యోబు 7

7
1యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంఘర్షణ ఉంది.
అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది.
2ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి.
జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా ఉన్నాడు మనిషి.
3అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడుతోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి.
శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడ్డాయి.
4నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను,
‘నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది?’ అని.
రాత్రి జరుగుతూనే ఉంటుంది.
సూర్యుడు వచ్చేంతవరకు నేను అటూ యిటూ దొర్లుతూనే ఉంటాను.
5నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది.
నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న పుండ్లతో నిండిపోయింది.
6“నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి.
నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం అవుతుంది.
7దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో.
నా కళ్లు మంచిదానిని దేనినీ మరల చూడవు.
8నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు.
నీవు నాకోసం చూస్తావు. కాని నేను చనిపోయి వుంటాను.
9ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది.
అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాదిలో పాతి పెట్టబడతాడు. మరల తిరిగిరాడు.
10అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు.
అతనిస్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు.
11“అందుచేత నేను మౌనంగా ఉండను.
నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది.
నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను.
12ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు?
నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా?
13నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి
నా మంచం నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి
14కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపెడుతున్నావు.
దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు.
15అందుచేత బ్రతకటం కంటె
చంపబడటం నాకు మేలు.
16నా బ్రదుకు నాకు అసహ్యం.
నేను శాశ్వతంగా జీవించాలని కోరను
నన్ను ఒంటరిగా ఉండనివ్వు.
నా జీవితానికి అర్థం శూన్యం.
17దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి?
మనిషికి నీవసలు గుర్తింపు ఎందుకు ఇవ్వాలి?
18నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు,
ప్రతిక్షణం ఎందుకు పరీక్షిస్తావు?
19దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు?
ఒక క్షణమైన నీవు నన్ను ఒంటరిగా ఉండనియ్యవు?
20మనుష్యులను గమనించువాడా,
నేను పాపం చేశానంటావా, సరే, మరి నన్నేం చేయమంటావు?
దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు?
నేను నీకు ఒక భారమై పోయానా?
21నీవు నా తప్పిదాలు క్షమించి,
నా పాపాలను ఎందుకు క్షమించకూడదు?
త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను.
అప్పుడు నీవు నాకోసం వెదకుతావు. నేను పోయి ఉంటాను.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 7: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి