3
1అలాగే భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. ఒకవేళ వారిలో ఎవరైనా దేవుని వాక్యాన్ని అంగీకరించనివారు ఉంటే, మీరు ఒక్క మాట కూడా పలకాల్సిన అవసరం లేకుండానే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. 2ఎందుకంటే భయభక్తులతో, పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనిస్తారు. 3తల వెంట్రుకలను అలంకరించుకోవడం, బంగారు ఆభరణాలను ధరించడం, విలువైన వస్త్రాలు వేసుకోవడం అనే బాహ్య సౌందర్యం వద్దు. 4మృదువైన, సాధు స్వభావమనే అక్షయమైన అలంకారం గల హృదయపు సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టిలో అమూల్యమైనది. 5ఎలాగంటే, పూర్వకాలంలో పరిశుద్ధులైన స్త్రీలు దేవునిలో నిరీక్షణ ఉంచి ఇలా తమ సౌందర్యాన్ని పోషించుకుంటూ, తమ భర్తలకు లోబడి ఉన్నారు. 6అదే విధంగా శారా అబ్రాహాముకు లోబడి అతడిని యజమాని అని పిలిచింది. మీరు మంచి పనులు చేస్తూ దేనికి బెదరని వారైతే ఆమెకు పిల్లలవుతారు.
7అలాగే భర్తలారా మీరు, మీ భార్యలు జీవమనే కృపావరంలో మీతో జతపనివారై ఉన్నారని ఎరిగి బలహీనులైన మీ భార్యలను గౌరవిస్తూ వారితో కాపురం చేయండి. అప్పుడు మీ ప్రార్థనలకు ఆటంకం ఉండదు.
మంచి చేయడానికి శ్రమపడుట
8చివరిగా మీరందరు ఏక మనసు కలిగి సానుభూతి కలవారై పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయంతో ఉండండి. 9కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి. దానికి బదులుగా ఆశీర్వదించండి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు. 10ఎందుకంటే,
“ఎవరైనా జీవితాన్ని ప్రేమించి
మంచి దినాలను చూడాలనుకుంటారో
వారు చెడు మాట్లాడకుండ నాలుకను
మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.
11వారు కీడు చేయడం మాని మేలు చేయాలి;
వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
12ప్రభువు కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి,
ఆయన చెవులు వారి ప్రార్థనలను వింటున్నాయి,
అయితే ప్రభువు ముఖం కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది.”#3:12 కీర్తన 34:12-16
13మంచి చేయాలని మీకు ఆసక్తి ఉంటే, మీకు హాని చేసేది ఎవరు? 14మీరొకవేళ, నీతి కోసం శ్రమపడినా మీరు ధన్యులు. “వారి బెదిరింపుకు భయపడకండి,#3:14 లేదా వారు భయపడే దానికి భయపడకండి కలవరపడకండి.”#3:14 యెషయా 8:12 15మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి. 16మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో ఉన్న మీ మంచి ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడేవారు తమ మాటలకు తామే సిగ్గుపడతారు. 17అదే దేవుని చిత్తమైతే, కీడు చేసిన బాధపడడం కంటే, మేలు చేసి బాధపడడమే మంచిది. 18ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకురావడానికి, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు. 19ఆయన సజీవుడైన తర్వాత,#3:19 లేదా అయితే ఆత్మలో సజీవుడైన తర్వాత అనగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించారు; 20నోవహు ఓడను నిర్మిస్తున్న రోజుల్లో, దేవునికి అవిధేయంగా ఉన్న వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కోసం సహనంతో వేచి ఉన్నారు. ఓడలోని కొద్దిమంది, అనగా ఎనిమిది మంది మాత్రమే నీటి నుండి రక్షించబడ్డారు. 21ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.#3:21 లేదా స్వచ్ఛమైన మనస్సాక్షి కోసం దేవునికి మొర పెట్టుము 22ఆయన పరలోకానికి వెళ్లి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.