త్ర ప్రకారం తను విడాకులిచ్చిన స్త్రీ మరో వ్యక్తిని వివాహమాడినప్పుడు ఆ వ్యక్తి మరల ఆ స్త్రీ వద్దకు వెళ్లటం నిషిద్ధం. ఒకవేళ ఆమె నూతన భర్త ఆమెకు విడాకులిచ్చినా, లేక చనిపోయినా, ఆమె మొదటి భర్త తిరిగి ఆమెను వివాహం చేసికోవటం ధర్మశాస్త్ర విరుద్ధం. తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా ‘మాలిన్య’ మైపోతుంది.
యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు.
మరల నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావా?”
అని యెహోవా పలికాడు.
2“యూదా, దిశగా ఉన్న కొండ శిఖరాలను చూడు.
నీవక్కడ తిరుగని చోటు ఉందా? నీవు బాట ప్రక్కన విటుల (అబద్ధపు దేవుళ్ల) కోసం వేచివున్నావు.
ఎడారిలో కూర్చున్న అరబీయునివలె
నీవక్కడ కూర్చున్నావు.
నీవు దేశాన్ని ‘అపవిత్రం’ చేశావు! ఏమైనంటావా?
నీవు చాలా దుష్కార్యాలు చేశావు.
నీవు నాకు విశ్వాసపాత్రంగా లేవు.
3నీవు పాపం చేశావు. అందుచే వర్షాలు లేవు.
వసంత కాలపు వానలూ లేవు.
అయినా నీ ముఖ లక్షణాలు వేశ్యాలక్షణాల్లా ఉన్నాయి.
నీ అకృత్యాలకు సిగ్గుపడటంకూడా మానివేశావు.
4కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు.
‘నా తండ్రీ’ నా బాల్యంనుండి
‘నీవు నాకు ప్రియ మిత్రునిలా ఉన్నావు.’
5‘దేవుడు నా పట్ల ఎల్లప్పుడూ కోపంగా ఉండడు.
దేవుని కోపం అల్పమైనది.
అది శాశ్వతంగా ఉండదు’ అని అంటున్నావు.
“యూదా, నీవీ విషయాలు అంటూనే
నీవు ఎంత చెడు చేయగలవో అంతా చేస్తున్నావు.”
చెడ్డ తోబుట్టువులు: ఇశ్రాయేలు మరియు యూదా
6రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే కాలంలో యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు#3:6 ఇశ్రాయేలు ఇక్కడ ఇశ్రాయేలు అనగా ఇశ్రాయేలు యొక్క ఉత్తర ప్రాంతం. యిర్మీయా కాలానికి వంద సంవత్సరాల ముందు అష్షూరు వారిచే ఇశ్రాయేలు నాశనం చేయబడింది. చేసిన చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వాసరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహాలతో వ్యభిచరించిన పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది. 7‘ఈ చెడు కార్యాలన్నీ చేయటం పూర్తయిన పిమ్మట ఇశ్రాయేలు తప్పక నావద్దకు తిరిగి వస్తుంది’ అని నేననుకున్నాను. కాని ఆమె నా వద్దకు రాలేదు. విశ్వాస ఘాతకురాలైన ఇశ్రాయేలు సోదరియగు యూదా ఆమె ఏమి చేసిందో చూసింది. 8ఇశ్రాయేలు విశ్వాసపాత్రంగా లేదు. ఆమెను నేనెందుకు పంపి వేశానో ఇశ్రాయేలుకు తెలుసు. ఆమె వ్యభిచార దోషానికి పాల్పడినందుకే నేనామెకు విడాకులిచ్చానని ఇశ్రాయేలుకు తెలుసు. కాని అది విశ్యాస ఘాతకురాలైన ఆమె సోదరిని భయపెట్టలేదు. యూదా భయపడలేదు. యూదా కూడా తెగించి వ్యభిచారిణిలా ప్రవర్తించింది. 9తానొక మరుగులేని వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా ఆమె తన దేశాన్ని ‘మలిన’ (అపవిత్ర) పర్చింది. రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది. 10ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
11యెహోవా నాతో ఇలా చెప్పినాడు “ఇశ్రాయేలు నాకు విశ్వాసపాత్రంగా లేదు. విశ్వాసం లేని యూదా కంటె ఇశ్రాయేలుకు చెప్పుకొనేందుకు ఒక మంచి సాకువుంది. 12యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు:
“‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’
ఇది యెహోవా వాక్కు.
‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను.
నేను నిండు దయతో ఉన్నాను.’
ఈ వాక్కు యెహోవాది.
‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను.
13నీవు నీ పాపాన్ని గుర్తించాలి.
నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు
నీ పాపం అదే.
ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు
నీవు ప్రతి పచ్చని చెట్టు క్రిందా విగ్రహారాధన చేశావు
నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.’”
ఇదే యోహోవా వాక్కు.
14“విశ్వాసంలేని ప్రజలారా, నావద్దకు రండి” అని యెహోవా అంటున్నాడు “నేను మీ యజమానిని. ప్రతి నగరంనుంచీ ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి కుటుంబంనుంచీ ఇద్దరు మనుష్యులను తీసుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకొని వస్తాను. 15అప్పుడు మీకు నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు. 16ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీరనేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది.
“ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు. 17ఆ సమయంలో యెరూషలేము నగరం ‘యెహోవా సింహాసనం’ అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు యెరూషలేము నగరంలో కలిసి యెహోవాను స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ మొండి హృదయాలను ఇక ఎంత మాత్రం అనుసరించరు. 18ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు వంశంతో కలుస్తుంది వారు ఉత్తర ప్రాంతంలో ఒకే చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన రాజ్యంలోకి వారు వస్తారు.”
19యెహోవానైన నేనిలా అనుకున్నాను,
“మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం.
మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది.
ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది.
మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను.
మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను.
20కాని తన భర్త పట్ల వంచనగా నడిచే స్త్రీవలె మీరు తయారయ్యారు.
ఇశ్రాయేలు వంశమా, నీవు నా పట్ల విశ్వాస పాత్రంగా మెలగ లేదు!
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
21నగ్నంగా ఉన్న కొండలమీద రోదన నీవు వినవచ్చు.
ఇశ్రాయేలు ప్రజలు దయాభిక్ష కోరుకుంటూ ఏడుస్తూ ప్రార్ధన చేస్తున్నారు.
వారు బహు దుష్టులైనారు!
వారు తమ యెహోవా దేవున్ని మర్చిపోయారు.
22“విశ్వాసఘాతకులగు ఇశ్రాయేలీయులారా నా వద్దకు తిరిగి రండి.
నన్నాశ్రయించి రండి.
నా పట్ల వంచనతో
మెలిగినందుకు క్షమిస్తాను.”
“అవును. మేము నీ వద్దకు వస్తాము.
నీవు మా యెహోవా దేవుడవు
23కొండల మీద విగ్రహాలను పూజించుట అవివేకం.
కొండలమీద ఆడంబరంగా జరిగే పూజా కార్యక్రమమంతా మోసం.
నిజానికి, ఇశ్రాయేలుకు రక్షణ
యెహోవా దేవుని వద్దనుండే వస్తుంది.
24ఆ భయంకరమైన బయలుదేవత
మన తండ్రుల ఆస్తిని మ్రింగివేసింది.
మనం పిల్లలం కావటంతో ఇదంతా జరిగింది.
ఆ భయంకరమైన దేవత#3:24 ఆ భయంకరమైన దేవత ఇక్కడ బయలు దేవతకు అన్వయం.
మన తండ్రుల గొర్రెలను, పశువులను,
వారి కుమారులను, కుమార్తెలను చంపింది.
25మనం సిగ్గుతో తలవంచుకుందాం.
మన అవమానం మనల్ని దుప్పటిలా కప్పివేయనీయండి.
మన యెహోవా దేవునిపట్ల మనం తీవ్రమైన పాపం చేశాం.
మనం, మన తండ్రులు కూడా పాపానికి ఒడిగట్టాము.
మన చిన్నతనం నుండి ఇప్పటివరకు
యెహోవా దేవుని ఆజ్ఞను మనం పాటించలేదు” అని చెప్పాలి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 3: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి