లూకా 6:27-36

లూకా 6:27-36 TERV

“కాని, నా మాటలు వినే వాళ్ళకు యిది నేను చెబుతున్నాను: మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి. మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి. ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు. అడిగిన వాళ్ళకు యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి. ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి. “మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు. మీకు మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులుకూడా అదే విధంగా చేస్తారు. అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు. “మీ శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి.