15
క్రీస్తు పునరుత్థానం
1సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు స్వీకరించి నేర్చుకొని, దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేనిచో, మీరు వ్యర్థంగా నమ్మారు.
3నేను పొందినదానిని మొదటిగా మీకు అందించాను: అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కొరకు మరణించారు. 4లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడి, మూడవ దినాన సజీవునిగా లేచారు. 5ఆయన కేఫాకు#15:5 కేఫాకు అనగా పేతురు తరువాత పన్నెండు మందికి కనబడ్డారు. 6దాని తరువాత ఆయన ఒకేసారి ఐదువందల మందికి పైగా సహోదర, సహోదరీలకు కనబడ్డారు. వారిలో కొందరు మరణించినా చాలామంది ఇంకా జీవించేవున్నారు. 7ఆ తరువాత యాకోబు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు. 8అందరికన్నా చివరిగా అసాధారణంగా జన్మించిన నాకు కూడా ఆయన కనబడ్డారు.
9అపొస్తలులందరిలో నేను అల్పమైనవాడిని. నేను దేవుని సంఘాన్ని హింసించిన కారణంగా అపొస్తలుడని పిలువబడడానికి యోగ్యున్ని కాను. 10అయితే నేనేమైవున్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో నిష్ఫలం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటె నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, అది నాకు తోడుగా వున్న దేవుని కృపయే. 11కనుక నేనుగాని వారు గాని దీన్నే బోధిస్తున్నాం, దీన్నే మీరు నమ్మారు.
మృతుల పునరుత్థానం
12మృతులలో నుండి క్రీస్తు జీవంతో లేపబడ్డారని మేము బోధిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు? 13మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు లేపబడనట్టే. 14మరియు క్రీస్తే లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. 15అంతకంటే ఎక్కువ, దేవుని విషయంలో అనగా దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము తప్పుడు సాక్షులంగా కనిపిస్తాం. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా. 16మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. 17క్రీస్తు లేపబడకపోతే, మీ విశ్వాసం వ్యర్థం; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. 18అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. 19కేవలం ఈ జీవితం కొరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయులం.
20ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు. 21ఒక్క మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కనుక మృతుల పునరుత్థానం కూడ ఒక్క మనుష్యుని ద్వారానే వస్తుంది. 22ఆదాములో అందరూ ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరూ సజీవులుగా చేయబడతారు. 23అయితే ప్రతి ఒక్కరు తమ క్రమాన్ని బట్టి బ్రతికించబడతారు. క్రీస్తు ప్రథమఫలం. తరువాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతుకుతారు. 24అప్పుడు అంతం వస్తుంది, క్రీస్తు అన్ని రాజ్యాలను, అధికారులను, శక్తులను నాశనం చేసి, రాజ్యానికి తండ్రియైన దేవునికి అప్పగిస్తారు. 25ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు. 26నశించాల్సిన చివరి శత్రువు మరణం. 27“దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచారు”#15:27 కీర్తన 8:6 అని చెప్పినప్పుడు ఆయన క్రింద సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మినహా, సమస్తం ఆయన క్రింద ఉంచారని అర్థం. 28ఆయన ఇది చేసినప్పుడు, దేవుడే అన్నిటిలో సర్వమై ఉండేలా, కుమారుడు తనకు సమస్తాన్ని లోబరచిన దేవునికి తనను తాను లోబరచుకొన్నారు.
29ఇప్పుడు పునరుత్థానం లేకపోతే, మరి మృతుల కొరకు బాప్తిస్మం పొందినవారు ఏం చేస్తారు? మరణించినవారు ఎన్నటికి లేపబడకపోతే, ప్రజలు వారి కొరకు ఎందుకు బాప్తిస్మం పొందుతున్నారు? 30మరి అనుక్షణం మేము ఎందుకు ప్రాణభయంతో ఉండాలి? 31సహోదరీ సహోదరులైన మీ గురించి మన ప్రభువైన యేసుక్రీస్తులో నాకు అతిశయం కలుగుతున్నట్టుగానే నేను ప్రతి దినం మరణాన్ని ఎదుర్కొంటున్నాను 32కాని, ఎఫెసులోని మృగాలతో నేను పోరాడింది కేవలం మానవ రీతిగా, అయితే నేను పొందిన లాభమేమిటి? ఒకవేళ మరణించినవారు లేపబడకపోతే,
“రేపు మనం మరణిస్తాం కనుక,
మనం తిని త్రాగుదాము.”#15:32 యెషయా 22:13
33మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.” 34మీరు నీతిప్రవర్తన కలిగివుండి పాపం చేయకండి. దేవుడు తెలియనివారు కొందరు మీలో ఉన్నారు కనుక, మిమ్మల్ని సిగ్గుపరచడానికి ఇలా చెప్తున్నాను.
పునరుత్థాన శరీరం
35“చనిపోయినవారు ఎలా లేపబడతారు? వారికి ఎలాంటి శరీరం ఉంటుంది?” అని ఎవరైన ప్రశ్నించవచ్చు. 36మూర్ఖుడా! నీవు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది చనిపోతేనే తప్ప మొలకెత్తదు. 37గోధుమ గింజనైన, లేక మరొకదానినైన నీవు భూమిలో నాటినప్పుడు విత్తనం మాత్రమే నాటావు గాని పెరిగిన మొక్క కాదు. 38అయితే దేవుడు తాను నిర్ణయించిన శరీరాన్ని దానికి ఇస్తారు. ఆయన ప్రతి ఒక్క గింజకు దాని సొంత శరీరాన్ని ఇస్తారు. 39శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవులకు ఒకలాంటి శరీరం, జంతువులకు మరొకటి, పక్షులకు వేరొకటి, చేపలకు ఇంకొకటి. 40అలాగే ఆకాశ శరీరాలు ఉన్నాయి, భూలోక శరీరాలు ఉన్నాయి; ఆకాశ శరీరాల వైభవం ఒక రకమైనది, భూశరీరాల వైభవం వేరొక రకమైనది. 41సూర్యుని వైభవం ఒక రకమైనది, చంద్రునిది వేరొక రకమైనది, నక్షత్రాలది మరొక రకం, ఒక నక్షత్ర వైభవం మరొక నక్షత్రం కన్నా భిన్నమైనది.
42మరణించినవారి పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నాటబడిన శరీరం నశించిపోయేది, అయితే అది నాశనంలేనిదిగా లేపబడుతుంది. 43అది గౌరవం లేనిదిగా విత్తబడి, మహిమలో లేపబడుతుంది; అది బలహీనమైనదిగా విత్తబడి, శక్తిగలదానిగా లేపబడుతుంది. 44సహజమైన శరీరంగా విత్తబడి, ఆధ్యాత్మిక శరీరంగా లేపబడుతుంది.
భౌతిక శరీరం ఉంది గనుక, ఆధ్యాత్మిక శరీరం కూడ ఉంది. 45“మొదటి మానవుడైన ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు”#15:45 ఆది 2:7 అని వ్రాయబడి ఉంది; కాని చివరి ఆదాము ఒక జీవి అయ్యాడు. 46ఆధ్యాత్మికమైనది మొదట రాలేదు, కాని భౌతికమైనది మొదట వచ్చింది, దాని తరువాత ఆధ్యాత్మికమైనది వచ్చింది. 47మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు. 48భూమికి చెందిన మానవునిలా భూలోక సంబంధులు ఉంటారు. పరలోకానికి చెందిన వానిలా పరలోక సంబంధులు ఉంటారు. 49మరియు మనం భూసంబంధియైన మనుష్యుని రూపాన్ని ధరించినట్లే పరలోకసంబంధమైన వాని రూపాన్ని ధరించుకుంటాము.
50సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్యంలో పాలుపొందలేవు, నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు. 51నేను మీకు చెప్పే ఈ రహస్యాన్ని వినండి: మనమందరం నిద్రించము గాని, మనమందరం మార్పు చెందుతాము. 52ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము. 53ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి. 54నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది”#15:54 యెషయా 25:8 అని వ్రాయబడిన వాక్యం యదార్థమవుతుంది.
55“ఓ మరణమా, నీ విజయమెక్కడ?
ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”#15:55 హోషేయ 13:14
56మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. 57అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.
58కనుక నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ నిష్ప్రయోజనం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాలలో పూర్తి శ్రద్ధ చూపండి.