23
లేవీయులు
1దావీదు వృద్ధుడై వయస్సు నిండినవాడై ఉన్నప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు.
2అతడు ఇశ్రాయేలు నాయకులందరిని, యాజకులను, లేవీయులను సమకూర్చాడు. 3ముప్పై సంవత్సరాలు అంతకు పైవయస్సు లేవీయులు లెక్కించబడ్డారు. వారు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది మనుష్యులు. 4దావీదు, “వీరిలో ఇరవైనాలుగు వేలమంది యెహోవా ఆలయ పని బాధ్యత తీసుకోవాలి, ఆరు వేలమంది అధికారులుగా, న్యాయాధిపతులుగా ఉండాలి. 5నాలుగు వేలమంది ద్వారపాలకులుగా ఉండాలి, నాలుగు వేలమంది ఉద్దేశ్యం కలిగి నేను చేయించిన సంగీత వాయిద్యాలతో యెహోవాను కీర్తించాలి” అని చెప్పాడు.
6లేవీ కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి వంశాల ప్రకారం దావీదు లేవీయులను వేరుచేసి మూడు విభాగాలు చేశాడు.
గెర్షోనీయులు
7గెర్షోనీయులకు చెందినవారు:
లద్దాను, షిమీ.
8లద్దాను కుమారులు:
యెహీయేలు, జేతాము, యోవేలు మొత్తం ముగ్గురు.
9షిమీ కుమారులు:
షెలోమీతు, హజీయేలు, హారాను మొత్తం ముగ్గురు.
(వీరు లద్దాను కుటుంబాల పెద్దలు.)
10షిమీ కుమారులు:
యహతు, జీనా,#23:10 కొ.ప్ర.లలో జీజా యూషు, బెరీయా.
వీరు షిమీ కుమారులు మొత్తం నలుగురు.
11(యహతు పెద్దవాడు, జీజా రెండవవాడు, అయితే యూషుకు, బెరీయాకు కుమారులు ఎక్కువ మంది లేరు; కాబట్టి తమ కర్తవ్యం విషయంలో వారిని ఒక్క కుటుంబంగానే లెక్కించారు.)
కహాతీయులు
12కహాతు కుమారులు:
అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు మొత్తం నలుగురు.
13అమ్రాము కుమారులు:
అహరోను, మోషే.
అహరోను, అతని వారసులు నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికి, యెహోవా సన్నిధిలో బలులు అర్పించడానికి, ఆయన సన్నిధిలో సేవ చేయడానికి, ఆయన నామాన్ని బట్టి ప్రజలను దీవించడానికి ప్రత్యేకించబడ్డారు. 14దైవజనుడైన మోషే కుమారులు లేవీ గోత్రం వారిలో లెక్కించబడ్డారు.
15మోషే కుమారులు:
గెర్షోము, ఎలీయెజెరు.
16గెర్షోము వారసులు:
షెబూయేలు మొదటివాడు.
17ఎలీయెజెరు వారసులు:
రెహబ్యా మొదటివాడు.
(ఎలీయెజెరుకు ఇక కుమారులెవరు లేరు, కాని రెహబ్యాకు చాలామంది కుమారులున్నారు.)
18ఇస్హారు కుమారులు:
షెలోమీతు మొదటివాడు.
19హెబ్రోను కుమారులు:
యెరీయా మొదటివాడు, అమర్యా రెండవవాడు,
యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
20ఉజ్జీయేలు కుమారులు:
మీకా మొదటివాడు, ఇష్షీయా రెండవవాడు.
మెరారీయులు
21మెరారి కుమారులు:
మహలి, మూషి.
మహలి కుమారులు:
ఎలియాజరు, కీషు.
22(ఎలియాజరు కుమారులు లేకుండానే చనిపోయాడు: అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి బంధువులైన కీషు కుమారులు వారిని పెళ్ళి చేసుకున్నారు.)
23మూషి కుమారులు:
మహలి, ఏదెరు, యెరీమోతు మొత్తం ముగ్గురు.
24వీరు కుటుంబాల ప్రకారం లేవీ వారసులు; పేర్ల నమోదు ప్రకారం కుటుంబ పెద్దలైన వీరు ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు కలిగి, తమ తమ పేర్లను బట్టి ఒక్కొక్కరుగా లెక్కించబడి యెహోవా మందిరంలో సేవ చేయడానికి నియమించబడ్డారు. 25ఎందుకంటే దావీదు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకు నెమ్మది ప్రసాదించి, శాశ్వతంగా యెరూషలేములో నివసించడానికి వచ్చారు కాబట్టి, 26ఇకపై లేవీయులకు సమావేశ గుడారాన్ని, దాని సేవకు ఉపయోగించే వస్తువులను మోసే పనిలేదు” అని చెప్పాడు. 27దావీదు ఇచ్చిన చివరి ఆదేశాల ప్రకారం, లేవీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు వారిని లెక్కించారు.
28యెహోవా ఆలయ సేవలలో అహరోను వారసులకు సహాయం చేయడమే వారికి అప్పగించబడిన బాధ్యత: ప్రాంగణాలు, ప్రక్క గదుల బాధ్యత, పవిత్ర వస్తువులన్నిటిని శుద్ధి చేయడం, దేవుని మందిరంలో ఇతర పనులు చేయడము. 29బల్లమీద సన్నిధి రొట్టెలుంచడం, భోజనార్పణల కోసం ప్రత్యేక పిండిని చూడడం, పులియని అప్పడాలు చేయడం, కాల్చడం, కలపడం, అన్ని రకాల పరిమాణాలు కొలతల్లో సిద్ధపరచడము. 30-31వారు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం నిలబడి యెహోవాను స్తుతించాలి. వారు సాయంకాలంలో, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, నియమించబడిన పండుగల్లో, యెహోవాకు దహనబలులు అర్పించే సమయాలన్నిటిలో వారు ఆయనను స్తుతించాలి. వారికి నియమించబడిన విధానం ప్రకారం క్రమంగా యెహోవా సముఖంలో సేవ చేయాలి.
32కాబట్టి లేవీయులు సమావేశపు గుడారానికి, పరిశుద్ధ స్థలానికి బాధ్యత వహిస్తూ, యెహోవా ఆలయ సేవ కోసం తమ బంధువులైన అహరోను వారసుల క్రింద వారు సేవ చేశారు.