కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు. అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు. వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు. వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.
Read మార్కు 2
వినండి మార్కు 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 2:1-12
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు