మత్తయిత 18:21-35

మత్తయిత 18:21-35 TERV

అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లు క్షమించాలని చెబుతున్నాను. “అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు. ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలు పెట్టగానే వేలకొలది తలాంతులు అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకు వచ్చారు. కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. అందువల్ల ఆ రాజు అతణ్ణి, అతని భార్యను, అతని సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు. “ఆ సేవకుడు రాజు ముందు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వండి, మీకివ్వ వలసిన డబ్బంతా యిచ్చేస్తాను’ అని వేడుకొన్నాడు. రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేసాడు. పైగా అతని అప్పుకూడా రద్దు చేసాడు. “ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనతో కలసి పనిచేసే సేవకుణ్ణి చూసాడు. తనకు వంద దేనారాలు అప్పువున్న అతని గొంతుక పట్టుకొని, ‘నా అప్పు తీర్చు!’ అని వేధించాడు. “అప్పువున్నవాడు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వు! నీ అప్పు తీరుస్తాను!’ అని బ్రతిమిలాడాడు. “కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు. తోటి సేవకులు జరిగింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు. “అప్పుడు ఆ ప్రభువు ఆ సేవకుణ్ణి పిలిచి, కోపంతో ‘దుర్మార్గుడా! నీవు బ్రతిమిలాడినందుకు నీ అప్పంతా రద్దు చేసాను. మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు. “మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.”