యోహాను 11:4-15

యోహాను 11:4-15 TERV

యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది. లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు. వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు. యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు. రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు. ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.” ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు. యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు. అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.