4
నిజమైన అపొస్తలత్వం యొక్క స్వభావం
1అందుచేత, క్రీస్తు సేవకులుగా దేవుని మర్మాలను తెలియజేసే బాధ్యత పొందినవారిగా మమ్మల్ని మీరు భావించాలి. 2ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరం. 3మీ చేత లేదా ఏ మానవ న్యాయస్థానంలో గాని నేను తీర్పు తీర్చబడటం నాకు చాలా చిన్నవిషయం. నిజానికి, నన్ను నేనే విమర్శించుకోను. 4నా మనస్సాక్షి నన్ను ఖండించకపోయినా, అది నన్ను నిర్దోషిగా తీర్చదు. నన్ను తీర్పు తీర్చేది ప్రభువే. 5అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయలుపరుస్తారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.
6సహోదరీ సహోదరులారా, “వ్రాయబడిన వాటిని మించి వెళ్లవద్దు” అని చెప్పబడిన మాట భావాన్ని మా నుండి మీరు నేర్చుకోగలిగేలా, మీకు మేలు కలుగడానికి ఈ విషయాలను నా గురించి అపొల్లో గురించి ఉదాహరణగా చెప్పాను. అప్పుడు మమ్మల్ని అనుసరించే వారిగా మీరు, ఒకరిపై ఒకరు అతిశయపడకుండ ఉంటారు. 7ఇతరులకంటే నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? నీవు పొందుకోనిది నీ దగ్గర ఏమి ఉంది? నీవు పొందివుంటే, పొందని వానిలాగా గొప్పలు చెప్పుకోవడం ఎందుకు?
8ఇప్పటికే మీకు కావలసినవన్ని మీరు కలిగివున్నారు! మీరు ధనవంతులైయ్యారు! మేము లేకుండానే మీరు పరిపాలించడం ప్రారంభించారు! మేము కూడా మీతో కలిసి పరిపాలించేలా మీరు నిజంగా పరిపాలించడం నాకు సంతోషమే! 9దేవుడు అపొస్తలులమైన మమ్మల్ని మరణశిక్ష విధించబడినవారి వరుసలో అందరికంటే చివరిగా ఉంచాడని నాకు అనిపిస్తుంది. మేము లోకమంతటికి, దేవదూతలకు అదే విధంగా మనుష్యులకు ఒక వింతగా ఉన్నాము. 10మేము క్రీస్తు కొరకు బుద్ధిహీనులం, కాని మీరు క్రీస్తులో తెలివైన వారు! మేము బలహీనులం, కాని మీరు బలవంతులు! మీరు గౌరవం పొందారు, మేము అవమానం పొందాం! 11ఈ సమయం వరకు ఆకలిదప్పులతో అలమటించాము, చింపిరి గుడ్డలతో ఉన్నాం, క్రూరంగా కొట్టబడ్డాం, నిరాశ్రయులుగా ఉన్నాం. 12మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. మమ్మల్ని శపించినవారిని మేము దీవిస్తున్నాం; మమ్మల్ని హింసించినప్పుడు ఓర్చుకుంటున్నాం, 13మమ్మల్ని దూషించినప్పుడు, దయతో సమాధానం చెప్తున్నాం. ఇప్పటి వరకు మేము భూమి మీద నీచులుగా, లోకంలో పెంటకుప్పగా ఉన్నాం.
పౌలు వేడుకోలు మరియు హెచ్చరిక
14మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు గానీ, నా ప్రియమైన పిల్లలుగా మిమ్మల్ని హెచ్చరించాలని ఈ మాటలు వ్రాస్తున్నాను. 15క్రీస్తులో మీకు పదివేలమంది ఉపదేశకులు ఉన్నా, తండ్రులు అనేకులు లేరు, కనుక క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మీకు తండ్రినైయ్యాను. 16కనుక, నన్ను అనుకరించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. 17ఈ కారణంగా, ప్రభువులో నమ్మకమైనవాడు నేను ప్రేమించే నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపాను. ప్రతి సంఘంలో ప్రతిచోట నేను బోధించిన దానితో ఏకీభవించే యేసుక్రీస్తులో నా జీవన విధానాన్ని అతడు మీకు జ్ఞాపకం చేస్తాడు.
18నేను మీ దగ్గరకు రాననుకొని మీలో కొందరు గర్విస్తున్నారు. 19అయితే, ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరకు వస్తాను, ఆ గర్విష్ఠులు మాట్లాడే మాటలనే కాకుండా వారికి ఏ శక్తి ఉందో తెలుసుకుంటాను. 20దేవుని రాజ్యం అంటే వట్టిమాటలు కాదు అది శక్తితో కూడింది. 21మీరేది కోరుతున్నారు? నేను మీ దగ్గరకు క్రమశిక్షణ అనే బెత్తంతో రావాలా? లేక నేను ప్రేమతో సౌమ్యమైన మనస్సుతో రావాలా?