1 యోహాను 4:7-16

1 యోహాను 4:7-16 TCV

ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కనుక మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కనుక వారు దేవుణ్ణి ఎరిగినవారు. దేవుడే ప్రేమ, కనుక ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. దేవుడు మన మధ్య తన ప్రేమను ఈ విధంగా చూపించారు: ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఇదే ప్రేమ: మనం దేవుడిని ప్రేమించామని కాదు, కాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ప్రియ మిత్రులారా, దేవుడు మనలను ఎంతో ప్రేమించారు కనుక మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించాలి. దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది. మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు. మరియు లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం చూశాము సాక్ష్యమిచ్చాము. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు. ప్రేమ మనకు తెలుసు మరియు మనం దానిపైన ఆధారపడుతున్నాం. దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు.